ASBL Koncept Ambience

మార్పును కోరుతున్నారు... మా విజయం ఖాయం

మార్పును కోరుతున్నారు... మా విజయం ఖాయం

తెలుగుటైమ్స్ ఇంటర్వ్యూలో నిరంజన్‍ శృంగవరపు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) పేరు ప్రపంచంలోని తెలుగువారందరికీ పరిచయమైన పేరు. అమెరికాలో 4 దశాబ్దాల క్రితం ప్రారంభమైన తానా అంచెలంచెలుగా ఎదిగి తన సేవలతో, కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఆదర్శప్రాయమైన సంస్థగా మారింది. అలాంటి తెలుగు సంఘానికి అధ్యక్షత వహించడానికి నేడు ఇద్దరు గట్టిగా పోటీ పడుతున్నారు. ముగ్గురు పోటీలో ఉన్నా ఇద్దరి మధ్యే పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. వారిలో నిరంజన్‍ శృంగవరపు ఒకరు. తానా ఫౌండేషన్‍ చైర్మన్‍గా ఉన్న నిరంజన్‍ శృంగవరపు తానా 2021 ఎగ్జిక్యూటివ్‍ కమిటీ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. తానా 4 ఛేంజ్‍ అన్న నినాదంతో ఆయన ఎన్నికల ప్రచారంలోకి దిగారు. 

తానాలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన అనుభవం...ఎన్నో కార్యక్రమాల విజయవంతానికి కృషి చేసిన నైపుణ్యం, అందరితోనూ కలిసి పనిచేసే గుణం, తానా ఫౌండేషన్‍ చైర్మన్‍గా కోవిడ్‍ విపత్కాలంలో అప్పటికప్పుడు ప్రణాళికలను వేసుకుని, అటు దాతలతో, ఇటు తానా సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, వలంటీర్లతో కలిసి కార్యక్రమాలను నిర్వహించిన అనుభవంతో ఆయన ఇప్పుడు తానా ఎగ్జిక్యూటివ్‍ వైస్‍ ప్రెసిడెంట్‍ పదవికి పోటీ చేస్తున్నారు.

నిరంజన్‍ శృంగవరపు టీమ్‍ తమ ప్రచారంలో పేర్కొంటున్న తానా 4 చేంజ్‍ అన్న పిలుపు నేడు తానా ఎన్నికలను ఓ విధంగా కుదిపేస్తోంది అని చెప్పవచ్చు. నిరంజన్‍ శృంగవరపు పేర్కొన్న మార్పు ప్రత్యర్థులను కూడా భయపెట్టిస్తున్నట్లుగా కనిపిస్తోందని, అందుకే వారు ఈ మార్పు అన్న నినాదంపై విరుచుకుపడుతున్నారని పలువురు తానా మిత్రులు పేర్కొంటున్నారు. ఈ మార్పు అన్న నినాదం ఇవ్వడానికి వెనుక ఉన్న కారణాన్ని నిరంజన్‍ శృంగవరపు తెలుగుటైమ్స్ ఎడిటర్‍ చెన్నూరి వెంకట సుబ్బారావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

మార్పు అంటే ఏమిటి? ఆ నినాదం మీకు విజయాన్ని అందిస్తుందా?

మేము తానా 4 ఛేంజ్‍ అని నినాదం ఎత్తుకోగానే పలువురు నవ్వారు. ఇతరులు వారి సమావేశాలలో మీ టీమ్‍లో ఇప్పుడు ఉన్నవారు ఏమి మార్పు తెచ్చారు అంటూ ప్రశ్నించారు. ఈ పదవి నుంచి ఆ పదవికి వెళ్ళటమే మార్పా అని మరికొంతమంది హేళన చేశారు. మా ఉద్దేశ్యంలో మార్పు అంటే, సభ్యులు కోరినట్లుగా కమ్యూనిటీ కార్యక్రమాలను నిర్వహించడం. అందరినీ అందులో భాగస్వాములను చేయడం వంటివి. ఇప్పటికే మేము చాలా నగరాల్లో పర్యటించాము. మేము కోరుతున్న మార్పును తానా సభ్యులకు వివరించినప్పుడు వారు మాకు మద్దతు ఇవ్వడంతోపాటు మార్పును మేము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. మార్పును కోరుతున్న సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఉండటం చూసిన తరువాత మాకు విజయం ఖాయమని భావిస్తున్నాము.

మేము తీసుకువచ్చిన మార్పుల్లో మరొక ముఖ్యమైన అంశం పాఠశాల. తానా ఆశయాలలో తెలుగు భాషని పరిరక్షించడం ఒకటి. అందులో భాగంగానే మేము పాఠశాలను తీసుకుని తెలుగు పిల్లలకు, తెలుగు నేర్పించే కార్యక్రమాన్ని విస్తృతం చేశాము. మనబడిలో 300డాలర్ల ఫీజు ఉంటే, పాఠశాలలో 200 డాలర్ల ఫీజు ఉండేది. తానా నిర్వహణలో పాఠశాల వచ్చిన తరువాత ఆ ఫీజును కూడా 100డాలర్లకు తగ్గించాము. ఎందుకంటే ఎక్కువమంది పిల్లలు తెలుగు భాషను నేర్చుకోవడానికి ముందుకురావాలన్న ఉద్దేశ్యంతో తగ్గించడం జరిగింది. ఇది తెలుగు భాషకోసం మేము తీసుకువచ్చిన మార్పు.

తానా ఆశయాలలో ఇంకొకటి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడటం, ముందుతరాలకు అందించడం, ఇందుకోసం మేము రానున్న రోజుల్లో మహిళలను, పిల్లలను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు రూపొందించాలని అనుకుంటున్నాము. కాన్ఫరెన్స్లకు రాజకీయ నాయకులు, సినిమాప్రముఖులు కావాలి. కాని అంతకంటే ఎక్కువగా ఇక్కడ ఉన్న తెలుగు కుటుంబాలను, తెలుగు పిల్లలను, రెండవతరం పిల్లలను ఇందులో పాలుపంచుకునేలా చేయాలి. అప్పుడే తానా మరో40-50 ఏళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్‍ కాన్ఫరెన్స్లను చేయాలన్నదే మా ఉద్దేశ్యం. ఆ కాన్ఫరెన్స్లో పెద్దవాళ్ళు తెలుసుకోవడంతోపాటు ఒకరికొకరు అభినందనలు తెలుపుకోవడం వంటివి జరగాలి. దాంతోపాటు ఇందులో చిన్నవాళ్ళను కూడా కలుపుకుని కార్యక్రమాలు చేసుకోవాలి. అలాగే నెట్‍వర్కింగ్‍కి వెడ్డింగ్‍ ప్లానింగ్‍కి ఈ కాన్ఫరెన్స్లు ఉపయోగపడాలి. ఈ విధంగా కాన్ఫరెన్స్ కార్యక్రమాల్లో కూడా మేము మార్పును తీసుకువస్తున్నాము.

మా టీమ్‍ ఎంపికలో కూడా మేము మార్పులను చూపించాము. మార్పు తెస్తున్నది మేమే అని నిరూపించేలా టీమ్‍ ను ఎంపిక చేశాము. సాధారణంగా ఒక్క ఉమెన్‍ కో ఆర్డినేటర్‍ పదవికోసం ఒక మహిళను తీసుకురావడం సహజం. కాని మేము అలా కాకుండా మా టీమ్‍లో ముగ్గురు మహిళలను తీసుకుని ఎన్నికల్లో దిగాము. అందులో లక్ష్మీదేవినేని ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఇప్పటికే కమ్యూనిటీ సేవలో ఉన్న ఇద్దరు డాక్టర్లని తీసుకువస్తున్నాము. డా. ప్రసాద్‍ నల్లూరిగారి సేవలు అందరికీ తెలిసినవే. అలాగే డా. నాగేంద్ర కొడాలి కూడా కమ్యూనిటీసేవలో పేరు తెచ్చుకున్నవారు. రెండవతరానికి చెందిన శశాంక్‍ యార్లగడ్డను మా టీమ్‍ తరపున పోటీ చేయిస్తున్నాము. ఇలా గతంలోకన్నా విభిన్నంగా టీమ్‍ను ఎంపిక చేసుకుని బరిలోకి దిగాము. ఇదే మేము తీసుకువచ్చిన మరో మార్పు.

తానాలో మేము తలపెట్టిన మార్పులో మరో ముఖ్యమైనది ఏమిటంటే తానా సంస్థ నిర్వహణలో మార్పులు తీసుకురావడం. అంటే తానా నాయకులు చేసే ప్రతి పనికి జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలని చెబుతున్నాము.  ఉదాహరణకు నేను డిట్రాయిట్‍ కాన్ఫరెన్స్కు పనిచేశాను. మొత్తం వచ్చిన డబ్బు, ఖర్చు పెట్టిన డబ్బుకి లెక్క చూపించి తానా బోర్డ్ చేత శభాష్‍ అనిపించుకున్నాను. అలాగే గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న తానా ఫౌండేషన్‍ కార్యక్రమాలుగాని, తానా కార్యక్రమాలు గాని ఒక క్రమపద్ధతిలో జరుగుతున్నాయి. కోవిడ్‍ వల్ల కమ్యూనిటీ ఇబ్బందులు పడుతుంటే తానా సేవలు మరింత ఎక్కువ చేశాము. తానాలో మార్పులకు సభ్యులు కూడా సుముఖంగా ఉన్నారు కాబట్టే మా ప్రచార కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి.

 

Tags :