ASBL Koncept Ambience

చికాగోలో ఘనంగా శ్రీరామనవమి, ఉగాది వేడుకలు

చికాగోలో ఘనంగా శ్రీరామనవమి, ఉగాది వేడుకలు

చికాగోలో శ్రీరామనవమి, ఉగాది వేడుకలను తెలుగువారు వైభవంగా జరుపుకున్నారు. గ్రేటర్‌ చికాగో తెలుగు సంఘం (టిఎజిసి) ఆధ్వర్యంలో ఇక్కడి బార్ట్‌లెట్‌ హైస్కూల్‌లో  దుర్ముఖి నామ సంవత్సర ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలను మరియు 45వ వార్షికోత్సవాలను చాలా ఘనంగా నిర్వహించారు. నరసింహ చారి  వేద మంత్రాలతో మరియు జీయర్‌ స్వామివారి ఆశ్రమము నుండి వచ్చిన శ్రీశ్రీ దేవనాథ జీయర్‌ స్వామి వారి దీపారాధనతో కార్యక్రమాలను ప్రారంభించారు. స్వామీజీ వారు రామ నామ స్తోత్రాలు, ప్రవచనాలు ఉచ్చారణ మరియు వాటి విశిష్టతను తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని నిర్దేశించే శ్రీ రామానుజాచార్యుల వారి  విశిష్టతను తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని సంస్థ  అధ్యక్షులు ప్రదీప్‌ కందిమళ్ల తనదైన శైలిలో అతిథులను స్వాగతించి, శ్రీశ్రీ దేవనాథ జీయర్‌ స్వామిని జ్ఞాపిక మరియు శాలువాతో సత్కరించి, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రపంచ దేశాలలో మొదటి సంస్థగా వెలిసి ఆదాయప్రయోజనము లేకుండా మన తెలుగు సాంస్కృతిక కట్టుబాట్లు మరియు పూర్వ సంస్కృతి ఆచార ప్రచార కార్యక్రమాలను  చికాగో మహానగరంలో గత 45 సంవత్సరములుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. టిఎజిసి డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ ద్వారా తెలుగు రాష్ట్రాలకే కాకుండా స్థానిక సమాజ సేవలో కూడా ముందుండి టీఏజీసి పనిచేస్తుందని, అవసరమైన సంస్థను సంప్రదించవచ్చని చెప్పారు.

శ్రీరామ నవమి సందర్భముగా రాములవారి కీర్తి ప్రతిష్టతలను తెలిపే సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించి ప్రదర్శించారు. వాటితోపాటు కూచిపూడి, కథక్‌, భరతనాట్యము, జానపదం మరియు చిత్ర గీతమాలిక నృత్యాలను కూడా ప్రదర్శించారు. కార్యక్రమాలలో చిన్నారులతోపాటు పెద్దలు అందరూ కలసి 225 మందికిపైగా కళాకారులూ పాల్గొన్నారని సాంస్కృతిక కార్యదర్శి సాయి గొంగాటి వివరించారు.

గురు బ్రహ్మ గురు విష్ణు, గురు దేవో మహేశ్వర అన్నట్టుగా ఇక్కడ చికాగోలో నివసిస్తూ కళను పోషిస్తున్న కూచిపూడి మరియు భరతనాట్యము బోదించే గురువులకు సంస్థ తరుపున వందన ఆధ్వర్యంలో గురువులను  ఘనంగా సత్కరించి సన్మానించారు. గాయకుడు ప్రవీణ్‌ జాలిగామ గారిని ఘనంగా సత్కరించి సన్మానించారు. వెంకట్‌ గునగంటి మరియు అధ్యక్షుడు గత సంవత్సరము చేసిన సేవ కార్యక్రమాలకు గుర్తింపుగా అమెరికా అధ్యక్షుడు సంతకంతో వచ్చిన పివిఎస్‌ఎ సర్టిఫికెట్‌ను చిన్నారులకు అందచేసారు.

కూల్‌మిర్చి వారు సరఫరా చేసిన రాత్రి భోజనము చక్కగా అమర్చి వడ్డించారు. వడ్డించడానికి సహాయ సహకారాలు అందించిన నరేందర్‌ చామర్ల, అంజిరెడ్డి, రంగారెడ్డి, సంపత్‌ మరియు కార్యకర్తలకు అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి 1500 మందికి పైగా సభ్యులు మరియు అతిధులూ హాజరైనట్లు సంస్థ కార్యదర్శి రాము బిల్లకంటి చెప్పారు మరియు విచ్చేసిన సభ్యులకు టికెట్స్‌ను అందచేయడానికి సహకరించిన శ్రీనివాస్‌, మమత, భారతం, రవి మరియు కార్యకర్తలకు అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.

ఈ సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందించి చక్కగా సజావుగా జరిపించడానికి సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులు సాయి, సుజాత, బిందు, ఉమ, శ్వేత, మరియు కార్యకర్తలకు అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.

టాలీవుడ్‌ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమస్‌, వారి బృందము ప్రదర్శించిన సంగీత విభావరి అందరినీ అలరించాయి.


Click here for Event Gallery

 

Tags :