ASBL Koncept Ambience

తానాలో ఏం జరుగుతోంది...? మళ్ళీ కోర్టుకెళ్తారా?

తానాలో ఏం జరుగుతోంది...? మళ్ళీ కోర్టుకెళ్తారా?

విడిపోయిన కొందరు సభ్యుల తీరుపై అందరూ గరంగరం..

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) లో ఎన్నికల సమయంలో, ఆ తరువాత జరుగుతున్న పరిణామాలపై తానాలోని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. 20 ఏళ్ల తెలుగు టైమ్స్ లాంటి పత్రిక కూడా మౌనంగా వుండటం ఏమిటని రెండు - మూడు మెయిల్స్ మాకు కూడా వచ్చాయి. ప్రస్తుత పరిస్తితి పై చిన్న రివ్యూ ఇస్తున్నాను..

ఎన్నికలు జరిగి ఫలితాలు వెలువడి 10 రోజులైనా ఇంకా బోర్డు నుంచి గానీ, ప్రస్తుత తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు గానీ ఎలాంటి ప్రకటన రాక పోవటం పై అందరూ అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమి పద్ధతి అని, ఓడినవారు వైదొలగాల్సిందేనని, గెలిచినవారికి పదవులు ఇవ్వకుండా జాప్యం చేసే అప్రజాస్వామిక పద్ధతిని తానా చేయడం సబబు కాదంటున్నారు. 

సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఎన్నికల్లో గెలిచినవారిని బోర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీసభ్యులుగా ప్రకటించడం, బోర్డు సభ్యులుగా ఎన్నికైన వారిని గుర్తించడం, వారు అధికారికంగా ఆరోజు నుంచి బోర్డ్‌ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించినట్లు ప్రకటించడం బోర్డ్ చేయాల్సిన పద్దతి. కాని ఈసారి ఎన్నికల ఫలితాలు వెలువడి పదిరోజులైనా ఇంకా ఆ పనిని బోర్డు చేయకుండా జాప్యం చేయడంపై సోషల్‌ మీడియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా బోర్డు  దానిపై ఏ విధమైన ప్రకటనను చేయడం లేదు. మరోవైపు ఓడిన సభ్యులు కొందరు ఎన్నికల ఫలితాలపై తమకు ఉన్న సందేహాలను తీర్చాలని ఎన్నికల కమిటీని అడిగినట్లు వార్తలు వచ్చాయి. బోర్డ్‌ బైలాస్‌ ప్రకారం ఎన్నికలు జరిగాక, ఫలితాలు వెల్లడైన తరువాత అభ్యర్థులు తమకు ఏమైనా సందేహాలు ఉంటే అడిగి తీర్చుకునే వెసులుబాటు ఉంది. కాని ఇప్పుడు ఆ అభ్యంతరాలపై నిర్ణయం వెలువడటంలో జాప్యం, బోర్డు ఫలితాలపై కిమ్మనకుండా కూర్చోవడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తానా సభ్యులు తాము గెలిపించినవారికి పదవులు ఇంకా అప్పగించకపోవడం పట్ల పలు వేదికలు మీదుగా అభ్యంతరాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకొందరైతే వీడియోల ద్వారా బోర్డ్‌ తీరును తూర్బారబడుతున్నారు.

అసలు కథ ఏమిటి?

తానాలో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నిరంజన్‌ శృంగవరపు వర్గం (మాజీ అధ్యక్షుడు జయ్‌ తాళ్ళూరి వర్గం) ఒకవైపు, మరోవైపు ప్రస్తుత ఎన్నికల్లో వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నరేన్‌ కొడాలి వర్గం (మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి మద్దతు తో) ఉన్నాయి. గత సంవత్సరం నుంచి ఈ రెండు వర్గాల మధ్య బాహటంగానే విభేదాలు రచ్చకెక్కాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ వస్తున్నారు. కాగా నిరంజన్‌ వర్గానికి బోర్డులో మెజారిటీ ఉన్నందువల్ల ఆ వర్గం తనకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటూ వస్తోంది. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆన్‌ లైన్‌ ఓటింగ్‌ ను ప్రవేశపెట్టడం ద్వారా తాము గెలవవచ్చని భావించి నిరంజన్‌ వర్గం మొదటిసారిగా తానా ఎన్నికల్లో ఆన్‌ లైన్‌ ఓటింగ్‌ ను నిర్వహించింది. ఎలక్షన్ ట్రస్ట్ అనే పెద్ద సంస్థ కి తానా ఎన్నికల నిర్వహణా భాధ్యతని అప్పగించింది. ఎలక్షన్ ట్రస్ట్ సంస్థ, ఎలక్టిగ్రిటీ అనే మరో సంస్థ ద్వారా ఈ ఎన్నికల నిర్వహణ చేపట్టింది. ఎలక్షన్‌ ట్రస్ట్‌, ఎలక్టిగ్రిటీ అనే సంస్థలకు అమెరికాలో ఎన్నికలు నిర్వహించడంలో విశేషమైన అనుభవం ఉంది. లోకల్‌, రీజినల్‌, నేషనల్‌ ఎన్నికలు, ప్రైమరీ ఎన్నికలను ఇవి నిర్వహించాయి.

ఇప్పుడు ఏం జరుగుతోంది?

ఈ ఎన్నికల్లో నరేన్‌ కొడాలి వర్గం లోని అన్ని పదవులను దాదాపు 2500 - 3000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం. ఆ విధంగా నిరంజన్‌ వర్గం మొత్తం ఈ ఎన్నికల్లో ఓటమి పాలు కావడాన్ని ఆ వర్గంలోని నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ప్రస్తుతం బోర్డ్‌లో ఉన్న మెజారిటీతో ఈ ఫలితాలను అధికారికంగా ఆమోదించకుండా జాప్యం చేస్తోంది. ఎన్నికల్లో ఆ వర్గం నుంచి పోటీ చేసిన ఒకరిద్దరూ ఈ ఎన్నికల నిర్వహణ తీరు, ఓటింగ్‌ సరళిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అస్సలు ఈ ఎన్నికల నిర్వహణ సరిగా జరిగిందా?, 23000 మంది పాల్గొన్న ప్రక్రియలో తప్పులు జరిగాయా? అందరికీ ఓటిపి రావడం, ఆ పిన్‌ నెంబరులో బ్యాలెట్‌ పేపర్లు అప్‌ లోడ్‌ చేయడం సరిగా జరిగిందా? అంటూ ప్రశ్నిస్తూ దీనిపై తమకు వచ్చిన సందేహాలను తీర్చాల్సిందిగా  కోరారు. మరోవైపు ఈ ఎన్నికలు సరిగా జరగలేదంటూ కోర్టుకు వెళ్ళే ఆలోచనను కూడా చేస్తున్నారన్న వార్త కూడా సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతోంది.

ఎన్నికల ఫలితాలు జనవరి 17న వచ్చాయి. ఇప్పటి వరకు తానా ప్రెసిడెంట్‌ నిరంజన్‌ శృంగవరపు నుంచి ఏ విధమైన ప్రకటన రాలేదు. ఓడిపోయిన వర్గం నుంచి కొందరు ఓటిపి మీద, బ్యాలెట్‌ పేపర్‌ పంపిన విధానం మీద గ్రూపులలో అడగడం, దానికి ఇరువర్గాలు సమాధానాలు, కౌంటర్‌ సమాధానాలను ఇస్తూ వస్తున్నారు.

ఇది తానా ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా....

ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తానా ప్రతిష్ఠకు మచ్చ తెచ్చేలా ఉందని అంటున్నారు. ఎందుకంటే లైవ్‌లో ఫలితాల వెల్లడి అంతా సభ్యులు చూసిన తరువాత, తెలుగు రాష్ట్రాలలో దిన పత్రికలు, టీవీ ఛానళ్ళు, ఆన్ లైన్ పత్రికలు, ఛానళ్ళు లో ప్రముఖంగా ఈ వార్త వచ్చేయటం, మాజీ ఉపరాష్ట్రపతి, తెలుగు దేశం పార్టీ నుంచి నారా లోకేష్‌ వంటివారు నరేన్‌ కొడాలి టీమ్‌ను అభినందనలు చెప్పిన తరువాత వారు ఇంకా విజేతలు గా ప్రకటించడంలో తానా బోర్డు జాప్యం చేస్తే దాని వల్ల తానా పేరు ప్రతిష్టలకు మచ్చ వస్తుందని తానా సభ్యులు వాపోతున్నారు. వర్గ పోరులో ఇప్పటికే తానాకు డ్యామేజ్‌ వచ్చేలా కొందరు వ్యవహరించారని, కోర్టులకు వెళ్ళి తానాకు అనవసర వ్యయం అయ్యేలా చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు.

తానాలో నిరంజన్‌ శృంగవరపు వర్గం తమకు బోర్డులో ఉన్న మెజారిటీతో వారే ఆన్‌ లైన్‌ ఓటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుని వారే ఎన్నికల నిర్వహణకు సంస్థను ఏర్పాటు చేసి నిర్వహించిన తరువాత ఇప్పుడు వారే ఎన్నికల తీరుపై సందేహాలు వ్యక్తం చేయడం ఎంతవరకు సమంజసమని ఎదుటివర్గంలో సభ్యులు కొందరు ప్రశ్నిస్తున్నారు. దానికితోడు నిరంజన్‌ వర్గమే సభ్యుల డాటా బ్యాంక్‌ ను ఆ సంస్థకు ఇచ్చి ఎన్నికలు నిర్వహించమని కోరింది. ఇప్పుడు అందులో తప్పులు ఉంటే ఎవరు బాధ్యత వహించాలి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో అటు ఇటూ అయితే ఎన్నికలు నిర్వహించిన ఎలక్ట్రిగిటీ సంస్థ తిరిగి తానా మీదే పరువు నష్టం దావా వేసినా అశ్చర్యపోనక్కరలేదని అంటున్నారు.

మొత్తం మీద తానా ఎన్నికలు, ఫలితాల వెల్లడి తరువాత వ్యవహరిస్తున్న కొందరి పెద్దల వల్ల తానా పేరు ప్రతిష్టలకు మచ్చ వస్తోందని తానా సభ్యులతోపాటు, తానా అంటే అభిమానం ఉన్న అమెరికాలోని తెలుగువారంతా పేర్కొంటున్నారు.

 

- చెన్నూరి వెంకట సుబ్బారావు 

 

 

 

 

Tags :