కాన్సస్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
కాన్సస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సస్ సిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక హిందూ దేవాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 3 వేల మంది తెలుగు వారు పాల్గొన్నారు. మొదట అమ్మవారికి టీఏజీకేసీ అధ్యక్షులు నరేంద్ర దూదేళ్ల దంపతులతో దేవాలయ పూజారి శ్రీనివాసాచారి పూజలు నిర్వహించారు. ఈ సంబరాలకు వ్యాఖ్యాతగా రేణు శ్రీ వ్యవహరించి ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా వేడుకలను నడిపించారు. మహిళలంతా సంప్రదాయ దుస్తులను ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
తెలంగాణ జానపద, బతుకమ్మ పాటలకు అందరూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. బతుకమ్మను తయారుచేసి తీసుకొచ్చిన వారికి రాఫెల్ టికెట్స్ ఇచ్చి.. గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. బతుకమ్మను అందంగా పేర్చిన ఎనిమిది మందికి చీరెలను బహూకరించారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం విందుభోజనాలు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలు విజయవంతంగా జరగడానికి సహకరించిన కార్యకర్తలు, స్పాన్సర్స్‌కి టీఏజీకేసీ అధ్యక్షులు నరేంద్ర దూదేళ్ల, ఉపాధ్యక్షులు చంద్ర యక్కలి, ట్రస్ట్ బోర్డ్ చైర్‌పర్సన్ శ్రీధర్ అమిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.