రెడీ అయిన ప్రాజెక్టుల్లోనే కొనుగోళ్ళు....
హైదరాబాద్‌లో ఇప్పుడు ట్రెండ్ మారింది. గతంలోలాగా ప్రాజెక్టులు కడుతున్నప్పుడే ఫ్లాట్లను, ఇళ్ళను బుక్ చేయడం లేదు. అందుబాటులో రెడీగా ఉన్న పూర్తయిన ప్రాజెక్టుల్లోనే ఇళ్ళను కొనుగోలు చేసేవారు ఎక్కువయ్యారు. ఓవైపు ఇళ్ళ అమ్మకాలు పెరిగినప్పటికీ పూర్తయిన ప్రాజెక్టులపైనే అందరూ మోజు చూపుతుండటం గమనార్హం. ఓ సర్వేలో కూడా ఈ విషయం వెల్లడైంది.
హైదరాబాద్ వంటి మహానగరంలో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు గతంలో ఆరేడు నెలల ముందే ఫ్లాట్లను బుక్ చేసుకునేవారు. ఆ ఫ్లాట్ కంప్లీట్ అయ్యేంతవరకు వేచి ఉండేవారు. కాని ఇప్పుడు అలా వేచి ఉండేవాళ్ళు కనిపించడం లేదు. అన్నీ పూర్తయి రెడీమేడ్‌గా అన్నీ సౌకర్యాలు ఉన్న గృహాలను నయా బయ్యర్లు వెంటనే కొనుగోలు చేస్తున్నారు. కొత్త బయ్యర్లరాకతో హైదరాబాద్‌లో ఫ్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో సుమారు 15 నుంచి 30 శాతం దాకా పెరుగుదల నమోదు కావడం గమనార్హం. కాకపోతే, వీరంతా గహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల్లోనే కొనుగోలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఒక ప్రాజెక్టులో ఫ్లాటు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చే ముందు, వీరంతా ఆధునిక సదుపాయాలు, ప్రజారవాణా అందుబాటులో ఉందా? వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే, గత నెల నుంచి కొనుగోలుదారులు ప్రాజెక్టులను విరివిగా సందర్శిస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్, మహబూబ్‌నగర్, వికారాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, ఖమ్మం వంటి జిల్లాల్లోనూ ఇళ్ళను కొనుగోలు చేసే వారి సంఖ్య అధికమైంది. ఇందులో అపార్టుమెంట్లను కొనేవారి శాతం 30 నుంచి 35 శాతముండగా.. ప్లాట్ల కోసం చూసేవారి సంఖ్య 50 శాతమున్నది. ఇక, బహుళ అంతస్తుల అపార్టుమెంట్లలో ఎంచుకోవడానికి 15 నుంచి 20 శాతం మంది ముందుకొస్తున్నారు.
హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారు..పలు ప్రాజెక్టులను సందర్శిస్తూ, గతంలో ఉన్న రేటు, ప్రస్తుత ధరను పరిశీలించి కొనుగోళ్ళకు ముందుకు వస్తున్నారు. నిర్మాణం పురోగతిని పక్కాగా అంచనా వేయడంతో పాటు రేటును కూడా గమనించాకే అడుగు ముందుకేస్తున్నారు.