రామానుజాచార్య సహస్రాబ్ది వేడుకలు...వైభవంగా పరమేష్టి, వైభవేష్టి హోమం
హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహంలో భాగంగా ఆదివారం ప్రత్యేక హోమాలు, పూజలు చేశారు. ఉదయం అష్టాక్షరీ మంత్ర పఠనంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. తర్వాత లక్ష్మీనారాయణ మహాయాగంలో భాగంగా పరమేష్టి, వైభవేష్టి హోమాన్ని చినజీయర్ స్వామి సారథ్యంలోని రుత్వికులు నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేష్టి యాగంవెనుక ఉన్న పరమార్థాన్ని వివరిస్తూ, మానవుడికి కలిగే కొన్ని రకాల రుగ్మతలకు ఎలాంటి మందులు లేవని.. భగవన్నామ స్మరణ, జపం ద్వారా అలాంటి రుగ్మతలను జయించడమే పరమేష్టి ఉద్దేశమని చెప్పారు. పితృదేవతలను సంతృప్తిపరుస్తూ వారి అనుగ్రహాన్ని పొందడమే వైభవేష్టి ఉద్దేశమని రుత్వికులు వెల్లడిరచారు. 115 యాగశాలల్లోని 1,035 యజ్ఞ కుండాల వద్ద వేదమంత్రోచ్ఛరణల మధ్య ఈ హోమం జరిగింది. తర్వాత మూలమంత్ర హవనం, 108 తర్పనం, 28 పుష్పాంజలి, చివరిగా పూర్ణాహుతి నిర్వహించారు.