ఇవాంక కోసం పసందైన విందు
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్)కు హాజరవుతున్న అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక హాజరవుతున్నందున తెలంగాణ ప్రతిష్టను చాటేవిధంగా ఇక్కడి ప్రభుత్వం పసందైన విందును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆమె అభిరుచుల మేరకు అమెరికా సాంప్రదాయ వంటకాల జాబితా ప్రకారం అన్ని రకాల పదార్థాలు సిద్ధం చేస్తున్నారు. అయినప్పటికీ తెలంగాణ సాంప్రదాయ వంటలేమిటో ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఆకాంక్షతో ఈ సదస్సుల పాల్గొనే వివిధ దేశాల ప్రతినిధులతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌లు పాల్గొనే ప్రత్యేక విందు కార్యక్రమంలో అన్ని రకాల వంటకాలను రుచి చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశ, విదేశాల్లో స్థిరపడ్డ తెలుగు వారంత గర్వంగా చెప్పుకునే హైదరాబాద్ బిర్యానీతో పాటు హలీం, షీక్‌కబాబ్, మటన్ మరగ్, మొఘలాయి చికెన్, నాన్‌రోటీ, రుమాలీరోటీ, పరాఠా, మటన్‌కోఫ్తా, గ్రిల్డ్ చికెన్, చికెన్ డిషెస్, బగారా బైగన్, చికెన్, మటన్‌లో మరో మూడు ప్లాటర్స్ రకాలు, ఖుర్బానీ మీఠా తదితర ప్రాచీన వంటకాలను కూడా సిద్ధం చేయిస్తున్నారు. అలాగే పదుల రకాల పండ్లతో తయారుచేసే ప్రూట్ ఖీరా, డ్రైపూట్స్ ఖరీలను కూడా విందులో ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు తెలంగాణ ప్రజల అలవాట్లలో భాగంగా ఉన్న సుమారు 40 రకాల చట్నీలు, పచ్చళ్ళ, సాంబారు, రసం తదితర వంటకాలన్నీ ఇవాంకకు ఇచ్చే విందులో ప్రత్యేక ఆకర్షణగా సిద్ధం చేస్తున్నారు. దేశంలో సాంప్రదాయంగా వస్తున్న మిఠాయిలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేకత గల మిఠాయిలను లుపుకుని మొత్తం 65 రకాల స్వీట్లను, 20 రకాల పండ్లరసాలు, పానీయాలను ఈ విందు కోసం సిద్ధం చేస్తున్నారు. ఇవాంక ఆహారపు అలవాట్లను అమెరికా వైట్‌హౌస్ ద్వారా సమాచారం తెలుసుకుని ఆమె ఇష్టపడే 18 రకాల వంటకాలు కూడా ప్రత్యేక సిబ్బందితో సిద్ధం చేయించాలని తెలంగాణ ప్రోటోకాల్ విభాగం ఉన్నతాధికారులు నిర్ణయించారు.