ఆటా కాన్ఫరెన్స్ లో శ్రీనివాస కళ్యాణం
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్ డీసీలో నిర్వహిస్తున్న ఆటా మహాసభల్లో భాగంగా జూలై 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంను నిర్వహిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో అందరూ పాల్గొనాలని కోరుతోంది. ఈ కళ్యాణ మహోత్సవం కోసం తిరుమల నుంచి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి విగ్రహాలను ఇక్కడికి తీసుకువస్తున్నారు. టీటీడి నుండి వచ్చిన వేదపండితులు, అర్చకులు, తిరుమలలో జరిగే విధంగా శాస్త్రోక్తంగా మంత్రోచ్ఛారణల మధ్య ఈ శ్రీనివాస కళ్యాణాన్ని చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడి ధర్మకర్తల మండలి చైర్మన్ ఎస్.వి. సుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొంటున్నారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని టీటీడివారు తిరుమల నుంచి తీసుకువచ్చిన లడ్డు ప్రసాదాలను స్వీకరించాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. కార్యక్రమంలో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి శోభారాజు సంగీత కచేరి కూడా జరుగుతుంది. కళ్యాణ స్వర సందేశం పేరుతో ఆమె ఈ కచేరిని చేయనున్నారు. నీహార్ బృందం వారిచే అన్నమయ్య, రామదాసు కీర్తనల ఆలాపన కూడా ఏర్పాటు చేసినట్లు కమిటీ చైర్ శ్రీనివాస్ నది, శ్రీకాంత్ చల్లా తెలిపారు.