ఆకట్టుకున్న ‘తాజా’ బతుకమ్మ వేడుకలు
ఫ్లోరిడాలోని జాక్సన్విల్లే నగరంలో ‘‘తాజా’’ (జాక్సన్విల్లే తెలుగు సంఘం) అధ్యక్షులు మహేష్ బచ్చు ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ మరియు దసరా పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలకు జాక్సన్విల్లే మరియు సెంట్ జాన్స్ జంట నగరాల ప్రవాస తెలుగు కుటుంబ సభ్యులు దాదాపుగా వెయ్యి మంది వరకు హాజరయ్యారు. తాజా కార్యవర్గ సభ్యులు 12 అడుగుల బతుకమ్మను తయారు చేశారు. జాక్సన్విల్లేలో స్థిరపడ్డ తెలుగు ఆడపడుచులందరూ రంగురంగుల పూలను అందంగా పేర్చి, వాటిపైన గౌరమ్మని పెట్టి, దీపపు వెలుగులలో, అగరవత్తుల వాసనలతో పూజలు చేసి తీసుకొనివచ్చినారు.
జాక్సన్విల్లే పురోహితులు శ్రీమాన్ శ్రీ శ్రీనాధ్ సాంప్రదాయ బద్దంగా గౌరీ పూజ నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను వలయాకారంలో పెట్టుకొని, భక్తిశ్రద్దలతో బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాల నృత్యాలతో, చప్పట్లు కొడుతూ సందడి చేసినారు. కార్యక్రమం నిర్వహించిన పాఠశాల ప్రాంగణమంతా బతుకమ్మ పాటలతో మార్మోగినది. పసుపుతో చేసిన గౌరమ్మను పూజించి ముత్తైదువులు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తాజా కార్యవర్గం వారు ప్రతి ఆడపడుచుకు తాంబూలం అందించారు. బతుకమ్మ పాటలు పాడిన పిల్లలకు ప్రోత్సాహక బహుమతులను మరియు ఉత్తమ బతుకమ్మలను తెచ్చిన పదిమంది ఆడపడుచులకు తాజా కార్యవర్గ సభ్యులు బహుమతులను అందచేసినారు.
ఇదే కార్యక్రమములో దసరా పండుగను కూడా జరుపుకున్నారు. స్వదేశం నుండి తెచ్చిన జమ్మి ఆకును ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకొని అలయ్- బలయ్ తో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కళ్ళ ముందు ఆనందాన్ని ఇచ్చిన బతుకమ్మలను డప్పు చప్పుళ్లు, కోలాటాలతో, కేరింతలతో గంగ ఒడ్డుకు చేర్చి ‘‘బతుకమ్మ `మమ్మల్ని చల్లగా బతికించమ్మ’’ అంటూ వేడుకుంటూ నీటిలో నిమజ్జనం చేసినారు. జాక్సన్విల్లే లోని ‘‘మా కిచెన్’’ భోజనాలయం వారి సహకారంతో ‘‘తాజా’’ వారు భోజనాలు ఏర్పాటు చేసినారు. ఇందులో తెలంగాణా వంటకాలను ప్రత్యేకంగా వడ్డించారు. ఈ కార్యక్రమాన్ని గైడ్ స్టూడియోస్ అధినేత సంజీబ్ సింగ్ తన కెమెరాలో బంధించారు. తాజా అధ్యక్షులు శ్రీ మహేష్ బచ్చు అధ్యక్షోపన్యాసం చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయంవంతం చేసిన కార్యవర్గ సభ్యులకు ధన్యవాదములు తెలియచేసినారు.
ఈ కార్యక్రమానికి సరితా రెడ్డి, శ్రావణి తోడుపునూరి, రమ బిక్కవల్లి వర్షిణి గండే, కృష్ణ పులగం, సందీప్ వేముల, అశోక్ దేవులపల్లి, విశ్వం గంది, భాస్కర్ పాకాల, వినాయక్ గుత్తికొండ, ప్రకాష్ జలగం, అజయ్ చెరుకూరి, మురళి మద్దిరాల, విజయ్ గరికపాటి, శివ పంపాటి, నరసింహా రెడ్డి మదాడి, జయప్రకాశ్ పోకల, వర్మ పెన్మత్స, పవన్ కుమార్, డెకర్ మంత్ర ఈవెంట్స్ వారు, శ్యామల పోలాటి, శ్రీదేవి ముక్కోటి, సమతా దేవునూరి, మల్లి సత్తి, సురేష్ మిట్టపల్లి, నాగేశ్వర రావు సూరె, సురేష్ చెంచల, రాజేష్ చందుపట్ల, ధను ముద్రాతి మరియు యువ కార్యవర్గ సభ్యులు సహాయ సహకారాలను అందించారు.
ఈ కార్యక్రమానికి ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిల్చిన Vyra Jewellers, Shobha Batchan US Tech, GTA, Decor Mantra Events, Trendy Collections, Shreyeas Jewels, Aduri Group వారికి తాజా అధ్యక్షులు శ్రీ మహేష్ బచ్చు ధన్యవాదములు తెలియజేశారు.