35రోజులు...110 సభలతో దూసుకెళ్ళనున్న కేసీఆర్
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి అభ్యర్ధుల గెలుపు బాధ్యతను భుజానవేసుకున్న పార్టీ అధినేత కేసీఆర్ గెలుపుకోసం వ్యూహాలను, ప్రచార ప్రణాళికలను ఖరారు చేశారు. నవంబర్ 1నుండి డిసెంబర్ 5వరకు 35రోజుల్లో వంద నుండి 110నియోజకవర్గాల్లో సభ లకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలు స్తోంది. గత రెండురోజులుగా పార్టీ ముఖ్య నేతలతో వరుసగా భేటీలు నిర్వహిస్తున్న ఆయన ప్రచార వ్యూహాలు, సభల నిర్వహణపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండురోజుల్లో ఈ షెడ్యూల్ ఖరారుకానుంది. దీపావళికి ముందు ఉమ్మడి జిల్లాల్లో ట్రెండ్‌సెట్ సభలు పూర్తిచేయనున్న కేసీఆర్ నవంబర్ 12లోగా మంత్రుల నియోజకవర్గాల్లోనూ ప్రచారం పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఏకపక్షం అనుకున్న నియోజకవర్గాల్లో నామినేషన్లు ముగియనున్న నవంబర్ 19లోగా ప్రచారాన్ని నిర్వహించే యోచనలో ఉన్నారు.
మంత్రులను కూడా త్వరగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించుకోవాలని, ఇతర నియోజకవర్గా లకు అందుబాటులోకి రావాలని సీఎం సూచిస్తున్నారు. దీపావళికి ముందు ఒక దశ, నామినేషన్ల ఘట్టం ముగిసేవరకు మరో దశ, నామినేషన్లు పూర్తయి ప్రత్యర్ధులు ఖరారయ్యాక ఆఖరుదశ నాన్‌స్టాప్ ప్రచారానికి ఇప్పటికే కేసీఆర్ ప్రణాళిక రూపొందించు కున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగానే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 38నియోజకవర్గాలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌లో వెళ్ళి ప్రచారం చేయనున్నారని పార్టీవర్గాలు తెలిపాయి. ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రం నుండి ఉమ్మడి నిజామాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలకు హెలికాప్టర్‌లోని వెళ్ళి ప్రచారం నిర్వహిస్తారు. ఈ జిల్లాల్లో 32నియోజకవర్గాల సభలలో కేసీఆర్ పాల్గొనే అవకాశముంది. ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలన్న దానిపై ఇప్పటికే రూట్‌మ్యాప్ సిద్దం చేసినట్లు సమాచారం. కరీంనగర్ కేంద్రంలోని తీగల గుట్టపల్లి లో సీఎం నివాసం ఉండగా, అక్కడి నుండి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని 40నియోజకవర్గాల సభల్లో హెలికాప్టర్ ద్వారా సీఎం పాల్గొంటారని సమాచారం. సీఎం సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలన్నదానిపై ఇప్పటికే సూత్రప్రాయంగా ప్రణాళిక రూపొందించి ఖరారుచేశారు.