ASBL Koncept Ambience

తానా జాయింట్ ట్రెజరర్ పదవికి పోటీ పడుతున్న సునీల్ పంత్ర

తానా జాయింట్ ట్రెజరర్ పదవికి పోటీ పడుతున్న సునీల్ పంత్ర

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 సంవత్సరంలో జరిగే ఎగ్జిక్యూటివ్‍ కమిటీ ఎన్నికల్లో తానా జాయింట్‍ ట్రెజరర్‍ పదవికి డెట్రాయిట్‍కు చెందిన యువతరం నాయకుడు సునీల్‍ పంత్ర పోటీ పడుతున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం నాంపల్లి గ్రామానికి చెందిన సునీల్‍పంత్ర డెట్రాయిట్‍లో స్థిరపడ్డారు. 2007లో ఉద్యోగరీత్యా డెట్రాయిట్‍ వచ్చారు. చిన్నతనం నుండి రెడ్‍ క్రాస్‍, ఎన్‍.సీ.సీ, యువజన సర్వీసులు వంటి సంస్థల్లో పనిచేసిన అనుభవంతో డెట్రాయిట్‍ వచ్చిన అనంతరం కూడా కమ్యూనిటీ సర్వీస్‍లో పాల్గొనడం చేస్తున్నారు. స్థానిక  డెట్రాయిట్‍ తెలుగు అసోసియేషన్‍లో, శ్రీ వెంకటేశ్వర ఆలయం, షిరిడి సాయి దేవాలయం, తానా స్థానిక విభాగం వంటివాటిలో చురుకైన పాత్రను ఆయన పోషించారు. డెట్రాయిట్‍ తెలుగు సంఘానికి 2012లో ప్రధాన కార్యదర్శిగా, 2010, 2011లో ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడమే గాక అతి పిన్న వయసులో సంస్థను ఎన్నారైలకు చేరువ చేసే కార్యక్రమాలను నిర్వహించినందుకు డిటిఎ నుంచి వడ్లమూడి వెంకటరత్నం పురస్కారాన్ని అందుకున్నారు.

తానాతో 2009 నుంచి ఆయన అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ధీంతానా సమన్వయకర్తగా, ప్రకటనల విభాగం అధ్యక్షుడిగా, డెట్రాయిట్‍ తానా మహాసభల ప్రచార విభాగం నాయకుడిగా, ఎలక్ట్రానిక్‍ మీడియా చైర్‍పర్సన్‍గా, 2015 డెట్రాయిట్‍ సభల మీడియా విభాగ అధ్యక్షుడిగా, 2017-19 తానా సాంస్కృతిక  సేవల సమన్వయకర్తగా పనిచేశారు. తానా ప్రాంతీయ ఉపాధ్యక్షునిగా 2017లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తానా ఫౌండేషన్‍ తరుపున ప్రచార వీడియోలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించడంతోపాటు, ఏపి జన్మభూమి పథకానికి డెట్రాయిట్‍ సమన్వయకర్తగా కూడా వ్యవహరించారు. అందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున సాంస్కృతిక, సేవా, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన తానా ఎగ్జిక్యూటివ్‍ కమిటీలో 2019-21 సంవత్సరానికిగాను సాంస్కృతిక సేవా కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

తానా కార్యవర్గంలో మరోసారి చోటు కల్పిస్తే తానా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు టీంస్క్వేర్‍కు లక్ష డాలర్లను తన హయాంలో సేకరించే విధంగా తన సమయాన్ని ఖర్చు చేస్తానని తెలిపారు. దీనితో పాటు తానా నిధుల ప్రవాహంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా జవాబుదారీతనం పెంపొందించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. పథకానికి డెట్రాయిట్‍ సమన్వయకర్తగా వ్యవహరించాను.

తానాలో నిర్వహించిన పదవులు

2019-21: సాంస్కృతిక సేవా కార్యక్రమాల సమన్వయకర్త
2017-19: ఉత్తర ప్రాంతీయ ప్రతినిధి
2015-17: మీడియా విభాగ అధ్యక్షుడు
2014-15: తానా 19వ మహాసభల మీడియా కమిటీ అధ్యక్షుడు
2011-13: తానా ప్రకటనల విభాగ అధ్యక్షుడు
2019-20 లో చేపట్టిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు

2019 డీసీ సభల్లో తానా సాంస్కృతిక సేవా సమన్వయకర్తగా బాధ్యతల స్వీకరణ. అదే ఏడాది అమెరికావ్యాప్తంగా ప్రముఖ అవధాని మేడసాని మోహన్‍చే 20కుపైగా ప్రవచన కార్యక్రమాలు.

ప్రముఖ రచయిత జొన్నవిత్తులచే అమెరికా అంతటా 10కు పైగా సమావేశాలు.

అమెరికాపై కోవిద్‍ పంజా విసిరి ప్రవాసులు గృహాలకే పరిమితం అయిన కాలంలో వారిని అలరించేందుకు అంతర్జాలం ద్వారా దేవిశ్రీ, థమన్‍, అనీల్‍ రావిపూడి వంటి సినీ సంగీత దర్శకులతో సంగీత విభావరి ఏర్పాటు. ప్రముఖ గాయనీ శోభారాజుచే రెండు నెలల పాటు 600కు పైగా ప్రవాస చిన్నారులకు సంగీతంలో శిక్షణా తరగతులు. ఈ కార్యక్రమాన్ని చిన్నజీయర్‍ స్వామిజీ ప్రారంభించారు.

అమెరికావ్యాప్తంగా 100కుపైగా చిన్నారులు ఈ కార్యక్రమం ద్వారా ఏడాది పొడవునా సంగీత తరగతుల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు.

20మంది సంగీత కళాకారులతో ఎస్పీ బాలుకు నివాళి పేరిట ఏర్పాటు చేసిన అంతర్జాల కార్యక్రమంలో 50వేలకు ప్రవాసులు పాల్గొని గానగంధర్వుడికి నివాళులర్పించారు.

స్థానిక ప్రాంతీయ ప్రతినిధి కిరణ్‍ దుగ్గిరాలతో కలిసి సీపీఆర్‍, క్రీడాపోటీలు నిర్వహణ.

కోవిద్‍ సమయంలొ తానా కేర్స్ ఛైర్మన్‍ పెద్దిబోయిన జోగేశ్వరరావు సహకారంతో %వి%6000 విలువైన ఆహారాన్ని తానా-మిషిగన్‍ విభాగం పంపిణీ.  కళాకారులకు కోవిద్‍ సమయంలో ఆర్థికంగా బాసట. అంతర్జాలంలో నిర్వహించిన బాలోత్సవానికి సహకారం.

గత జులైలో నిర్వహించిన సాంస్కృతికోత్సవానికి 40దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సమన్వయకర్తగా తోడ్పాటు.

సెప్టెంబర్‍ 2020లో రామాచారి, డా.వైసరాజు సుబ్రహ్మణ్యంల నేతృత్వంలో తెలుగు డిజిటల్‍ ఐడల్‍ పోటీల నిర్వహణ. 1000మంది పాల్గొన్న ఈ పోటీల్లో ముగ్గురు తుది పోటీదారులకు తానా తరఫున బహుమతుల ప్రదానం.

డిసెంబరు 2020లో అమెరికావ్యాప్తంగా ఉన్న 12 స్థానిక తెలుగు సంఘాలతో కలిసి 12 సురభి నాటకోత్సవాలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర.

అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‍, కార్యదర్శి పొట్లూరి రవిల సహకారం విలువైనదని, తనకు సహాయ కోశాధికారిగా అవకాశం కల్పిస్తే తానా ద్వారా మరోసారి తన సత్తా చాటుతానని సునీల్‍ అంటున్నారు. 

 

Tags :