తానా రూపురేఖలు మారుస్తా : శ్రీనివాస గోగినేని
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ప్రస్తుత ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న శ్రీనివాస గోగినేని నా లక్ష్యం తానాను అందరూ మెచ్చేలా తయారు చేయాలన్నదే అని చెబుతున్నారు. 20 సంవత్సరాలుగా తానా కార్యక్రమాల్లో పాల్గొని 12 సంవత్సరాలకు పైగా అనేక పదవులు చేపట్టిన శ్రీనివాస గోగినేని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా 2015-17 తానా ఫౌండేషన్ చైర్మన్‌గాను 2015 డిట్రాయిట్ తానా కాన్ఫరెన్స్ సెక్రటరీగాను శ్రీనివాస గోగినేని చేసిన చేసిన సేవలు అందరికీ తెలిసిందే. అమెరికాలోని సుమారు 20 రాష్ట్రాల్లో ‘‘మన ఊరికోసం’’ నినాదంతో మొదలుపెట్టి చేసిన 5కే రన్స్ కార్యక్రమాల మూలంగా తానా అందరికి చేరువ అయింది. దీని ద్వారా సమీకరించిన కోట్లాది రూపాయలను తెలుగు రాష్ట్రాల్లో పలు కార్యక్రమా లకు వినియోగించారు. వర్గపోరు లేకుండా, పెత్తందారి వ్యవస్థ రాకుండా నవతానాను నిర్మించాలన్నదే తన ఆశయమని ‘తెలుగు టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనివాస గోగినేని చెప్పారు. సమగ్రత, సంస్కరణలు, అంకిత సేవ అన్న నినాదంతో ఆయన ఎన్నికలబరిలోకి దిగారు. కోర్టు ముంగిట ఉన్న మెంబర్‌షిప్‌తోపాటు, భవిష్యత్తులో తానా ఎలా ఉండాలన్న విషయాలను శ్రీనివాస గోగినేని ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.
తానా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు కదా? మీరు తానాను ఏ విధంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు?
తానాలో ఎన్నో పదవులను నిర్వహించిన అనుభవంతోపాటు, చేసిన సేవా కార్యక్రమాల వల్ల తానాకు ఎంతో పేరు తీసుకువచ్చాను. దానికితోడు ఇప్పుడు నేను సెమి రిటైర్డ్ పర్సన్‌ని, నేను ఇప్పుడు ఎన్నికై, నా ఇయర్ మొదలు అయ్యేటప్పటికి తానాకోసం బాగా టైం కేటాయించగలను. ఇప్పుడు తానాకి 46 ఏళ్ళు. నేను గెలిచి, నా ఇయర్ ప్రారంభం అయ్యి, నా కాన్ఫరెన్సు వచ్చే సరికి తానాకి 50 ఏళ్ళు వస్తాయి. ఆనందం - ఉత్సాహం కూడిన ఒక కొత్త రకమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. నేను ఆ దిశగా పని చేస్తాను.
కోర్టు తీర్పు ఏవిధంగా ఉండనున్నది? ఎన్నికలపై దాని ప్రభావం ఎంత?
కొత్తగా చేరిన మెంబర్లలో కేవలం ముగ్గురు మాత్రమే తమకు ఓటు హక్కు కల్పించాలని కోర్టుకు వెళ్ళారు. మొత్తం మెంబర్లకు ఓటు హక్కు కల్పించాలన్న విషయమై కేసు లేదు. ఈ దిశలో వచ్చే తీర్పును అనుసరించి బోర్డ్, ఇసిలు దానికి ఆమోదం తెలియజేశాక ఎన్నికల తేదీలను మరోసారి ప్రకటిస్తాయని భావిస్తున్నాను.
తానాలో మీరు చేసిన సేవా కార్యక్రమాలు వివరిస్తారా?
తానా ఫౌండేషన్ చైర్మన్‌గా ఉన్నప్పుడు నేను చేసిన 5కె రన్, మన ఊరి కోసం ప్రోగ్రాంలు చాల పేరు తెచ్చాయి. మంచి ఆదరణ పొందాయి. చైతన్య స్రవంతి కార్యక్రమం ద్వారా కంటిచూపు క్యాంపులు, కాన్సర్ నిర్దారణ శిబిరాలు, గ్రహణం మొర్రి ఆపరేషన్లు, డిజిటల్, పుస్తక లైబ్రరీస్ ఏర్పాటు, రాష్ట్ర స్థాయి చెస్ పోటీలు, విద్యార్థి స్కాలర్ షిప్‌లు వంటి అనేక కార్యక్రమాల ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వేలాది మందికి ప్రయోజనం కలిగించాను. అంతేగాక, తానాబోర్డులోను, తానా ఎగ్జిక్యూటివ్ కమిటి లోను, బైలాస్ కమిటీ మొదలు అనేక పదవుల్లో విశిష్ట సేవలందించిన అనుభవంతో మరిన్ని కార్యక్రమాలను ప్రెసిడెంట్‌గా ఎన్నికైతే చేయాలని ఉంది.
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని మీరెందుకనుకున్నారు?
గతంలో తానాలో సంక్షోభం వచ్చిన సమయంలో తానాను నిలబెట్టడానికి కృషి చేసినవారిలో నేను కూడా ఒక్కడిని. ప్రస్తుతం తానా ఉన్నత శిఖరాలు చేరిన తరుణంలో కాలగమనంతో పాటు సమాజంలో మారుతున్న కొన్ని పరిస్థితులు, అనేక సంవత్సరాలు గా ఒకే వరవడిలో సాగిపోతే వచ్చే కొన్ని అలసత్వ లక్షణాలు, పెరుగుతూ వస్తున్న సంస్థ వెలుపలి శక్తుల ప్రభావం కారణంగా తానా సంస్థ మనుగడ, నడవడిక, భవిష్యత్తుపై అనేకమంది నాయకులు, వాలంటీర్లు, జీవిత సభ్యులు తమ ఆందోళనను, ఆలోచనలను నాతో పంచుకున్న నేపథ్యంలో నా కర్తవ్యం నాకు బోధపడిరది. తానా మనందరిది. దీనిని కాపాడు కోవాలని. ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగాను. అనేక మంది పూర్వ అధ్యక్షులు, సీనియర్ నాయకుల సహకారంతో పూర్తిస్థాయి ప్యానెల్‌తో ‘‘టీం గోగినేని’’ పేరుతో ఈ ఎన్నికల్లో పోటీకి దిగాను.
తానా ఎన్నికల నిర్వహణలో మార్పు రావాలంటారా?
అవును. తానాలో సంస్థాగతంగా నెలకొన్న పెత్తందారీ వ్యవస్థను, ధన ప్రాబల్యంతోను, బలవంతపు బ్యాలెట్ కలెక్షన్స్ తో నిర్వహించే ఎన్నికల తంతును నేను బహిరంగంగా విమర్శిస్తుంటాను. ఇప్పుడు కూడా బ్యాలెట్ కలక్షన్లకు నేను వ్యతిరేకం. ఈసారి ఎన్నికల్లో ఆన్‌లైన్ ఓటింగ్ వస్తే ఇలాంటి బ్యాలెట్ కలెక్షన్లకు చెక్ పెట్టినట్లు అవుతుంది.
ఈ ఎన్నికల్లో నా స్లోగన్ ఒక్కటే ‘‘తానా మనందరిదీ’’ అంటూ పోటీ చేస్తున్నాను. తానా గర్వపడేలా చేయడంలో తనతోపాటు కలిసిరావాలని తనను తన ప్యానెల్ టీం గోగినేనిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తానా సభ్యులను ఈ ఇంటర్వ్యూ మూలంగా కోరుతున్నాను.