యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ విశ్వవిద్యాలయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే చదువులు, శిక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చదువులు ముగించుకొని విద్యా సంస్థల నుంచి బయటకు వస్తున్న ప్రతి విద్యార్థి ఉద్యోగం లేదా ఉపాధి పొందడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్రస్థాయిలో తొలిసారిగా ప్రత్యేకంగా నైపుణ్యాభివద్ధి (స్కిల్ డెవలప్‌మెంట్) విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ యూనివర్సిటీ కింద ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్యాభివద్ధి కోసం ఒక కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రపంచం మొత్తం మన రాష్ట్రంవైపు చూసేలా అత్యుత్తమ నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయాలన్న ఉద్దేశ్యంలో జగన్ ఉన్నారు. అందుకు తగ్గట్టుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. పరిశ్రమలకు అవసరమైన స్థాయిలో మానవ వనరులను అందించి, 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభించేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు రాష్ట్రస్థాయిలో కొత్తగా ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. నైపుణ్యాభివద్ధి కోసం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయనున్న 25 కళాశాలలు ఈ యూనివర్సిటీకి అనుబంధంగా పని చేస్తాయన్నారు. ప్రభుత్వం తరఫున చేపట్టే నైపుణ్యాభివద్ధి కార్యక్రమాలన్నీ ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయని తెలిపారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఇందులో భాగస్వామిగా మారుతుందన్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లోనూ అత్యుత్తమ శిక్షణ
మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా, భవిష్యత్తు అవసరాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ తగిన ప్రణాళికలను రూపొందిస్తుందని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, బీకాం సహా ఇతరత్రా డిగ్రీలు చదువుతున్న వారిలో నైపుణ్యాలు పెంచడం, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దడం వంటి కార్యక్రమాలను స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీతో అనుసంధానిద్దామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో(ఏఐ) విద్యార్థులకు అత్యుత్తమ నైపుణ్యాలను నేర్పించే బాధ్యతను యూనివర్సిటీ స్వీకరిస్తుందని వివరించారు. ఈ యూనివర్సిటీ, దాని పరిధిలో కాలేజీల ఏర్పాటుపై నెల రోజుల్లోగా కార్యాచరణ పూర్తి కావాలని అధికారులను సీఎం ఆదేశించారు.