అంతపెద్ద రామానుజ విగ్రహం తయారీకి ముందు.. వెనక
ప్రపంచంలోని లక్షలాది భక్తులను, భారతదేశంలోని రాష్ట్రపతి, ప్రధాని నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు ఇలా ఎందరో విఐపిలను ఆకట్టుకున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన శ్రీ భగవద్ రామానుజ అతి పెద్ద విగ్రహం, ఆ ప్రాంగణ ఏర్పాటు వెనుక ఉన్న కృషిని శ్రీ త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి తెలుగు టైమ్స్‌కు వివరించారు.
- గుడిలో ప్రతిష్టించే చిన్న దేవుడి విగ్రహం రూపొందించాలంటేనే ఎంతో కష్టం. ఒక్కో గుళ్లో ఒక్కోలా దేవుడు కనిపిస్తుంటాడు. ఇక ఊరు మధ్యలో పెట్టే విగ్రహాల గురించి అయితే చెప్పనవసరమే లేదు. సిమెంట్, రాయితో చేసే విగ్రహాలను తయారు చేయడమే ఎంతోకష్టమైతే.. ఇక అతిపెద్దదైన.. ప్రపంచంలోనే రెండోదైన.. 108 అడుగుల.. పంచలోహ రామానుజాచార్యుల విగ్రహాన్ని రూపొందించడం ఇంకెంత కష్టమో, దానికెంత నైపుణ్యం అవసరమో ఊహించు కోవచ్చు. మరి, అది ఎలా సాధ్యమైంది? భగవత్ సంకల్పంతో పాటు చినజీయర్‌స్వామి కృషి, పట్టుదలే అందుకు కారణం అంటున్నారు. చైనా కంపెనీ పనితీరూ ఆ సమతామూర్తి రూపాన్ని సాకారం చేసిందని చెబుతున్నారు. ఆ వివరాలను దివ్యక్షేత్ర ప్రధాన స్థపతి డిఎన్‌వి ప్రసాద్ వివరించారు.
- 2013లో ఆలోచన మొదలై.. 2014 మేలో విగ్రహ నిర్మాణ పనులకు తొలి అడుగు పడిరది. ముందుగా రామానుజాచార్యుల రూపంతో.. 14 రకాల నమూనాలను చినజీయర్‌స్వామి తయారు చేయించారు. అందులో ఆయనకు నచ్చిన మూడిరటిని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ మూడు నమూనాలలోని మేలైన రూపురేఖలను మిక్స్ చేసి.. మరో అద్భుతమైన నమూనా తయారు చేశారు. ఆ డ్రాఫ్ట్‌ను బెంగళూరులో 3డీ స్కానింగ్ చేయించారు. ఆ విధంగా విగ్రహ.. ఆబ్జెక్ట్ ఫైల్ రెడీ అయింది. ఆ సాఫ్ట్‌ఫైల్ రూపాన్ని.. మాయ, మడ్‌బ్రష్ సాఫ్ట్‌వేర్లతో మరింత అందంగా మలిచారు. యజ్ఞోపవీతం, శిఖ, గోళ్లు, వేళ్లు, వస్త్రం వంటి చిన్నచిన్న అంశాలను సైతం అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దారు. ఇప్పటి రూపు రావడం కోసం.. ప్రధాన స్థపతి ఆధ్వర్యంలో.. 22 రోజులపాటు నిత్యం 18 నుంచి 19 గంటల పాటు శ్రమించారు. చినజీయర్‌స్వామి రోజూ రెండు, మూడు గంటలు కేటాయించి సంప్ర దాయ, శాస్త్ర, కొలతలకు సంబంధించిన సూచన లిస్తూ, సాఫ్ట్‌వేర్ ఫైల్ తయారు చేయించారు.
- అలా తయారు చేసిన రామానుజాచార్యుల సాఫ్ట్‌వేర్ ఫైల్‌ను.. విగ్రహం రూపం తీసుకురావడానికి అంతర్జాతీయ స్థాయి కంపెనీని ఎంచుకున్నారు. ఇలాంటి భారీ విగ్రహాల తయారీలో విశేష నైపుణ్యం, అనుభవం ఉన్న చైనాలోని ఏరోసెన్ కార్పొరేషన్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.
- పంచలోహ విగ్రహం తయారీకంటే ముందుగా.. ప్రత్యేక యంత్రం సాయంతో రోబోటిక్ టెక్నాలజీ తో.. థర్మోకోల్‌తో 1:10 మోడల్ (సుమారు 16 నుంచి 17 అడుగుల ఎత్తు)లో నమూనా విగ్రహం తయారు చేశారు. చినజీయర్ స్వామి చైనా వెళ్లి ఆ మోడల్‌ను పరిశీలించి కొన్ని సవరణలు చెప్పారు. ఆ మేరకు సాఫ్ట్‌వేర్ ఫైల్‌లోనూ మార్పు లు చేశారు. ఆ ఫైల్‌తో మరో సారి థర్మో కోల్‌ను 1:1 మోడల్‌గా కత్తిరించి.. 20 అడుగుల విగ్ర హం తయారు చేశారు. ఆ ఫైనల్ మోడల్‌ను చిన జీయర్ ఓకే చేయడంతో.. ప్రధాన స్థపతి బృందం చైనా వెళ్లి క్యాస్టింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- పూర్తిగా పంచలోహాలతో సమతామూర్తి విగ్రహం తయారు చేశారు. 83 శాతం రాగితో పాటు వెండి, బంగారం, జింక్, టైటానియం లోహా లతో.. ఈ పంచలోహ రామానుజాచార్యుల వారు తయారయ్యారు. విగ్రహం అంతా ఒకే పీస్‌గా కాకుండా.. 1600 ముక్కలుగా చైనాలో సిద్ధం చేశారు. వాటిని తీసుకువచ్చి.. అప్పటికే ముచ్చిం తల్‌లో తయారైన స్టీల్ నిర్మాణంపై లేయర్లుగా అతికించారు. ఏరోసెన్ కార్పొరేషన్‌కు చెందిన 70 మంది నిపుణుల బృందం ఇక్కడికి వచ్చి విగ్రహానికి రూపునిచ్చింది. ఈ మొత్తం ప్రక్రియకు 15 నెలలు పట్టింది. ఇదిగో ఇప్పుడిలా 216 అడుగుల ఎత్తున.. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా వెలుగొందుతున్నారు సమతామూర్తి.. శ్రీరామానుజాచార్యులు.