ASBL Koncept Ambience

ఘనంగా శ్రీ కళాసుధ ఉగాది వేడుకలు... అవార్డు అందుకున్న వల్లేపల్లి శశికాంత్‌

ఘనంగా శ్రీ కళాసుధ ఉగాది వేడుకలు... అవార్డు అందుకున్న వల్లేపల్లి శశికాంత్‌

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీ శోభకృత ఉగాది నామ సంవత్సర వేడుకలు చెన్నైలో ఘనంగా జరిగాయి. స్థానిక ఆళ్వార్‌పేటలోని మ్యూజిక్‌ అకాడమీలో జరిగిన ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ముఖ్య అతిథిగాను, విశిష్ట అతిథులుగా ప్రముఖ సినీ నేపథ్యగాయని పి. సుశీల, హాస్యనటుడు అలీ, ప్రముఖ నిర్మాత వై.రవిశంకర్‌, సౌత్‌ ఈస్ట్‌కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఎండీ మువ్వా పద్మయ్య తరపున ఆయన కుమారుడు  మహేష్‌ హజరయ్యారు. వీరందరినీ శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్‌ ఘనంగా సన్మానించింది.

ఈ వేడుకల్లో విశిష్ట పురస్కార్‌ అవార్డును ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎన్నారై, తానా ఫౌండేషన్‌ కార్యదర్శి వల్లేపల్లి శశికాంత్‌, సంగీత మొబైల్స్‌ ఎండీ ఎల్‌. సుభాష్‌ చంద్ర, జీవిత సాఫల్య అవార్డును ప్రసాద్‌ ఫిల్మ్‌ ల్యాబోరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపున ఎ రమేష్‌ తరపున సాయి ప్రసాద్‌ అందుకున్నారు. సినీ రంగం నుంచి ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం ( బింబిసార) అవార్డును నందమూరి కల్యాణ్‌ రామ్‌ స్వీకరించారు. బాపుబొమ్మ అవార్డును సినీ నటి ఈశ్వరీ రావు అందుకున్నారు. బాపురమణ పురస్కారాన్ని స్వీకరించిన సీతారామం దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ బాపు రమణ పురస్కారానికి తాను అర్హుడినో కాదో తనకు తెలియదన్నారు.

మహిళరత్నా పురస్కారం అందుకున్న ప్రముఖ వైద్యురాలు డాక్టర్‌ స్వర్ణలత మాట్లాడుతూ ఇంతమంది మహానుభావుల మధ్యతాను కూర్చోనే  భాగ్యం కల్పించిన కళా సుధ తెలుగు అసోసియేషన్‌కు ధన్యవాదాలు అని అన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి ఉత్తమ నిర్మాత అవార్డును స్వీకరించిన నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ ఇది తాను అందుకుంటున్న తొలి అవార్డు అని, అందుకే తనకు మాట్లాడేందుకు మాటలు  రావడం లేదన్నారు. ముఖ్యంగా కళాసుధ అసోసియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో ఈ అవార్డు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి అంకితం చేస్తున్నట్టు తెలిపారు. లతా మంగేష్కర్‌ అవార్డును  మహిళా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖ అందుకున్నారు. వీఎస్‌ఆర్‌ స్వామి పురస్కారాన్ని మేజర్‌ సినిమా డీవోపీ వంశీ పచ్చిపులుసు తీసుకున్నారు.  జీవిత సాఫల్య పురస్కారంను ఎ.రమేష్‌ అందుకున్నారు.విశిష్ట ఉగాది పురస్కార్‌ అవార్డును సంగీత మొబైల్స్‌ ఎండీ ఎల్‌. సుభాష్‌ చంద్రకు ఇచ్చారు.

హాస్య నటుడు ఆలీ మాట్లాడుతూ ఈ వేదికపై పదేళ్ళక్రితం వెయ్యి చిత్రాలు పూర్తయిన సందర్భంగా వెంకయ్య నాయుడు చేతుల మీదుగా వెండి కిరీటంతో సత్కరించారని, ఇప్పటివరకు 1225 చిత్రల్లో నటించానని గుర్తు చేసుకున్నారు. ఇన్ని చిత్రాలు చేసే అవకాశాన్ని ఈ తెలుగు చిత్ర పరివ్రమ కల్పించిందన్నారు. ఈ రోడ్లపై సైకిల్‌  తొక్కుతూ ఈ మ్యూజిక్‌ అకాడమీలో అవార్డు తీసుకోగలనా? అని అనుకునేవాడినని, ఇప్పుడు ఇక్కడకు కారులో వచ్చి ఈ అవార్డును తీసుకోవడం తన తల్లిదండ్రుల పూర్వజన్మ  సుకృతమన్నారు. 

గాయని సుశీల మాట్లాడుతూ శ్రీ కళా సుధ తెలుగు అసోసియేష్‌కు, ఆ సంస్థ  ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కళారత్న ఎ.మురళీకృష్ణ వ్యవహరించగా, కళాసుధ వ్యవస్థాపకుడు బేతిరెడ్డి శ్రీనివాస్‌, ఆ అసోసియేసన్‌ కమిటీ సభ్యులు తదితరుల ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి.

 

 

 

Tags :