రామానుజుల సమభావన నేటి సమాజానికి అవసరం- చినజీయర్ స్వామి
భగవద్రామానుజులు ఆనాడే సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపేందుకు కృషి చేశారు. ఆయన చూపిన బాటలోనే నేటిసమాజం నడవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు మనుష్యుల్లో స్వార్థం, పెడధోరణులు బాగా పెరిగిపోయాయి. ఇలాంటివాటికంతా ఫుల్‌స్టాప్ పెడుతూ, మనం, మనతోపాటు కుటుంబం సమాజం అంతా బాగుండాలని కోరుకుం టూ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం కృషి చేస్తుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చెప్పారు. శంషాబాద్ సమీపం లోని ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన 216 అడుగుల రామానుజుల విగ్రహ ప్రారంభం నేపథ్యంలో కొన్ని విషయాలను ఆయన తెలుగు టైమ్స్‌కు తెలిపారు.
సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సాధారణ గుడిగా, ఓ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించి దర్శనం చేసుకుని వెళ్తే ఉపయోగం ఉండదు. రామానుజుల ఆలోచనలు, సమాజానికి అందించిన సేవలు, మానవాళికి ఇచ్చిన సందేశం ఏంటో ప్రజలు గ్రహించగలగాలి. ఆ దిశగానే అగుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, మిక్స్‌డ్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. రామానుజుల సందేశం వ్యవస్థలోకి చేరేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వైష్ణవంలో దివ్య దేశాలుగా పేర్కొనే 108 దేవాల యాల నమూనాలను స్ఫూర్తి కేంద్రంలో నిర్మించాం. వాటిని దేవాలయాలుగా భావించి కాదు, రామానుజులను ప్రభావితం చేసిన ప్రాంతాల నేపథ్యంగా ఏర్పాటు చేశాం. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంగా దీనికి నామకరణం చేశాము.
నేటి సమాజం బాగుండాలంటే మన విద్యావ్యవస్థలో మార్పులు రావాలి. పిల్లలకు చిన్నప్పుడే వారిలో నైతికత పెంపొందించే చదువును నేర్పించాలి. దేశీయ సంస్కృతి, సంప్రదాయాలు, మన పూర్వీకుల వైజ్ఞానిక ప్రతిభవంటివాటిని చిన్నప్పుడే విద్యార్థులకు తెలియజేసేలా మన విద్యాబోధన ఉండాలి. రాముడు చూపించిన ధర్మమార్గం, భగవద్గీత తెలియజేసిన జీవనవిధానం పిల్లలకు చిన్నప్పుడే తెలియజేయాలి. అప్పుడే వారు నైతికంగా, గొప్పవారుగా ఎదుగుతారు. సమాజంలో అందరూ సమానమే, అందరికీ అవకాశాలు ఉండాలన్న రామాజనుజుల స్ఫూర్తిని తెలియజేయడానికే అతి పెద్దదైన రామానుజుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామని కూడా ఆయన చెప్పారు. ఈ విగ్రహం ఏర్పాటు వెనుక ఉన్న పరమార్థం ఇదే అని చెప్పారు.
కొన్ని వేలఏళ్ల కిందటే కచ్చితమైన ఖగోళ రహస్యాలను వరాహమిహిరుడు గ్రంధస్థం చేశారు. ఇలాంటి మన పూర్వీకుల వైజ్ఞానిక అద్భుతాలను మన విద్యార్థులకు చిన్నప్పుడే తెలియచెప్పాలి. అలాగే మన సంప్రదాయ వైద్యం, నాటి వైజ్ఞానిక అద్భుతాలను తెలియజేసేందుకు ఇప్పుడైనా ప్రయత్నించాలి. కొత్త జాతీయ విద్యా విధానంతో దీనిని అమలులోకి తీసుకురావచ్చు. సమాజంలో ఓ భాగంగా సమాజ సమగ్ర వికాసానికి ఉపయోగపడాలన్న ఆలోచన అందరిలో ఉండాలనేది రామానుజుల సందేశం. దీన్నే ఆయన వేదాంత పరిభాషలో శరీర శరీరి భావ సంబంధంగా పేర్కొన్నారు. రామానుజుల ఆలోచన సంపత్తిలో ఇదే కీలకం. కొందరిపై అంటరానివారిగా ముద్ర వేసి, సమాజానికి దూరంగా పెట్టిన భయంకర పరిస్థితులున్న సమయంలో రామానుజులు వారిని జనజీవన స్రవంతిలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. పంచ సంస్కారాలు చేశారు. మంత్రదీక్షలు ఇచ్చి, వైష్ణవులుగా మార్చారు. తిరుక్కులతార్‌గా వారికి గౌరవప్రదమైన కులానికి చెందినవారన్న పేరు పెట్టారు. ఇది రామానుజులు వేసిన విప్లవాత్మక అడుగు.
పండితలోకాన్ని, పాలకులను, ప్రజలను ఒప్పించి ముందుకు సాగిన మహనీయుడు రామానుజులు. ఇప్పుడూ కులాల మధ్య భారీ అగాధం కనిపిస్తోంది. దీనిని పూడ్చాలంటే మళ్లీ రామానుజులు రావాల్సిందే..వారి సిద్ధాంతాలు అందరికీ తెలియజేయాల్సిందే. అందుకోసం సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం అలాగే రామానుజులవారు చెప్పినట్లు ‘మాధవ సేవగా సర్వప్రాణి సేవ’ చేయాలి. ప్రకృతిని వాటిమానాన వాటిని బతకనీయడమే మనం చేయాల్సింది. అలాగే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో అద్భుతమైన డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తున్నాం. సమతా భావం కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడిన మహనీయుల చరిత్రను అందులో నిక్షిప్తం చేస్తున్నాం. అబ్రహం లింకన్, మండేలా, మలాలా.. ఇలాంటి 116 మందిని గుర్తించి వారి వివరాలను నిక్షిప్తం చేశాం. రామానుజుల ప్రబోధాలను జనంలోకి తీసుకెళ్లి మార్పునకు అవకాశం కల్పించడం, దేశ పురోగతికి బాటలు వేసేలా చేయాలన్నది నా కల. ఈ కేంద్రం ఏర్పాటుతో కొంత నెరవేరినట్లవుతోంది. దీన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా కాకుండా దారితప్పిన మనిషి పరివర్తనకు బాట వేసే కేంద్రంగా పరిగణించాలని చినజీయర్ స్వామి కోరారు.