ASBL Koncept Ambience

యువతకు అండగా తానా ఉండాలి అదే మా టీమ్‌ లక్ష్యం... అధ్యక్ష అభ్యర్థి సతీష్‌ వేమూరి

యువతకు అండగా తానా ఉండాలి అదే మా టీమ్‌ లక్ష్యం... అధ్యక్ష అభ్యర్థి సతీష్‌ వేమూరి

తానా ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్న సతీష్‌ వేమూరి తన టీమ్‌తో కలిసి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బే ఏరియాలో అనేక సంవత్సరాలుగా ఉంటూ తెలుగు కమ్యూనిటీకి బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) ద్వారా, ప్రస్తుతం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లికి చెందిన సతీష్‌ వేమూరి అమెరికాలో దాదాపు 25 ఏళ్ళకుపైగా ఉంటున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో కార్యక్రమాలను ఆయన కమ్యూనిటీకోసం చేశారు. అందరితోనూ మంచిగా ఉంటూ సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తూ వస్తున్న సతీష్‌ వేమూరి గత ఎన్నికల్లో నిరంజన్‌ శృంగవరపు టీమ్‌ ద్వారా కార్యదర్శి పదవికి పోటీ చేసి గెలిచారు. కార్యదర్శిగా ఉంటూ విజయవంతంగా కార్యక్రమాలను నిర్వహించిన అనుభవంతో ఇప్పుడు అధ్యక్ష పదవికి ఆయన పోటీ పడుతున్నారు. తానా ద్వారా మరింతమందికి మేలు చేసే కార్యక్రమాలతోపాటు, అమెరికాలో స్థిరపడిన మన పిల్లలకు ఆసరాగా నిలిచేలా తానా కార్యక్రమాలు ఉండాలన్న లక్ష్యంతో ఈ ఎన్నికల్లో దిగినట్లు ఆయన చెప్పారు.  

ఈ ఎన్నికల్లో మీ నినాదం ఏమిటి?

*    తానాలో యువతకు ప్రాధాన్యం లభించేలా చూడటంతోపాటు వారికి మద్దతుగా తానా కార్యక్రమాలు ఉండాలన్నదే నా ధ్యేయం..లక్ష్యం కూడా. అందుకు తగ్గట్టుగానే ఈ ఎన్నికల్లో యువతకోసం ప్రచారం చేయడంతోపాటు వారు  తానాకు మద్దతుగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాను. మన యువత మన సంపద.వారిని కాపాడుకోవడం, వారికి సహాయం చేయడం మన విధి అని నా అభిప్రాయం. ఈ ఎన్నికల్లో మేము మంచి విజన్‌తో బరిలోకి దిగాము. తానా సేవలతోపాటు అందరికీ వారధిగా ఉండాలని, ముఖ్యంగా యువతకు అన్నీ విషయాల్లో చేదోడువాదోడుగా ఉండాలని భావిస్తున్నాను. 

*    దశాబ్ద కాలం కిందటే తన ఆధ్వర్యంలో బే-ఏరియాలో 6వ తరగతి పిల్లలకు సైన్స్‌ పట్ల అవగాహన, ఆసక్తి పెంపొందించే కార్యక్రమా లతో పాటు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ తరగతులు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ,  ప్రస్తుత తరానికి తానా ద్వారా చేయవల్సిన, చేయదగిన అవకాశాలు, వన రులు పుష్కలంగా ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసు కుంటూ వారికి సహాయపడే విధంగా తానా లక్ష్యాలు మారాలని మా టీమ్‌ గెలిస్తే యువతకు మద్దతుగా వివిధ కార్యక్రమాలను చేస్తుందని ఆయన చెప్పారు. 

*    తానా చేస్తున్న కార్యక్రమాల్లో యువత ప్రత్యక్షంగా పాల్గొని తగిన అనుభవం సంపాదించుకుంటే వారికి సమాజంలో ఎలా ఉండాలన్న దానిపై అవగాహన కలుగుతుందని అందుకు తగ్గట్టుగా తానా కార్యక్రమాలు చేయాలన్నదే మా టీమ్‌ విజన్‌. 

ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు?

ఈ ఎన్నికల్లో మా టీమ్‌ను గెలిపిస్తే తానా సభ్యుల మధ్య ముఖ్యంగా వివాహం కావాల్సిన యువత ఉన్న తల్లితండ్రుల మధ్య ఓ నెట్‌ వర్క్‌ ను ఏర్పాటు చేయించి దాని ద్వారా వారి పిల్లల వివాహ సంబంధాలకు మార్గం చూపాలని భావిస్తున్నాము. అలాగే ఇలాంటి నెట్‌వర్క్‌లు మరింత ఏర్పాటు చేసి తెలుగు వాళ్ళ మధ్య పరస్పర సంబంధాలు పెంపొందించుకునేలా చేస్తాము. దీనివల్ల కమ్యూనిటీ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది. ఇదే మా టీమ్‌ లక్ష్యం.

ఆన్‌లైన్‌ ఓటింగ్‌పై మీ అభిప్రాయం?

గతంలో తానా ఎన్నికలు జరిగినప్పుడు బ్యాలెట్‌ ఓట్లు కొంతమంది తీసుకుని తమ టీమ్‌కు వేసుకోవడం వంటివి జరిగేవి. దానివల్ల వివాదాలకు అస్కారం ఏర్పడేది. ఈ ఎన్నికల్లో ఆన్‌ లైన్‌ ద్వారా ఓటింగ్‌ నిర్వహించడం వల్ల ఇలాంటి ప్రచారాలకు తావు ఉండదు. దానికితోడు సభ్యుడే నేరుగా తన ప్రతినిధిని ఎన్నుకుంటాడు. ఇది మంచి నిర్ణయమే. 

మంచి పనులు చేయాలన్న మా టీమ్‌ నిర్ణయానికి అందరూ తోడ్పాటును ఇవ్వడంతో తమ ఓటుతో మా టీమ్‌ను గెలిపించాలని  తెలుగు టైమ్స్‌ ద్వారా కోరుతున్నాను. 

తానాలో నిధుల దుర్వినియోగంపై మీ మాటేమిటి?

తానా మహాసభల్లో నిధుల దుర్వినియోగంపై తరచుగా వివాదాలు చెలరేగుతున్నాయి. దీనిని అరికట్టాలంటే మహాసభల నిర్వహణకు తగిన నిబంధనలు రూపొందిస్తే ఇలాంటి వివాదాలకు స్వస్తి చెప్పవచ్చు. ఇందుకోసం తమ టీమ్‌ కృషి చేస్తుంది. ఇప్పటికే తాము దీనిపై తగిన స్పష్టతతో ఉన్నాము.

 

 

Tags :