ఘనంగా రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ శోభయాత్ర
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా జీయర్ ఆస్పత్రి నుంచి యాగశాల వరకు శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభయాత్రలో త్రిదండి రామానుజ చినజీయర్ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు. శోభయాత్ర పూర్తియిన అనంతరం వాస్తు శాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్ర 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకుర్పారణ జరిగింది. ఉత్సవాలలో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభం కానున్నాయి.
అనంతరం అరణి మథనం, అగ్ని ప్రతిష్ట జరుగుతాయి. సమతా స్ఫూర్తి కేంద్రంలో నేటి నుంచి 14 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. 12 రోజుల పాటు చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో కొనసాగనుంది. ఉత్సవాలలో భాగంగా భారీ ఎత్తున లక్ష్మీనారాయణ మహాయజ్ఞం కొనసాగనుంది. 108 దివ్వదేశాల ప్రతిష్ఠ కుంభాభిషేకం, స్వర్ణమయ రామానుజ ప్రతిష్ట, సమతామూర్తి లోకార్పణ జరగనుంది. ఈ ఉత్సవాలకు ఈ నెల 5న ప్రధాని నరేంద్ర మోదీ, 7న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, 8న హోంమంత్రి అమిత్ షా, 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరు కానున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ముచ్చింతల్‌లో పెద్ద ఎత్తున పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.