మహానాడుకు రాయపాటి, రామసుబ్బారెడ్డి డుమ్మా
నేత తీరుపై అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలు
హరికృష్ణ, బాలకృష్ణ, జూ. ఎన్టీఆర్‌దీ అదే బాట
తెలుగుదేశం పార్టీ తాజాగా నిర్వహించిన మహానాడుకు ఇద్దరు సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం గమనార్హం. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, సీనియర్ నేత ఎస్వీ రామసుబ్బారెడ్డి మహానాడుకు దూరంగా ఉన్నారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఎస్వీ సుబ్బారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇక తనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి తనకు ఇస్తానని హామీ ఇవ్వకపోవడంతో ఎంపీ రాయపాటి అసంతృప్తితో రగిలిపోతున్నట్టు తెలుస్తోంది.
మహానాడు వేదికగా టీడీపీలోని పలు లుకలుకలు బయటపడ్డాయి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు కుటుంబం ఈ మహానాడుకు దూరంగా ఉంది. నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ, బాలకృష్ణ, యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు రాయపాటి, ఎస్వీ రామసుబ్బారెడ్డి కూడా మహానాడుకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.