అంబరాన్నంటిన సంక్రాతి సంబరాలు
తెలుగింటి క్రాంతి సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో స్థిరపడిన తెలుగువారికి సంక్రాంతి పెద్ద సంబరమే. “సరదాగా ఈ సాయంత్రం సంక్రాంతి సంబరాలు జరుపుకుందాం రండి!” అంటూ ఆహ్వానం పలికిన మెంఫిస్ తెలుగు సమితి అధ్యక్షులు వాన రత్నాకర్ శనివారం సాయంత్రం 4 నుండి 9 వరకు కాలేర్విల్లె హైస్కూల్లో “తెలుగు పల్లె” ని అద్భుతంగా ఆవిష్కరించారు. అట్టహాసంగా జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమం ఓ దృశ్య కావ్యంగా సాగింది.
పల్లె వాకిట రంగవల్లులు సహజం కానీ, దేశం కానీ దేశంలో రంగవల్లులే కాదు, చిన్నారులకి భోగి పళ్ళు, చెరుకు గడలు, పట్టు చీరల రెపరెపలు, బిళ్ళ గోచి, జరీ అంచు ఉత్తరీయాలు, కొత్త పైటలతో (పైట కుదరని) పడచుల రుస రుసలు. ఎటు చూసినా పండుగ వాతావరణం, అంబరాన్నంటిన కోలాహలం. ఈ ఉత్సవంలో పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా అందరికి సుపరిచితురాలైన అఖిల మామండూరు సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణ. మెంఫిస్ తెలుగు సమితి గత రెండువారాలుగా సాహిత్య, సంగీత, నృత్య, అలంకరణ, ముగ్గులు, అల్లికలు, కేశాలంకరణ మరెన్నో విభాగాల్లో పోటీలు నిర్వహించింది. ఈ సంక్రాంతి సంబరాల్లో విజేతలకు సర్టిఫికేట్లు, బహుమానాలు ప్రధానం చేసారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఈ సంక్రాంతి సంబరాల్లో స్థానిక తెలుగు కుటుంబాలు వైవిధ్యంతో కూడుకొన్న సాంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలు, భువన విజయం, అన్నమయ్య సంకీర్తనలకు నృత్యాలు, జానపద నృత్యాలు, టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర గీతాలకి నృత్యాలు ప్రదర్శించారు.
ఆంధ్రుల గోంగూర పచ్చడి, కమ్మ(ని) పొడి, అరిసెలు, గారెలు, పులిహోర, చెక్కర పొంగలి, మామిడికాయ పప్పు, బంగాళా దుంప కూర, ములక్కాడ చిక్కుడుతో కలిపి చేసిన కూర, దద్దోజనం ఇలా మరెన్నో వంటకాల విందు భోజనం, ఆంద్ర కిల్లి ఆరగింపుతో కార్యక్రమం పసందుగా ముగిసింది. గౌరి ససిపల్లి, అనిల్ బయన్న, అశ్విన్ అన్నపురెడ్డి, చిరంజీవి గొంప, ఉమా బెల్డ్, రాఘవేంద్ర ధనికుల, పావని పెనుగొండ, రామచందర్ గోలి, జనార్దన్ పగడాల, సురేంద్రనాథ్ మొక్కపాటి, రంగ కురేటి, సందీప్ చిట్టి, గౌతమ సంధ్య మట్టే, ఫణి తెంగలపల్లి, రాజా చెన్నం, కృష్ణ పెరి మరియు ప్రశాంతి నక్క ఈ కార్యక్రమ నిర్వాహక కార్యవర్గం.