ASBL Koncept Ambience

టీఆర్ఎస్ లో చేరిన కార్తీక్ రెడ్డి

టీఆర్ఎస్ లో చేరిన కార్తీక్ రెడ్డి

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 83 గ్రామాల అభివృద్ధికి శాపంగా మారిన జీఓ సంఖ్య 111ను పర్యావరణహితంగా సడలించడానికి కార్యాచరణ ప్రారంభమైందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ యువ నేత పి.కార్తీక్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భంగా శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ  సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ త్వరలో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మరో హైటెక్‌ సిటీలా ఆవిర్భవించనుందని తెలిపారు. ఇక్కడి కొత్వాల్‌గూడలో నైట్‌ సఫారీ పార్కు, ఎయిర్‌ పోర్టు సిటీ, గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలు, రాజేంద్రనగర్‌లో ఐటీ కస్లర్‌ ప్రాజెక్టు, చందనవెల్లిలో పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పారు. ఎంఎంటీఎస్‌ రైలు మార్గాన్ని శంకరపల్లి వరకు నిర్మించి తీరుతామన్నారు.

పాలమూరు రంగారెడ్డి, ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో సాగునీటిని పరిగి, వికారాబాద్‌, తాండూరు, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలోని లక్ష ఎకరాలకు అందిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో 16 మంది అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎవరు ఎగురవేయాలో తెలంగాణ ప్రజలు నిర్దేశించే అవకాశం ఉంటుందన్నారు. చేవేళ్ల పార్లమెంట్‌ బరిలో ఎవరు దిగినా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రూ.100 కోట్లతో గండిపేట జలాశయాన్ని ఆహ్లాదభరితంగా తీర్చిదిద్దుతమన్నారు.

 

Tags :