ఆటాలో స్పెషల్ షో.. రామ్ మిరియాల మ్యూజికల్ షో
తెలుగు సినిమాల్లో పాడినది కొద్దిపాటలే అయినా పేరు మాత్రం ప్రపంచమంతా మారుమ్రోగింది. రామ్ మిరియాల పూర్తి పేరు రామకృష్ణ మిరియాల. తెలుగు సినిమా గాయకుడు, రచయిత, సంగీత దర్శకుడు కూడా. ఆయన జాతిరత్నాలు సినిమాలో పాడిన ‘‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’’, కరోనా సమయంలో ‘చేతులెత్తి మొక్కుతా’ వంటి పాటలు ఆయనకు మంచి పేరును గుర్తింపును తెచ్చాయి.
రామ్ మిరియాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలం, కోలంక గ్రామంలో 30 అక్టోబర్ 1993లో జన్మించాడు. ఆయన ఇంటర్మీడియట్ వరకు తూర్పు గోదావరి జిల్లాలో చదివి హైదరాబాద్ వెస్లీ కాలేజీలో బీకామ్ పూర్తి చేశాడు. గాయకుడు అయిన రామ్ మిరియాల తొలినాళ్లలో ‘చౌరస్తా బ్యాండ్’ అంటూ అలరించారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో సినీ పరిశ్రమలో మంచి గాయకుడిగా ఇప్పుడు రాణిస్తున్నారు. తన సినిమా పాటలతో అందరితో స్టెప్పు లేయిస్తున్నారు. యూట్యూబ్‌లో ఆయన పాటలు రికార్డులను సృష్టిస్తున్నాయి. ఆటా మహాసభల్లో జూలై 1న, శుక్రవారం నాడు తన పాటలతో ఆయన మెప్పించనున్నారు.