ASBL Koncept Ambience

మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయం : రాహుల్

మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయం : రాహుల్

మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గం కోస్గిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో మోదీ, తెలంగాణలో కేసీఆర్‌ ఒక్కటేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి కాదని, తెలంగాణ రాష్ట్రీయ సంఘ్‌ పరివార్‌ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఏర్పాటుతో కష్టాలు తీరుతాయని ప్రజలు భావించారని, కొడంగల్‌లో తనకు కాంగ్రెస్‌ గెలుపు కనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి వీస్తోందని, కేసీఆర్‌ను ఓడించడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన కేసీఆర్‌, ప్రతి యువకుడు నిరాశ, అసంతృప్తితో ఉన్నాడని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ రూ.17వేల కోట్ల మిగులు బెడ్జెట్‌తో మొదలైన తెలంగాణను 2 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతి వ్యక్తిపై అప్పు ఉంటే, కేసీఆర్‌ కొడుకు ఆదాయం 4 వందల రెట్లు పెరిగిందని విమర్శించారు. 40 వేల కోట్ల ప్రాణహిత ప్రాజెక్టు వ్యయాన్ని 80 వేల కోట్లకు పెంచారని, కేసీఆర్‌ ప్రాజెక్టు పేరు మార్చి 40 వేల కోట్ల దోపిడీ చేశారని మండిపడ్డారు.

లక్ష ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్‌ ఎన్ని ఇచ్చాడో ఆలోచించండి. కేసీఆర్‌ కుటుంబంలో నలుగురికి ఉద్యోగాలు వచ్చాయి. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష గ్రాంట్‌ ఇస్తాం. మహిళా పారిశ్రామికవేత్తలకు రూ.500 కోట్లు కేటాయిస్తాం. పేదలకు ఇళ్లు, దళితులు, గిరిజనులకు భూమి ఇస్తాం. యువతకు ఉపాధి, నిరుద్యోగులకు రూ.3వేల భృతి ఇస్తాం. తొలి ఏడాదిలోనే లక్ష  ఉద్యోగాలు కల్పిస్తాం అని రాహుల్‌ భరోసా ఇచ్చారు.

 

Tags :