ధైర్యం ఇచ్చింది రామన్న... ఐటీ తెచ్చింది చంద్రన్న : రేవంత్ రెడ్డి
ప్రపంచంలో ఎక్కడైనా తెలుగువారు తలెత్తుకుబతికే ధైరాన్ని ఇచ్చింది స్వర్గీయ ఎన్.టి.రామారావు అయితే తెలుగువారి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన ఐటీని తెలుగు రాష్ట్రాలకు తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు అని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలు కార్యక్రమంలో నాట్స్ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడైనా మేము తెలుగువారము అని చెప్పుకోగలిగే ధైరాన్ని ఇచ్చింది ఎన్.టి రామరావు అని అన్నారు. దేశానికి ఐటీ గురించి పెద్దగా తెలియని రోజుల్లోనే ఐటీని తెలుగు రాష్ట్రానికి పరిచయం చేసి, తెలుగువారిలో ఉన్న సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ప్రపంచంలో ఉన్న ఐటీ నిపుణులతో ప్రతి పది మందిలో నలుగురు భారతీయులు ఉంటే ఆ నలుగురిలో ఒకరు తప్పకుండా తెలుగువారు ఉన్నారని తెలిపారు. ప్రపంచంలో ఉన్న ఐటీ నిపుణులలో పది శాతం మంది తెలుగువారే కావడానికి చంద్రబాబు చేసిన కృషి ప్రధాన కారణమని కితాబిచ్చారు. ఐటీ నిపుణులను హైదరాబాద్‌కు రప్పించి, హైటెక్ సిటీని నిర్మించి, ఐటీలో ప్రగతి సాధించడానికి అవసరమైన కళాశాలలను ఏర్పాటు చేసి ఈరోజున ప్రపంచానికే ఐటీ నిపుణులను ఉత్పత్తి చేసే స్థాయికి తెలుగు రాష్ట్రాలు చేరుకోవడానికి చంద్రబాబే కారణమని ప్రశంసించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని నిర్మించడంతోపాటు అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్డును ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి నగరాలలో హైదరాబాద్ కూడా ఒకటి అని గుర్తింపు వచ్చేలా చేసిందికూడా చంద్రబాబు పాలనలోనేనని అన్నారు.
ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఐటీ నిపుణులలో 4 లక్షల మంది తెలుగువారే కావడం తామందరికీ గర్వకారణమన్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలను, అంతర్జాతీయ పరిణామాలను కూడా ఆయన విశ్లేషిస్తూ లక్షల సంఖ్యలో ఉన్న తెలుగు ఐటీ నిపుణులు తమ వాణిని వినిపించడానికి రాజకీయాన్ని వేదికగా చేసుకోవాలని సూచించారు. 4 లక్షల మంది తెలుగు ఐటీ నిపుణులు ఒక వేదికపైకి వస్తే చేయలేనిదేమీ ఉండదని అభిప్రాయపడ్డారు. ఐటీ నిపుణులందరూ ఒక్కతాటిపై నిలిచి అమెరికాలోని రాజకీయాలలో కీలక పాత్రను పోషించాలని అన్నారు. ఐటీ నిపుణులు ముందుకువస్తే వారికి తమ తెలుగుదేశం పార్టీ, తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాట్స్ చైర్మన్ శ్రీనివాస్ మద్దాలి, ప్రెసిడెంట్ మోహనక్రిష్ణ, అమెరికా తెలుగు సంబరాలు 2017 చైర్మన్ రవి ఆచంట, వైస్ చైర్మన్లు ప్రవీణ్ మోటూరు, ఫణి రామినేని, కార్యదర్శి మధన్ పాములపాటి తదితరులు రేవంత్‌ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.