హైదరాబాద్ లో కీమో ఫార్మా రెండో ఉత్పత్తి యూనిట్
స్పానిష్ మల్టీ నేషనల్ కంపెనీ హైదరాబాద్ నగరంలో 100 కోట్ల రూపాయలతో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు తెలిపింది. స్పెయిన్ దేశానికి చెందిన కీమో ఫార్మా ఇప్పటికే హైదరాబాద్ నగరంలో తన కార్యకలాపాలను కొనసాగిస్తుండగా దీనికి అదనంగా తన రెండో ఉత్పత్తి యూనిట్ ను ప్రారంభించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
దావోస్ లో ఈరోజు మంత్రి కేటీఆర్ తో సమావేశమైన కీమో గ్రూప్ పరిశోధన అభివృద్ధి డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ ఈ మేరకు సంస్థ ప్రకటనను తెలియజేశారు. 2018 నుంచి కార్యకలాపాలు హైదరాబాద్ నగరంలోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా కొనసాగుతున్నాయని, అప్పటినుంచి తమ సంస్థ దినదినాభివృద్ధి చెందుతున్న విషయాన్ని డైరెక్టర్ జీన్ తెలిపారు. ఇప్పటికే తాము సుమారు 170 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టామని, 270 మంది ఉద్యోగులున్నారని, త్వరలో ఈ అదనపు ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమకు సుమారు 10 దేశాల్లో తయారీ యూనిట్లు ఉన్నాయని తెలిపిన జీన్, హైదరాబాద్ నగరంలో తమ అభివృద్ధి చాలా బాగుందని తెలిపారు.