ఎన్నారైలలో ధైర్యాన్ని నింపిన జగన్ టైమ్స్ స్వేర్ ప్రకటన
- ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్
అమెరికాలోని ఎన్నారైలకు కరోనా వైరస్ విషయంలో ధైర్యాన్ని చెప్పేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందేశాన్ని ఇచ్చారని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న రత్నాకర్ పండుగాయల చెప్పారు. న్యూయార్క్ నగరంలోని టైమ్స్స్క్వేర్‍లో ఇచ్చిన ప్రకటన తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశానని చెప్పారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్‍రెడ్డి సందేశాన్ని ప్రవాసాంధ్రులకు తెలియజేశానని పేర్కొన్నారు.
కోవిడ్-19(కరోనా వైరస్)విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలుగువారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ‘న్యూయార్క్ టైమ్ స్క్వేర్‍లో’ ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ ద్వారా ఎన్నారైలకు సందేశాన్ని ఇచ్చారు. ఆంధప్రదేశ్‍లో ఉన్న తెలుగువారి సంక్షేమంకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చర్యలు తీసుకుంటోందని కూడా జగన్ ఈ సందేశంలో తెలియజేశారు. కరోనా వ్యాప్తి నియంత్రణ, నివారణ కోసం ఏపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వైరస్ సోకిన వారిని గుర్తించడం మొదలు, వారికి మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రపంచంలోనే ఉత్తమ విధానాలను అనుసరిస్తోంది. అదే సమయంలో ప్రజల నిత్యావసరాలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సమర్ధ చర్యలను తీసుకుంటోందని కూడా రత్నాకర్ తెలిపారు.