హైదరాబాద్‌లో క్వాల్‌కామ్ రెండో అతిపెద్ద కార్యాలయం
సాఫ్ట్‌వేర్, వైర్‌లెస్ టెక్నాలజీ, సెమికండక్టర్ రంగాల్లో అంతర్జాతీయ దిగ్గజంగా పేరుపొందిన క్వాల్కమ్ సంస్థ ప్రపంచంలోనే తమ రెండో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ శాండియాగోలోని క్వాల్కమ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సంస్థ సీఎఫ్‌వో ఆకాష్ పాల్కివాల, ఉపాధ్యక్షుడు జేమ్స్ జిన్, లక్ష్మీ రాయపూడి, పరాగ్ అగాసే, డైరెక్టర్ దేవ్‌సింగ్‌తో కూడిన సీనియర్ ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఆ సమయంలో కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ నగరంలో వివిధ దశల్లో 3904.55 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలియజేశారు.
రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ లో భారీగా పెట్టుబడి పెడతామన్న క్వాల్కమ్ సంస్థ, తమ విస్తరణతో 8,700 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు సుమారు 15 లక్షల 72 వేల ఎస్‌ఎఫ్‌టీ కార్యాలయం అందుబాటులోకి వస్తుందందని తెలిపింది. పెట్టుబడికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, అక్టోబర్ నాటికి హైదరాబాద్ లో తమ కేంద్రం రెడీ అవుతుందని క్వాల్కమ్ తెలిపింది. ఈ సందర్భంగా క్వాల్కమ్ సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సెమీకండక్టర్ చిప్ తయారీలాంటి రంగాల్లో తెలంగాణను మరింత ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేందుకు క్వాల్కమ్ సంస్థ పెట్టుబడి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.