అమెరికా దేవాలయాలకు శక్తిని ఇచ్చే పూజలివి...!
మిల్‌పిటాస్‌లో విజయవాడ కనకదుర్గ అర్చకులు
అమెరికాలో దాదాపు 10 నగరాల్లో జరగనున్న విజయవాడ దుర్గామల్లేశ్వర స్వామివార్ల కనకదుర్గ కుంకుమార్చన పూజలు స్థానిక దేవాలయాలకు 'శక్తి'ని అందిస్తాయని విజయవాడ అమ్మవారి దేవాలయం నుంచి వచ్చిన పూజారులు, అధికారులు చెప్పారు. అమెరికాలో తెలుగు టైమ్స్, పాఠశాల కో ఆర్డినేషన్‌తో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ, విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజలు ఏప్రిల్ 22 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వచ్చిన పూజారులు, అధికారుల బృందానికి మిల్‌పిటాస్‌లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విజయవాడ నుంచి వచ్చిన పూజారులు లింగంభొట్ల దుర్గాప్రసాద్, శంకర శాండిల్య, కోట ప్రసాద్, శంకరమంచి ప్రసాద్, గోపాలకృష్ణలతోపాటు, పీఆర్‌ఓ అచ్చుతరామయ్య, రాష్ట్ర దేవాదాయశాఖ జాయింట్ డైరెక్టర్ సాయికుమార్‌తోపాటు ఈ కుంకుమార్చనల పూజలకు కో ఆర్డినేషన్ చేస్తున్న తెలుగు టైమ్స్ ఎడిటర్, పాఠశాల మేనెజింగ్ డైరెక్టర్ చెన్నూరి వెంకట సుబ్బారావు, శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి మందాడి తదితరులు పాల్గొన్నారు. అమెరికాలో ఇంతకుముందు శ్రీనివాస కళ్యాణం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం, భద్రాచల శ్రీ సీతారాముల కళ్యాణం వంటివి జరిపించామని ఇప్పుడు విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి కుంకుమార్చనల పూజలను వివిధ చోట్ల నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న చెన్నూరి వెంకట సుబ్బారావు అన్నారు. ఈ అమ్మవారి కుంకుమార్చనలో అందరూ పాల్గొని అమ్మ అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
రాష్ట్ర దేవాదాయశాఖ అధికారి సాయికుమార్ మాట్లాడుతూ, అమ్మవారి పూజల్లో పాల్గొనడం ద్వారా అనుగ్రహంతోపాటు శక్తిని కూడా పొందుతారని చెప్పారు. ఇక్కడి దేవాలయాలకు 'శక్తి'ని ఇచ్చేందుకే ఈ పూజలు జరుగుతున్నాయని కూడా తెలిపారు. అమ్మవారికి ఇష్టమైన కుంకుమార్చనలతోపాటు లలితాసహస్రనామ పారాయణం, త్రిశతి, ఖడ్గమాల వంటి పూజల్లో పాల్గొనడం వల్ల భక్తుల కోరికలు నెరవేరడంతోపాటు వారికి సకల సౌఖ్యాలు కలుగుతాయని చెప్పారు.
సత్యనారాయణ స్వామి ఆలయ ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి మందాడి మాట్లాడుతూ, తమ ఆలయంలో ఈ పూజలు చేసుకునే అవకాశం లభించడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. తమ ఆలయంలో ఏప్రిల్ 22,23,24 తేదీల్లో కనకదుర్గ కుంకుమ పూజలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇతరులు కూడా మాట్లాడారు.