తానా బాహుబలి...సతీష్ వేమన
తానా మహాసభల ముగింపురోజున సతీష్ వేమన అధ్యక్ష ప్రమాణ స్వీకారం అట్టహాసంగా, కోలాహలంగా జరిగింది. సతీష్ వేమన ప్రమాణ స్వీకారోత్సవం అందరినీ ఎంతో పులకరింపజేసింది. ఫ్రెండ్స్ ఆఫ్ సతీష్ వేమన పేరుతో వేదిక ప్రాంగణంలో అలంకరించిన బ్యానర్‌లు, కటౌట్‌లు, మరోవైపు ఈనాడు వంటి పత్రికల్లో మొదటిపేజీల్లో ఇచ్చిన ప్రకటనలు సతీష్ వేమన మాస్ హీరోయిజాన్ని మరోసారి వెల్లడించింది. గతంలో ఏ మహాసభలోనూ ఓ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారానికి ఇంతటి ప్రచారోత్సాహం, అభిమానుల కోలాహలం కనిపించలేదు. ఫ్రెండ్స్ ఆఫ్ సతీష్ వేమన పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్‌లను, కటౌట్‌లను చాలామంది ఆసక్తిగా తిలకించారు. తానాలో అంచెలంచెలుగా ఎదిగి నేడు అధ్యక్షపదవిని అధిరోహించడం వెనుక సతీష్ వేమన కృషి, విశ్వాసం సతీష్ వేమన 2007లో తానా కార్యవర్గంలోకి ప్రాంతీయ ప్రతినిధిగా ఎంట్రీ ఇచ్చారు. తరువాత ఎన్నో పదవును అధిరోహించి నేడు అధ్యక్ష పదవిని చేపట్టారు.
ఓ మనిషికి సాయపడాలని అనుకుంటే అది చేసి తీరేందుకు నిబంధనలు గట్రా వంటివి సతీష్ వేమన పట్టించుకోడు. తనను నమ్మినవాళ్ళకోసం ఎంతకైనా తెగించే గుణం సతీష్ వేమనలో ఉంది. ఆ లక్షణమే ఎంతోమంది మిత్రులను ఆయనకు సంపాదించి తెచ్చిపెట్టింది. తానాలో నేడు యువతకు ప్రాధాన్యం లభించిందంటే అందుకు సతీష్‌వేమనే కారణం. తానాలో ఎక్కువమంది యువతను తానే చేర్పించారు. కడప జిల్లా రాజంపేటకు చెందిన సతీష్ వేమన వాషింగ్టన్‌డీసిలో ఉంటున్న సంగతి తెలిసిందే.
తానా అధ్యక్షపదవిని సతీష్ వేమన స్వీకరించేముందు జరిగిన కోలాహలం అందరినీ ఎంతగానో ఆకర్షించింది. భళీ భళీరా అంటూ బాహుబలి 2 చిత్రం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో సతీష్ వేమన ఎంట్రీ జరిగింది. అంతకుముందు ఫ్రెండ్స్ ఆఫ్ సతీష్ వేమన ఆధ్వర్యంలో గుర్రపుబగ్గీలో సతీష్ వేమనను ఊరేగింపుగా కార్యస్థలానికి తీసుకువచ్చారు.
తానా అధ్యక్ష బాధ్యతల స్వీకరణ తరువాత సతీష్ వేమన ఆత్మసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. తానాను అన్నీ విధాలుగా ముందుకు తీసుకెళ్తానని తానాకు ఉన్న ప్రత్యేకతను కాపాడుతానని చెప్పారు. అదే సమయంలో తానాలో ఎవరైనా తప్పు చేస్తే క్షమించేది లేదని కూడా తనదైన స్టయిల్‌లో సతీష్ వేమన పేర్కొనడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 'తానా భవన్'ను నిర్మిస్తానని, వచ్చే రెండేళ్ళలోగా ఈ భవన్‌ను పూర్తి చేస్తానని కూడా ఈ సందర్భంగా సతీష్ వేమన హామి ఇచ్చారు.