ASBL Koncept Ambience

రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడొక బ్రాండ్‌!

రేవంత్‌ రెడ్డి.. ఇప్పుడొక బ్రాండ్‌!

2023 డిసెంబర్‌ లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయి కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్న అనుముల రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటివరకూ రేవంత్‌ రెడ్డిపై కాంగ్రెస్‌లో కారాలు మిరియాలు నూరిన నేతలంతా ప్రజల్లో రేవంత్‌కు ఉన్న అభిమానాన్ని చూసి సైలెంట్‌ అయిపోయారు. ఆయనకు పూర్తిగా సహకరిస్తున్నారు. మరోవైపు రేవంత్‌ రెడ్డి కూడా చిన్న వయసులోనే తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు అమలు చేస్తున్నారు. మరోవైపు పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీంతో ఇప్పటికైతే రేవంత్‌ రెడ్డికి తిరుగులేదనే పేరు తెచ్చుకున్నారు.

తెలంగాణ తెచ్చింది మేమేనని బీఆర్‌ఎస్‌ చెప్పుకుంటుంటే ఇచ్చింది మేమేనని కాంగ్రెస్‌ చెప్తూ వచ్చింది. తెలంగాణ ఇచ్చినా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. పదేళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. గెలిచిన నేతలు అధికార బీఆర్‌ఎస్‌ లోకి, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లోకి వెళ్లిపాయారు. ఉన్న కొంతమంది నేతల మధ్య సయోధ్య లేదు. పైగా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడం పార్టీలో చాలా మందికి నచ్చలేదు. ఆయన్ను రోజుకొకరు విమర్శిస్తూ బజారుకెక్కేవారు. కానీ రేవంత్‌ రెడ్డి మాత్రం పార్టీ గీత దాటి ఎప్పుడూ ప్రవర్తించలేదు. తనను విమర్శించిన నేతలను సైతం కలుపుకు పోయేందుకు ప్రయత్నించారు. ఎన్నికల్లో గెలిస్తే ఇలాంటి సమస్యలన్నీ సర్దుకుపోతాయని భావించిన రేవంత్‌ రెడ్డి అందుకోసం రాష్ట్రమంతా విస్తృతంగా తిరిగారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత రేవంత్‌ రెడ్డే సీఎం అని పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో పార్టీలో రేవంత్‌ రెడ్డికి ఉన్న పట్టేంటో అందరికీ అర్థమైంది. చివరకు నేతలంతా రేవంత్‌ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సి వచ్చింది.

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే పూర్తిగా పాలనపై దృష్టి కేంద్రీకరించారు. ముందుగా తాము మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రయారిటీ ఇచ్చారు. అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే డిసెంబర్‌ 9న సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా మహాలక్ష్మి పేరిట మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేశారు. రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఈ పథకాన్ని కూడా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. గృహజ్యోతి స్కీం కింద 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌ పథకాన్ని కూడా రేవంత్‌ సర్కార్‌ అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దరఖాస్తులు ఆహ్వానించింది. త్వరలోనే వీటిని స్క్రూటినీ చేసి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. పదేళ్లుగా రేషన్‌ కార్డులు ఇవ్వకపోవడంతో రేవంత్‌ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురైన పాలమూరు రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకాలను రేవంత్‌ ప్రభుత్వం ప్రాధాన్యాలుగా తీసుకుంది. ఇటీవలే సీతారామ ఎత్తిపోతల పథకం ట్రయల్‌ రన్‌ పూర్తయింది. మరోవైపు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న కొడంగల్‌, నారాయణపేట్‌, మక్తల్‌ ఎత్తిపోతల పథకాలకు రూ.3వేల కోట్లు కేటాయించింది ప్రభుత్వం. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. రూ.2లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తామని చెప్పింది. అందులో భాగంగా ఇప్పటికే రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది. ఆగస్టు 15లోపు మిగిలిన బకాయిలను కూడా మాఫీ చేసేందుకు సిద్ధమైంది.

కేసీఆర్‌ హయాంలో విద్యార్థులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులదే కీలక పాత్ర. అయినా తెలంగాణ వచ్చిన తర్వాత విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేసీఆర్‌ సర్కార్‌ విఫలమైందనే ఆరోపణలున్నాయి. అయితే రేవంత్‌ రెడ్డి ఈ విషయాన్ని ప్రయారిటీగా తీసుకున్నారు. అధికారంలోకి రాగానే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ను ప్రక్షాళన చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే జాబ్‌ క్యాలండర్‌ విడుదల చేస్తామని చెప్పింది. అందుకు అనుగుణంగా ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యధిక ప్రయారిటీ ఇచ్చారు. గ్రూప్‌ 1 తో పాటు వైద్య, విద్యాశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. మరోవైపు కాలానుగుణంగా నిరుద్యోగుల్లో నైపుణ్యాలను పెంచేందుకు ఐటీఐలను అడ్వాన్సుడ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణకు హైదరాబాద్‌ ప్రధాన ఆదాయ వనరు. అందుకే దీన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటికే దేశంలో హైదరాబాద్‌ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. దీన్ని మరింత తీర్చిదిద్దడం ద్వార పెట్టుబడులను ఆకర్షించాలనుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైన మౌలిక వసతులను కల్పించాలనుకుంటున్నారు. మెట్రోను రాజధాని నలుమూలలకూ విస్తరిస్తున్నారు. మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేయాలని రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. దేశంలోనే పెట్టుబడుల ఆకర్షణలో ముందున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఇప్పటికే హైదరాబాద్‌ ఐటీ, ఫార్మా రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. పారిశ్రామిక వేత్తలకు తగిన సౌకర్యాలు కల్పించడం ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు ఆకర్షించాలనేది రేవంత్‌ రెడ్డి ఆలోచనగా ఉంది.

అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దావోస్‌ లో పెట్టుబడుల సదస్సుకు వెళ్లి పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులు పెట్టాలని కోరారు. తాజాగా అమెరికా పర్యటనకు రేవంత్‌ రెడ్డి సిద్ధమయ్యారు. త్వరలోనే దక్షిణ కొరియాలో పర్యటించేందుకు షెడ్యూల్‌ రెడీ చేశారు. గతంలో కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ గ్యాప్‌ అలాగే కంటిన్యూ అవుతూ ఉండేది. అయితే రేవంత్‌ రెడ్డి మాత్రం ఆ గ్యాప్‌ ను తగ్గించుకోవా లనే ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు పెద్దన్నగా సంబోధించి రేవంత్‌ రెడ్డి ఆశ్చర్యానికి గురి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలకోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రెండుసార్లు ఢల్లీి వెళ్లి ప్రధాని సహా పలువురు మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, అనుమతులపై చర్చించారు.

మరోవైపు పదేళ్లయినా విభజనచట్టం హామీలు ఇంతవరకూ కొలిక్కిరాలేదు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య ఇప్పటికీ పలు సమస్యలు అలాగే ఉన్నాయి. వీటని పరిష్కరించుకుందాం అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన సూచనకు రేవంత్‌ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ప్రజాభవన్‌ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఇందులో సమస్యల పరిష్కరానికి మూడు కమిటీలను ఏర్పాటు చేసారు. తద్వారా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట ఎక్కువగా హైకమాండ్‌ పైన ఆధారపడుతుంటారు ముఖ్యమంత్రులు. ఇక్కడ రేవంత్‌ రెడ్డి కూడా హైకమాండ్‌ అండదండలతో తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. గత పదేళ్లుగా అణచివేతకు గురైన తెలంగాణలో ప్రజాపాలన తీసుకొచ్చామని చెప్తున్నారు.

రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరికే అనూహ్యం. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్‌ లో చేరారు. అప్పటికి తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జోరుగా సాగుతున్నాయి. పదవులకోసం పోట్లాట జరుగుతోంది. అలాంటి సమయంలో రేవంత్‌ రెడ్డి రావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. రేవంత్‌ రాకను పలువులు కాంగ్రెస్‌ నేతలు వ్యతిరేకించారు. అయితే కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం రేవంత్‌ కు అండగా నిలిచింది. 

తెలంగాణ ఇచ్చినా అధికారంలోకి రాలేకపోవడానికి నేతలే కారణమని భావించిన అధిష్టానం.. రేవంత్‌ కు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పీసీసీ పగ్గాలు కూడా అప్పగించింది. రేవంత్‌ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా చాలా మంది నేతలు ఆయనపై నోరు పారేసుకున్నారు. అయినా రేవంత్‌ ఎప్పుడూ పట్టించుకోలేదు. వాళ్లను కలుపుకు పోయేందుకే ప్రయారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ఇలాంటి వాటన్నిటికీ ఫుల్‌ స్టాప్‌ పడుతుందనుకున్నారు. అన్నట్టే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నేతలెవరూ రేవంత్‌ రెడడికి వ్యతిరేకంగా నోరు మెదపలేదు. 

ఇక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని పెద్దగా పట్టించుకునే అవకాశం ఉండదు. అయితే రేవంత్‌ రెడ్డి మాత్రం ఇందుకు భిన్నం. ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. నేతలెవరైనా తనను నేరుగా కలవచ్చని.. ఎవరికీ ఎలాంటి అపాయింట్మెంట్లు అక్కర్లేదని క్లారిటీ ఇచ్చేశారు. గతంలో కేసీఆర్‌ కొంతమంది నేతలతో మాత్రమే భేటీ అయ్యేవారు. దీంతో నేతలకు, కేసీఆర్‌ కు మధ్య గ్యాప్‌ పెరిగింది. 

సమస్యలను ఆయనకు చెప్పుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ తప్పు రేవంత్‌ రెడ్డి చేయకూడదనుకుంటున్నారు. అందుకే నేరుగా నేతలతో సంబంధాలు పెట్టుకున్నారు. వాళ్లతో ఎలాంటి అంశాలనైనా చర్చిస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూడా ఇలాగే పార్టీ నేతలకు సమయం కేటాయించేవారు. వారి మంచి చెడులు వినేవారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కూడా వైఎస్సార్‌ బాటలో నడుస్తున్నట్టు అర్థమవుతోంది.

ఇక తెలంగాణలో పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు రేవంత్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 

 

 

 

Tags :