ASBL Koncept Ambience

టి.ఏ.జి.బి దసరా దీపావళి ధమాకా

టి.ఏ.జి.బి దసరా దీపావళి ధమాకా

బోస్టన్‌ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం (టిఎజిబి) ఆధ్వర్యంలో ఇటీవల అక్టోబర్‌ 29వ తేదీన నిర్వహించిన దసరా, దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఫ్రేమింగ్‌ హామ్‌ సిటీ, కీఫె టెక్‌  స్కూల్లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 600 మంది పాల్గొనడంతోపాటు నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి ఆనందపరవశులయ్యారు. ఈ  వేడుకలు జరిగిన ప్రాంగణాన్ని తెలుగు సంస్కృతీ, సంప్రదాయం కనిపించేలా అలంకరించడం వచ్చినవారిని అలరించింది. టి.ఏ.జి.బి కార్యవర్గం మరియు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోస్టన్‌ పరిసర ప్రాంతాల తెలుగు వారు ఉత్సాహంగా పాల్గొని, సాంప్రదాయ- సినీ పాటలు, నృత్యాలు, నాటికలు వంటి వైవిధ్య భరితమైన వినూత్న కార్యక్రమాలు ప్రదర్శించారు. వయో భేదం లేకుండా పిన్నా పెద్దా పాల్గొని ఆనందించారు. రకరకాల అంగడులు, కమ్మటి ఫలహారాలు పిల్లల సందడులుతో ప్రాంగణం కళకళ లాడిరది. వినోదం విజ్ఞానం మేళవించిన కార్యక్రమం అని సభ్యులు కొనియాడారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేశారు.

టి.ఏ.జి.బి అధ్యక్షురాలు శ్రీమతి పద్మజ బలభద్రపాత్రుని. టీ.ఏ.జి.బి తరఫున తెలుగు నేర్చుకుంటున్న పిల్లలను, ప్రోత్సహిస్తున్న తల్లి దండ్రులకు, పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు, కృతజ్ఞతాభివందనములు అందించారు. తెలుగు కథల మరియు సాంప్రదాయక నృత్య పోటీలలో పాల్గొన్న దాదాపు 100 పిల్లలకు బహుమతులు అందించారు. బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలు చైర్మన్‌ అనిల్‌ పొట్లూరి, వైస్‌ చైర్మన్‌ కృష్ణ మాజేటి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అందజేశారు. సాంస్కృతిక కార్యదర్శి గాయత్రి అయ్యగారి ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. వీనులవిందుగా సంప్రదాయక సంగీతం, ‘‘నారీ శక్తి’’ వారి కోలాటాం, హాస్య నాటాకం ‘‘శుభ మంగళం’’ వంటి వైవిధ్యమైన సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు, చిన్నారులు చేసిన ఇంకెన్నో ఉత్సాహ భరితమైన, ఉత్తేజ పూరితమైన సినీ నాట్యాలు ప్రేక్షకులని ఉర్రుతలూగించాయి.

దసరా దీపావళి ధమాకా సందర్భంగా ప్రదర్శించిన ప్రత్యేక కార్యక్రమం, టాలివుడ్‌ ఫేమ్‌ గాయని అంజనా సౌమ్య మరియు శ్రీకాంత్‌ లంక చేసిన సంగీత విభావరి అందరినీ ఉర్రూతలూగించింది. వ్యాఖ్యాతలు గా వ్యవహరించిన సాంస్కృతిక శాఖ మరియు యువ టి.ఏ.జి.బి సభ్యులు కార్యక్రమంలో మెరిసి మురిపించారు. ఈ దసరా దీపావళి కార్యక్రమం టి.ఏ.జి.బి కిరీటంలో మరో కలికితురాయి అంటే అతిశయోక్తి కాదు. 

 

Click here for Event Gallery

 

 

Tags :