అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మన వాళ్ళు : రాజు చింతల
తెలంగాణకు చెందిన రాజు చింతల 1994లో అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. ఇండియానాపొలిస్ తెలుగు సంఘం (గీత)లో చురుగ్గా పనిచేస్తూ కమ్యూనిటీకి బాగా దగ్గరయ్యారు. అంచెలంచెలుగా అన్నీ భారతీయ సంఘాలతో మమేకమై కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి వ్యక్తి అయిపోయారు. మరోవైపు అక్కడి అమెరికన్‌లతో కూడా మంచి సన్నిహిత బంధాలను నెరపి అక్కడి నాయకులకు కూడా దగ్గరయ్యారు. ఇండియానాపొలిస్ మెయర్ గ్రెగ్ బల్లార్డ్‌తో కలిసి హైదరాబాద్ పర్యటించి హైదరాబాద్‌ను ఇండియానాపొలిస్ సిస్టర్ సిటీగా చేయడంలో చురుకైన పాత్రను పోషించారు.
2003లో రిపబ్లికన్ పార్టీలో చేరారు. 2004లో పార్టీ నిర్వహించిన లీడర్‌షిప్ ఫోరం ఇన్ గ్రాడ్యుయేషన్ శిక్షణ తరగతులకు హాజరై నాయకత్వ లక్షణాలను బాగా తెలుసుకున్నారు. లీడర్‌గా బయటకు వచ్చిన ఆయన పార్టీ బలోపేతానికి కమ్యూనిటీలో తనకు ఉన్న పరిచయాలతో మంచి ప్రాచుర్యాన్ని కల్పించారు. సిటీ, స్టేట్, లోకల్ గవర్నమెంట్‌లో వలంటీర్‌గా ఉంటూ వ్యూహరచన నిపుణునిగా, ఫండ్‌రైజర్‌గా, పార్టీ ప్రచార కమిటీల్లో సభ్యునిగా ఎదిగారు. మారియన్ కౌంటీలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. హ్యామిల్టన్ కౌంటీలో కూడా ఆ పార్టీకి విస్తృత ప్రచారాన్ని కల్పిస్తున్న రాజు సేవలను గమనించి ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్, ఇండియానా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు జెఫ్ కార్ట్‌వెల్‌లు రాజును పార్టీ జాతీయ మహాసభల్లో ప్రత్యామ్నాయ ప్రతినిధిగా ఎంపిక చేశారు. ఇమ్మిగ్రేషన్, ఇంటర్నేషనల్ ఎఫైర్స్, హెల్త్‌కేర్ ఏరియాలో తనదైన శైలిలో ఆయన దూసుకుపోతున్నారు.
ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్‌తో మంచి సన్నిహిత సంబంధాన్ని రాజు చింతల మొదటి నుంచి కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన గవర్నర్‌గా పోటీ చేసినప్పుడు ఆయన ఫండ్‌రైజింగ్ మీటింగ్‌లను తన ఇంటి నుంచే ప్రారంభించారు. దాంతో మైక్‌పెన్స్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడింది. దాంతో ఆయన హెల్త్‌కేర్ పాలసీకి అడ్వయిజర్‌గా రాజు చింతల నియమితులయ్యారు.
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పార్టీ తరపున ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన వైస్ ప్రెసిడెంట్‌గా ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. అమెరికాలో దాదాపు 2.3 బిలియన్ డాలర్ల మిగులు ఉన్న రాష్ట్రంగా ఇండియానాను పేర్కొంటారు. దాంతోపాటు మైక్‌పెన్స్ రిపబ్లికన్ గవర్నర్స్ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. దానివల్ల డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చేలా మిగతా రాష్ట్రాల గవర్నర్‌లను ఒప్పించడంలో మైక్‌పెన్స్ చూపిన చొరవ ఆయనను వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యేలా చేసింది. తొలుత ట్రంప్ అభ్యర్థిత్వాన్ని అంగీకరించని పార్టీ గవర్నర్‌లు నిక్కీహేలే, బాబీ జిందాల్‌లాంటి వాళ్ళని కూడా చివరి నిముషంలో మద్దతు ఇచ్చేలా మైక్‌పెన్స్ చేసిన కృషి వల్లనే నేడు ఆయనకు పార్టీలో మెజారీటి లభించింది. మైక్‌పెన్స్ క్రిస్టియన్ మతానికి గట్టి మద్దతుదారుడు. ట్రంప్‌కు మద్దతుగా మైక్‌పెన్స్ నిలవడం వల్ల క్రిస్టియన్‌ల ఓట్లు ఆయనకు లభించే అవకాశాలు ఎక్కువయ్యాయి.
డొనాల్డ్ ట్రంప్ ఆది నుంచే తన ప్రచారాన్ని విభిన్నంగా మొదలెట్టారు. మాస్‌ను ఆకట్టుకోవడానికే ఆయన ప్రయత్నించారు. తన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ఉన్నప్పటికీ అది మాస్‌ను బాగా ఆకట్టుకుంటుందన్న విషయం ఆయనకు బాగా తెలుసు. బిజినెస్‌మ్యాన్‌గా ఉన్న ట్రంప్‌కు మనుష్యులను ఎలా ఆకట్టుకోవచ్చో చెప్పాల్సిన పనిలేదు. ఒక వ్యూహంతో ఆయన తన ప్రచారాన్ని చేసుకుంటూ తన అభ్యర్థిత్వానికి అందరూ మద్దతు ఇచ్చేలా చేసుకున్నారు. ఆయన చేస్తున్న ప్రచారంలో ముఖ్యమైనది స్థానికులకు ఉద్యోగావకాశాలు. అమెరికాలో శాంతిభద్రతల సమస్య. ఈ రెండు విషయాల్లో ఆయన చెప్పే మాటలు అమెరికన్‌లు బాగా ఆకట్టుకున్నాయి. అమెరికాలో ఉన్న ఉద్యోగాలను ఇతరదేశాల వాళ్ళు కొట్టుకుపోతున్నారని ఆయన చెబుతున్న మాటలు వాస్తవంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒబామా హయాంలో స్థానికులకు పెద్దగా ఉద్యోగావకాశాలు పెరగలేదు. దాంతో అమెరికన్‌లలో ఒకవిధమైన ఆందోళన నెలకొంది. అమెరికాలో శాంతిభద్రతల పేరుతో అన్నీ చోట్లా గట్టి భద్రతా చర్యలను చేశారు. భద్రతా చర్యల పేరుతో చేస్తున్న తనిఖీల వల్ల ఎంతో సమయం వృధా అవుతోందని, అనవసరమైన భయాందోళనలు సమాజంలో పెరిగిపోతోందని అమెరికన్‌లు భావిస్తున్నారు. ఈ రెండింటిమీద ట్రంప్ చేస్తున్న ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది.
హెచ్ 1 వీసా, ఔట్‌సోర్సింగ్ విషయాల్లో ట్రంప్ చేస్తున్న ప్రచారం భారతీయులకు వ్యతిరేకంగా కాదు. అక్రమంగా ఇక్కడే స్థిరపడిన మెక్సికో, చైనా వంటి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నవని రాజు చింతల చెబుతున్నారు. మైక్‌పెన్స్‌కు దగ్గరగా ఉండటం వల్ల భారత్‌తో ముఖ్యంగా హైదరాబాద్‌ను ఇండియానాపొలిస్‌కు సన్నిహితం చేయడంలో రాజు చింతల కీలకపాత్రను పోషిస్తున్నారు. మొన్న తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె. తారకరామారావు అమెరికా వచ్చినప్పుడు ఆయనను ఇండియానాపొలిస్‌కు తీసుకువెళ్ళి గవర్నర్‌తో భేటీ అయ్యేలా చేశారు. ట్రంప్ విజయాన్ని సాధిస్తే మైక్‌పెన్స్ ఉపాధ్యక్షుడు అవుతాడని ఆయనను వచ్చే సంవత్సరం హైదరాబాద్‌కు తీసుకువస్తానని రాజు చింతల చెబుతున్నారు. భారత-అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేలా కృషి చేస్తానని కూడా ఆయన పేర్కొంటున్నారు.