కాన్సాస్‌లో టీఏజీకేసీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
తెలుగు అసోయేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (టీఏజీకేసీ) ఆధ్వర్యంలో శోభకృతు నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాన్సాస్ నగరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని శ్రావణి మేక ఉపన్యాసంతో ప్రారంభించారు. స్థానిక హిందూ ఆలయ అర్చకులు శ్రీనివాసాచారి పంచాంగ శ్రవణం అనంతరం సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు సరిత ఆద్మ, చందన తియగూర వ్యాఖ్యాతలుగా వ్యవహరిం చారు. తెలుగు సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే కూచిపూడి, భరత నాట్యంతో పాటు జానపద, శాస్త్రీయ నృత్యాలతో పిల్లలు, పెద్దలు అలరించారు. మధ్యలో శ్రీనిధి రావు తన పాటలతో అందరినీ అలరించారు. నూతన కార్యవర్గ సభ్యులను టీఏజీకేసీ అధ్యక్షుడు నరేంద్ర దూదెళ్ల, కొత్త ట్రస్ట్ మెంబర్లను ట్రస్ట్ ఛైర్ శ్రీధర్ అమిరెడ్డి అందరికీ పరిచయం చేశారు.
అనంతరం నరేంద్ర దూదెళ్ల మాట్లాడుతూ పిల్లలు, పెద్దలంతా ఇంట్లో తెలుగులో మాట్లాడాలని సూచించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను పాటించడమే కాకుండా రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని కోరారు. ఆ తర్వాత రాఫెల్స్‌లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అనంతరం టీఏజీకేసీ ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ యక్కలి చెప్పిన ఓట్ ఆఫ్ థాంక్స్‌తో కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్ర మాన్ని విజయవంతం చేసిన వారికి టీఏజీకేసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డు కృతజ్ఞతలు తెలిపింది. అనంతరం పాల్గొన్న వారందరికీ చక్కని తెలుగు భోజనం వడ్డించారు.