ఘనంగా టిఎజికెసి దీపావళి వేడుకలు
కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హైస్కూలో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది తెలుగువారు పాల్గొన్నారు. చక్కని ప్రార్థనా గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కార్తిక్ వాకాయల, శ్రీలేఖ కొండపర్తి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. తెలుగు సంప్రదాయాన్ని సూచించే కూచిపూడి, భరత నాట్యం, జానపద, శాస్త్రీయ నృత్యాలతో పాటు ఎన్నో కొత్త సినిమా పాటలకు చిన్నారులు, పెద్దలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఈ వేడుకలో టిఎజికెసికి సేవలందించిన మంజుల సువ్వారి, సుచరిత వాసంను ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ నరేంద్ర దూదెళ్ళ, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అమిరెడ్డి, కార్యవర్గ సంఘం సత్కరించింది. అలాగే పలు అంశాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్ ఇచ్చి సత్కరించారు. రాఫెల్స్‌లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. చిన్నపిల్లల నృత్యాలే కాకుండా పెద్ద వాళ్లు చేసిన నృత్యాలు, ఆది శంకరాచార్య నాటిక, శ్రీరామునికి సంబంధించిన నృత్యం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉపాధ్యక్షుడు చంద్ర యక్కలీ గౌరవ వందనం సమర్పించారు. జనగణమనతో సాంస్కృతి కార్యక్రమాలు ముగిశాయి. వేడుకలకు హాజరైన వారికి చక్కని తెలుగు వారి భోజనం వడ్డించారు.