మరోసారి తానా సభల ద్వారా చరిత్ర సృష్టించిన సతీష్ వేమన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభలు అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో జూలై 4 నుంచి 6వ తేదీ వరకు ఘనంగా జరిగాయి. అధ్యక్షుడు సతీష్ వేమన సారధ్యంలో జరిగిన ఈ మహాసభలు తానా చరిత్రలో మరో రికార్డును సృష్టించింది. తెలుగు సంఘాల చరిత్రలో కూడా ఈ మహాసభలు నిలిచిపోయేలా జరిగింది. దాదాపు 20వేల నుంచి 25వేల మంది వరకు ఈ మహాసభలకు హాజరయ్యారు. ఇంతమంది అమెరికాలో జరిగిన ఓ తెలుగు మహాసభలకు రావడం ఇదే మొదటిసారని చెప్పవచ్చు. చివరిరోజున భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ గెస్ట్‌గా హాజరై ప్రసంగించారు. తెలుగువాళ్ళంతా ఐకమత్యంగా ఉండి అభివృద్ధిలోకి రావాలని రామ్‌మాధవ్ తన ప్రసంగంలో కోరారు.
ముగింపు సమావేశంలో అధ్యక్షుడు సతీష్ వేమన మాట్లాడుతూ తన రెండేళ్ళ హయాంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ తానా లక్ష్యాలు, ఆశయసాధనలో విజయం సాధించానని చెప్పారు. రెండేళ్ళ తన హయాంలో తానా టీమ్‌స్క్వేర్ ద్వారా దాదాపు 200మంది డెత్‌బాడీలను స్వస్థలాలకు పంపించామని, అలాగే కమ్యూనిటీకి అవసరమైన కార్యక్రమాలెన్నింటినో చేసినట్లు చెప్పారు. ఫుడ్‌డ్రైవ్, బ్యాక్‌ప్యాక్ ద్వారా నిరుపేద పిల్లలకు స్కూల్ బ్యాగ్‌లపంపిణీ, వైద్యచికిత్సలు, హ్యూస్టన్ నగరంలో వచ్చిన హురికేన్‌తో నష్టపోయిన బాధితులను తానా తరపున ఆదుకున్నామని, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశామని, ఎన్నో సంస్థలకు చేయూతను ఇచ్చినట్లు చెప్పారు. వైజాగ్ తుపాన్ బాధితుల సహాయ కార్యక్రమాల్లో తానా పాలుపంచుకుందని, అలాగే ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ తరగతుల ఏర్పాటులో కూడా తానా సహాయపడిందని తెలిపారు. కర్నూలు జిల్లాలోని కప్పట్రాళ్ళలో తానా 60 లక్షల రూపాయలతో నిర్మించిన స్త్రీశక్తి భవన్‌ను ప్రారంభించామని చెప్పారు. ఇలా ఎన్నో కార్యక్రమాలను తనహయాంలో చేసినట్లు తెలిపారు. తాను ఇలాంటి ఎన్నో విజయవంతమైన కార్యక్రమాలను చేసేందుకు తన మిత్రులు, తానా సభ్యులు ఎంతో సహకారాన్ని, సహాయాన్ని అందించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సతీష్ వేమన పేర్కొన్నారు.
ఈ మహాసభలు విజయవంతం కావడానికి కాన్ఫరెన్స్ చైర్మన్ నరేన్‌కొడాలి, కోఆర్డినేటర్ మూల్పూరి వెంకటరావు ఎంతో కృషి చేశారని వారికి కూడా ధన్యవాదాలు చెబుతున్నానని సతీష్ వేమన చెప్పారు.
తానా సేవలు నిరంతరాయంగా సాగుతాయని, తానాకు అవసరమైన సహకారాన్ని, సేవలను అందించేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని, అదేవిధంగా తాను పదవిలోఉన్నా లేకపోయినా తెలుగువాళ్ళకు సేవలందించేందుకు ముందుంటానని హామీ ఇచ్చారు.