ఆకట్టుకున్న టిఎజిడివి ఉగాది వేడుకలు
తెలుగు అసోసియేషన్ గ్రేటర్ డెలావేర్ వ్యాలీ ఆధ్వర్యంలో శుభకృత్ ఉగాది వేడుకలను ఇటీవల వైభవంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణం, సాంస్కృతిక ప్రదర్శనలు, తెలుగు విందు భోజనం, ఉగాది సాంస్కృతిక పోటీ విజేతల ప్రకటనతోపాటు అందరినీ అలరించేలా సంగీత విభావరిని నిర్వహించారు. పెన్సిల్వేనియాలోని ఛాల్‌ఫాంట్‌లో ఉన్న భారతీయ టెంపుల్‌లో జరగిన ఈ ఉగాది వేడుకలకు దాదాపు 700మందికిపైగా అతిధులు హాజరయ్యారు. వచ్చినవారికి సంప్రదాయ ఉగాది పచ్చడితోపాటు పాయసం, బెల్లం జిలేబీ, కందిపొడి, గోగురా మరియు ఆవకాయ పచ్చడి వంటి తెలుగు రుచికరమైన వంటకాలను వడ్డించారు. మల్వెర్న్‌కు చెందిన బావర్చి బిర్యానీ గుత్తి వంకాయ, దొండకాయ ఫ్రై, సాంబార్, వెజ్ రైస్ మరియు మరెన్నో రుచికరమైన విందులను అందించింది. స్థానిక కళాకారులతో జరిగిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినవారికి ఉగాది అవార్డులను అందజేశారు. జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందించారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్, యూత్ ఎక్సెలెన్స్, ప్రొఫెషనల్ ఎక్సెలెన్స్, కమ్యూనిటీ సర్వీస్‌లో ప్రతిభ చూపినవారికి అవార్డులు ఇచ్చారు.
ఈ వేడుకలకు నాట్స్ మాజీ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, వైస్ ప్రెసిడెంట్ హరినాథ్ బుంగవతుల ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మాజీ అధ్యక్షులు హరనాథ్ దొడ్డపనేని, సరోజ సాగరం, మల్లిక్ బుధవరపు, కిరణ్ కొత్తపల్లి కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన అనుదీప్, నేహాలమనోహరమైన సంగీత కచేరీ అందిరినీ ఎంతో ఉత్తేజితులను చేసింది. వేడుకలను విజయవంతం చేసిన అందరికీ, టీఎజిడివి సభ్యులకు, స్పాన్సర్లకు, ఇతరులకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ లలిత శెట్టి ధన్యవాదాలు తెలియజేశారు.