ASBL Koncept Ambience

అహో అనిపించిన టిఎజిసి ఉగాది వేడుకలు

అహో అనిపించిన టిఎజిసి ఉగాది వేడుకలు

చికాగో మహానగర తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలను చికాగోలోని స్ట్రీమ్‌ వుడ్‌ హై స్కూల్‌ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. టీఏజీసీ సంఘం అధ్యక్షులు పరమేశ్వర రెడ్డి యరసాని, అరుణ శ్రీ యరసాని, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, సంతోష్‌ కొండూరి, ముఖ్య కార్యదర్శి రమణ కాల్వ, ఇతర బోర్డు సభ్యులు గణపతి ప్రార్థన, జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఉగాది, శ్రీరామనవమి పండుగ విశిష్టతను చిన్నారులు వివిధ నృత్య ప్రదర్శనలతో వివరించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులను టీఏజీసీ సభ్యులను కోశాధికారి శ్రీధర్‌ అలవల, సహ కోశాధికారి శివ కుమార్‌ దేసు, ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ సంతోష్‌ కొండూరి, ఉమా అవధూత, వినీత ప్రొద్దుటూరి, మాజీ అధ్యక్షులు వెంకట్‌ గూనుగంటి సాదరంగా ఆహ్వానించారు. సంస్థ సాంస్కృతిక కార్యదర్శి శిరీష మద్దూరి మాట్లాడుతూ 26 టీమ్స్‌తో 230 ప్రదర్శనకారులు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రదర్శనకారులకు టీఏజీసీ తరుపున సర్టిఫికెట్స్‌ అందజేస్తే.. అలాగే టీం కో-ఆర్డినేటర్లు, కొరియోగ్రాఫర్‌లకు బహుమతులు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి గత రెండు నెలలుగా శ్రమించిన కల్చరల్‌ కో-చైర్‌పర్సన్స్‌ లక్ష్మీ నారాయణ తోటకూర, శిల్ప పైడిమర్రి, స్వాతి బండికు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, కుటుంబ సభ్యులకు, భద్రాచలం దేవస్థానం నుంచి తెప్పించిన శ్రీ సీతారాముల వారి కల్యాణ తలంబ్రాలు అందించారు. భద్రాచలం దేవస్థానం నుంచి ఈ తలంబ్రాలు పంపిన మదినేని రంగ రావుకి టీఏజీసీ బృందం ప్రత్యేక ధన్యవాదములు తెలియజేసింది.

సాంస్కృతిక బృందానికి సహకరించిన టీఏజీసీ కార్యవర్గ సభ్యులు నీలిమ చేకిచర్ల, ప్రసన్న కందుకూరి, మాధవి రాణి కొనకళ్లను అభినందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగ సాహిత్య వింజమూరి అందరిని అలరించారు. టీఏజీసీ ఉగాది, శ్రీరామనవమి పండుగ వేడుకల్లో ముఖ్య అతిధిగా కాన్సులేట్‌ జనరల్‌ ఆఫ్‌ చికాగో, ఇండియా సోమనాథ్‌ ఘోష్‌ కార్యక్రమంలో పాల్గొని ఉగాది మరియు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిథమ్‌ టీం గాయనీ గాయకులు సాయి తరంగ్‌, యశస్వి నందవరీక్‌, వైష్ణవి నన్నూర్‌, హిరణ్య ఆత్రేయపురపు తమ పాటలతో అందరిని అలరించారు.

టీఏజీసీ ఉగాది, శ్రీరామనవమి పండుగ వేడుకల్లో భాగంగా రాఫెల్‌ టికెట్స్‌తో వచ్చిన మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరులో వున్న అమ్మ వృద్ధాశ్రమానికి విరాళంగా ఇచ్చారు. రాఫెల్‌ టికెట్స్‌ విజేతలకు 3, 2 మరియు 1 గ్రాము బంగారు నాణేన్ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. గతేడాదిలో టీఏజీసీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాలొన్న వాలంటీర్లకు పీవీఎస్‌ఏ రెకగ్నిషన్‌ సర్టిఫికెట్స్‌ను టీఏజీసీ బృందం వారు అందజేశారు.

టీఏజీసీ ఉగాది, శ్రీరామనవమి పండుగ వేడుకల్లో రుచికరమైన విందు భోజనం కూడా ఏర్పాటు చేసారు. ఆహారంలో ఉగాది పచ్చడి, పానకం, ప్రత్యేకంగా భారతదేశం నుండి తెప్పించిన కోవా పూరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటితో పాటు, మామిడి కాయ పులిహోర, జీరా రైస్‌, నవరత్న కుర్మా, పెరుగు అన్నం, చపాతీ, మిరప కాయ బజ్జి, పిల్లలకు పిజ్జా వంటి ఆహారాన్ని అందించారు. ఫుడ్‌ కో చైర్‌ రోహిత్‌ ఆకుల, కార్య వర్గ సభ్యులు సృజన నైనప్పగారి, రమణ కాల్వ, వేణు చెరుకూరి నేతృత్వంలోని వాలంటీర్‌ బృందం 600 మంది అతిథులుకు భోజన ఏర్పాట్లు చేశారు. రుచికరమైన ఆహారాన్ని అందించినందుకు శ్రీ కృష్ణ క్యాటరర్స్‌ నేపేర్‌ విల్లెకి టీఏజీసీ బోర్డు ధన్యవాదాలు తెలిపింది.

టీఏజీసీ అధ్యక్షులు యరసాని పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు మన ఈ ఉగాది, శ్రీరామనవమి పండుగ సంబరాలను కనుల పండువగా తీర్చిదిద్ది విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు, కళాకారులకు, కళా అభిమానులకు, కళా పోషకులకు, సమన్వయకర్తలు, వాలంటీర్లకు, కార్యకర్తలకు, బోర్డు సభ్యులు, కార్యనిర్వాహక సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు ధన్యవాదములు తెలిపారు. చివరగా ఈ కార్యక్రమాన్ని జాతీయ గీతం పాడి ముగించారు.

 

Click here for Event Gallery

 

 

 

Tags :