ASBL Koncept Ambience

ఆటా 17 వ మహాసభలు: ఆకట్టుకున్న ‘సయ్యంది పాదం’

ఆటా 17 వ మహాసభలు: ఆకట్టుకున్న ‘సయ్యంది పాదం’

అమెరికా రాజధాని వేదికగా ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాల, కన్వీనర్‌ సుధీర్‌ బండారు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన ఆటా 17వ మహాసభలు వైభవోపేతంగా ముగిశాయి.. వేలాది మంది తెలుగు కుటుంబాలు, పెద్దలు, పలు రంగాల ప్రముఖులు ముఖ్యంగా ఉరకలెత్తే ఉత్సాహంతో యువత కదం తొక్కారు. ఆట పాటలతో హోరెత్తించారు. లలితా కళా వైభవం - యువత ప్రాభవం అనే పిలుపుతో ఆటాలో ప్రత్యేక గుర్తింపు పొందిన ‘‘సయ్యంది పాదం’’ కార్యక్రమం ఆటా కాన్ఫరెన్స్‌ వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంది. వివిధ నగరాల్లో ముందుగా ప్రాంతీయస్థాయిలో పోటీలను నిర్వహించారు. నాష్‌ విల్లే, అట్లాంటా, పోర్ట్‌లాండ్‌, రాలే, చికాగో, డల్లాస్‌, న్యూయార్క్‌`న్యూజెర్సి, డిట్రాయిట్‌, లాస్‌ ఏంజెలిస్‌, వాషింగ్టన్‌ డీసి మెట్రో, డెలావేర్‌, సియాటెల్‌లో పోటీలు జరిగాయి. సిటీ కోఆర్డినేటర్స్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రాంతీయపోటీల్లో విజేతలుగా నిలిచినవారితో ఆటా మహాసభల్లో ఫైనల్స్‌ పోటీలను నిర్వహించారు. కన్నుల పండువగా జరిగిన ఈ ఫైనల్‌ పోటీలకు  జడ్జీలుగా ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌, కూచిపూడి నృత్యకళాకారిణి పద్మశ్రీ పద్మజారెడ్డి, శివశ్రీ నృత్యకళానికేతన్‌ డైరెక్టర్‌ డా. రఘుపాత్రుని శ్రీకాంత్‌, కూచిపూడి నృత్యం, యాక్టర్‌ డాక్టర్‌ హలీంఖాన్‌, జగబత్తుల మహేశ్వరి, తేజస్విని చక్రవర్తి వ్యవహరించారు.

ఈ సయ్యందిపాదం పోటీలకు సుధ కొండపు చైర్‌గా, భాను మాగులూరి కో చైర్‌గా, రామ్‌రాజ్‌ అవధూత కో చైర్‌గా, రామకృష్ణారెడ్డి అల అడ్వయిజర్‌గా వ్యవహరించారు.

ఫైనల్‌ పోటీల్లో విజేతలకు ‘పద్మభూషణ్‌’ యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్‌, పద్మశ్రీ పద్మజా రెడ్డి, ప్రముఖ నృత్య కళాకారుడు శేఖర్‌ మాస్టర్‌ గారి చేతుల మీదుగా  బహుమతులు అందజేశారు. ప్రత్యేక అతిధులుగా తానా మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన, గుంటూరు యార్డ్‌ మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు హాజరై విజేతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ సాంస్కృతిక ఉత్సవాలు రెండు రోజులపాటు  ఘనంగా జరిగాయి. మొదటి రోజు ఫోక్‌, సినిమా పాటలు.. రెండవ రోజు పూర్తిగా సాంస్కృతిక, సంప్రదాయ నృత్యాలతో హోరెత్తాయి. సుమారు 800 మందికి పైగా హాజరై, పలువురు నిలబడి కూడా వీక్షించారు.. కార్యవర్గ సభ్యులు రామకృష్ణ రెడ్డి, కిరణ్‌ పాశ్యం, సాయి సుధిని అతిధులందరిని దుశ్శాలువాలుతో సత్కరించి ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ సందర్భంగా అతిధులు లక్ష్మి ప్రసాద్‌, పద్మజా రెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని ఈ తరానికి కూడా పరిచయం చేసే సమున్నత వేదిక కల్పించినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. అతిధులు మన్నవ సుబ్బారావు, సతీష్‌ వేమన మాట్లాడుతూ  మాట్లాడుతూ అమెరికాలో కూడా యువత భారతదేశం కంటే మిన్నగా కళా సంస్కృతిని, సాహితి పరంపరను కొనసాగిస్తున్నారని తెలిపారు. చివరిగా యువతను ప్రోత్సహిస్తున్న వారి తల్లి దండ్రులను, ఎంతో సమయం వెచ్చించి ఈ మహాసభలను విజయవంతం చేసే వేదిక నందించిన కార్యవర్గానికి, అతిధులకు, యువతకు మరియు ప్రేక్షకులకు కోఆర్డినేటర్స్‌లకు సుధా కొండపు, భాను మాగులూరి, శారదా, తిరుమల్‌, ఇందిరా, స్రుతి రెడ్డి , బాలు వళ్ళు, స్వప్న రెడ్డి మరియు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసారు.

ప్రాంతీయంగా డీసి నుండి పద్మజ, నవ్య సమీరా, లలితా, చంద్ర, సరితా సహకారమందించారు. ఈ కార్యక్రమానికి స్వర్ణ, గీత వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

 

 

Tags :