ఎన్నారైలకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు... చదలవాడ కృష్ణమూర్తి
అమెరికాలో వివిధ నగరాల్లో ఇటీవల జరిగిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న ఎన్నారైల భక్తి ప్రపత్తులు, చేసిన ఏర్పాట్లు తనను ఎంతో ఆకట్టుకున్నాయని, ఈ సందర్భంలో ఎన్నారై భక్తులు చేసిన వినతుల మేరకు వారికి తిరుమలలో ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి ప్రకటించారు. 'తెలుగు టైమ్స్' ఎడిటర్ చెన్నూరి సుబ్బారావుతో ఆయన మాట్లాడుతూ, ఎన్నారై భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్ల విషయమై తాను చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన దీనికి అంగీకరించినట్లు చదలవాడ తెలిపారు. ఎన్నారైలు తమ ట్రావెల్ డాక్యుమెంట్లను టీటిడి అధికారులు ఏర్పాటు చేసే ప్రత్యేక కౌంటర్లలో చూపిస్తే వారి ప్రయాణ సమయానికి అనుగుణంగా వారికి దర్శన సౌకర్యాన్ని టీటిడి అధికారులు కల్పిస్తారని ఆయన చెప్పారు.
తిరుమల దేవదేవుని అనుగ్రహం ఉన్నందువల్లనే తనకు టీటిడి బోర్డు చైర్మన్ పదవి లభించిందని ఆయన చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరివద్ద జరిగిన బాంబు దుర్ఘటన సమయంలో తాను కూడా చంద్రబాబుతోపాటు కారులోనే ఉన్నానని అదృష్టవశాత్తు తాను ఈ దుర్ఘటన నుంచి బయటపడ్డానని అంతా శ్రీ వేంకటేశ్వర స్వామి దయ వల్లనేనని తాను ఇప్పటికీ అనుకుంటానని చెప్పారు. ఇప్పుడు ఆ దేవదేవునికి మరోసారి సేవ చేసే అవకాశం టీటీడి బోర్డు చైర్మన్ పదవి ద్వారా లభించిందని చదలవాడ కృష్ణమూర్తి పేర్కొన్నారు. భక్తులకు పారదర్శకంగా పనిచేసేందుకే తన హయాంలోని బోర్డు ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ప్రపంచంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయాల అభివృద్ధికి, మార్గదర్శనానికి టీటిడి సహకరిస్తుందని కూడా ఆయన తెలిపారు. మాతృరాష్ట్రాల్లోని వాళ్ళకన్నా విదేశాల్లో ఉన్న ముఖ్యంగా అమెరికాలో ఉన్న భక్తులు చూపుతున్న భక్తితత్పరతలు, సేవా కార్యక్రమాలు తనను ఎంతో ఆకట్టుకున్నాయని చదలవాడ కృష్ణమూర్తి చెప్పారు.