టిఏజిసి ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు
మొట్ట మొదటి తెలుగు సంస్థ అయిన చికాగో మహానగర తెలుగు సంస్థ (టి ఏ జి సి) ఆధ్వర్యంలో సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు హిందూ టెంపుల్ అఫ్ గ్రేటర్ చికాగో వారి ఆడిటోరియం లో ఫిబ్రవరి 1 న మధ్యాహ్నం 2:30 ప్రారంభమై రాత్రి 10:00 వరకు చాలా ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని గణపతి ప్రార్థనతో సంస్థ అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ వేములపల్లి & శ్రీమతి క్రాంతి వేములపల్లి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీ వెంకట్ గూనుగంటి, ముఖ్య కార్యదర్శి శ్రీ అంజి రెడ్డి కందిమళ్ల, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి వినీత ప్రొద్దుటూరి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.
శ్రీమతి నీలిమ ఛేకీచర్ల మరియు అలంకరణ సభ్యులు ముఖద్వారం, నృత్యవేదికను సంక్రాంతి, గణతంత్ర దినోత్సవ ప్రతిమలతో సుందరంగా అలంకరించారు. నృత్యవేదిక ముందు బొమ్మలకొలువును చాలా చక్కగా ఏర్పాటు చేసారు. పిల్లలకు పతంగుల తయారీ పోటీ నిర్వహించి బహుమతులను ప్రధానం చేసారు.
శ్రీ అంజి రెడ్డి కందిమళ్ల, కోశాధికారి శ్రీ పాండు రంగా రెడ్డి లెంకల, కో-కోశాధికారి శ్రీ రమణ కాల్వ మరియు శ్రీ పరమేశ్వర యరసాని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. శ్రీమతి ఉమా అవధూత మరియు ఇతర మహిళా వాలంటీర్లు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగు ఆడపడుచులను సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి పన్నీరు చిలకరించి ఆహ్వానించారు. ఈ వేడుకల్లో దాదాపు 1500 మంది సభ్యులు మరియు అథితులు పాల్గొన్నట్లు సంస్థ సభత్వ నమోదు కార్యదర్శి శ్రీ పరమేశ్వర రెడ్డి యరసాని తెలిపారు.
తెలుగు సాంప్రదాయినికి ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత తెలిపే బాలుర నృత్యప్రదర్శన, రైతుల ప్రాముఖ్యాన్ని మరియు వారి కష్టాలను వివరించే 'జై కిసాన్' పర్యావరణ ప్రాముఖ్యాన్నిచాటి చెప్పే "వనం" కార్యక్రమం, ప్రస్తుత సమాజంలో మహిళల ఎదుర్కొంటున్న సమస్యలను వాటిని ఎలా ఎదుర్కోవాలో వివరించే 'విమెన్ ఎంపవర్మెంట్' నాటిక, గణతంత్ర దినోత్సవం మరియు వివిధ చిత్ర గీతాల మాలిక 'చిత్రలహరి' ప్రోగ్రాం, చిన్నారులు ప్రదర్శించిన భరతనాట్యం మరియు మరెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. 32 టీమ్స్ ద్వారా 350 ప్రదర్శనకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని, ప్రదర్శనకారులకు టిఏజిసి తరుపున సర్టిఫికెట్స్, వినూత్నంగా పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా మొక్కలను టీం కో-ఆర్డినేటర్స్ కు అందజేశామని సంస్థ సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి వినీత ప్రొద్దుటూరి తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయటానికి రెండు నెలలుగా శ్రమించిన కల్చరల్ కో-చైర్స్ శ్రీమతి శిరీష మద్దూరి, శ్రీమతి మాధవి రాణి కొనకళ్ల, శ్రీమతి శిల్ప పైడిమర్రి, శ్రీ శ్రీకాంత్ బేతి మరియు కూర్పుకర్తలు, సమన్వయకర్తలు కు ధన్యవాదములు తెలిపారు.
ఈ ఉత్సవానికి విచ్చేసిన అధితులకు వడ్డించటానికి సంక్రాంతి పండుగ పిండివంటలైన నేతి అరిసెలు, చెక్కినాలు తో పాటు ఉలవచారు, వడియాలు, చల్ల మిరపకాయలు తెలుగు రాష్ట్రాలనుంచి ప్రత్యేకంగా తెప్పించామని మరియు వీటితోపాటుగా వివిధరకాలైన ఆహారాలను బావార్చి రెస్టారెంట్ Naperville వారు సమకూర్చారని, కొన్ని వంటకాలను మట్టి కుండలలో పెట్టి వడ్డించామని, విందు భోజనం చాలా రుచికరంగా ఉందని, భోజనశాల అలంకరణ చాలా బాగుందని అథితులు ప్రశంసించారని ఫుడ్ కమిటీ కార్యదర్శి శ్రీ సంతోష్ కొండూరి తెలిపారు. ఆహార ఏర్పాటులను పర్యవేక్షించిన యూత్ కార్యదర్శి శ్రీ విజయ్ బీరం, శ్రీ వెంకట్ గూనుగంటి, శ్రీ శశి చావా, శ్రీ నవీన్ ఎడుమ, శ్రీ రోహిత్ ఆకుల, శ్రీ శ్రీధర్ అలవల మరియు వాలంటీర్లు కు శ్రీ సంతోష్ కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ రోజు జరిగిన కార్యక్రమాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఫోటోలు, లైవ్ వీడియోల రూపంలో ప్రదర్శించటం జరిగిందని, మరిన్ని ఫోటోలు, వీడియోలను https://www.tagc.org/photos.php వెబ్సైటు ద్వారా చూడవచ్చని మీడియా కార్యదర్శి శ్రీ శ్రీధర్ అలవల తెలిపారు.
ఇల్లినాయిస్ స్టేట్ మెడికల్ డిస్సిప్లినరీ బోర్డుకు ఇల్లినాయిస్ గవర్నర్ నియమించిన తెలుగు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని సన్మానించటం జరిగినది. ఈ కార్యక్రమంలో డొనేషన్ ద్వారా సేకరించిన నిధులను టిఏజిసి నెల్లూరు కి చెందిన విశ్వ భారతి బ్లైండ్ స్కూల్ కి విరాళంగా అందించింది. విశ్వ భారతి బ్లైండ్ స్కూల్ అంధులు అయినా అనాధ బాలబాలికలను దరిచేర్చి వారికీ సహాయ సహకారాలు అందించే ఒక స్వచ్చంద సంస్థ.
రెండు చేతులు లేనిదే చప్పెటలు మ్రోగవు, నలుగురు లేనిదే సభని అలంకరించలేము అలాగే కొన్ని కుటుంబాలు కలవనిదే ఒక పండుగ పూర్తికాదు. ఈ రోజు మన ఈ సంక్రాంతి పండుగ సంబరాలని వెయ్యి రేట్లు అద్భుతంగా మరియు కన్నుల పండుగ గా తీర్చిదిద్ది విజయవంతం చెయ్యటానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు, కళాకారులకు, కళా అభిమానులకు, కళా పోషకులకు, కూర్పుకర్తలు, సమన్వయకర్తలు, కార్యకర్తలకు, కార్యవర్గ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు కు అధ్యక్షులు శ్రీ ప్రవీణ్ వేములపల్లి ధన్యవాదములు తెలిపారు. జాతీయ గీతాలాపనతో కన్నులపండుగగా జరిగిన ఈ కార్యక్రమం ముగిసింది.