ASBL Koncept Ambience

అత్యంత వైభవంగా ‘తామా’ ఉగాది ఉత్సవాలు

అత్యంత వైభవంగా  ‘తామా’ ఉగాది ఉత్సవాలు

అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ (తెలుగు అసోసియేషన్ అఫ్ అట్లాంటా) వారి శ్రీ శుభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది ఉత్సవాలు ఏప్రిల్ 9 న అల్ఫారెట్టా లోని డెన్మార్క్ హైస్కూల్ లో అత్యంత వైభవంగా, అట్ఠహాసంగా జరిగాయి. విద్య, వినోదం, వికాసం, విందు వంటి విలక్షణ మేళవింపులతో ఆద్యంతం ఆనందోత్సాహాలతో సాగిన ఈ కార్యక్రమంలొ 1350 మంది పాల్గొనడం ముదావహం. ఉగాది ఉత్సవాలకు ప్లాటినం స్పాన్సర్స్ గా నార్త్ ఈస్ట్ మోర్ట్ గేజ్, గోల్డ్ స్పాన్సర్స్ గా బిర్యానీ ప్లేస్ & అడ్డా స్పోర్ట్స్ రెస్టారెంట్, సిల్వర్ స్పాన్సర్స్ గా 360 హెల్త్ బెనిఫిట్స్, ఇండియాకో గ్రోసరీస్, కానాప్ సిస్టమ్స్, స్టెల్లార్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్రాంజ్ స్పాన్సర్స్ గా రియల్ ఎస్టేట్ రాక్ స్టార్స్, గరుడ వేగా, ఇండస్ వ్యాలీ ఆర్గానిక్స్, కర్నాలా రియాల్టీ వ్యవహరించారు.

ముందుగా విద్యార్థులకు క్యూరీ లెర్నింగ్ వారు నిర్వహించిన మ్యాత్, సైన్స్, ఇంగ్లీష్ నాలెడ్జ్ బౌల్ లో సుమారు 200 మంది పిల్లలు ఎంతో నిబద్దతతో పోటీపడ్డారు. గెలుపొందిన విజేతలకు తామా వారు బహుమతులను అందజేసారు. తరువాత సాంస్కృతిక కార్యదర్శి సునీత పొట్నూరు ఉగాది శుభాకాంక్షలతో అందరికీ స్వాగతం పలికి, తామా కార్యవర్గ మరియూ బోర్డు సభ్యులను వేదిక మీదకు ఆహ్వానించారు. విఘ్నేశ్వరునికి జ్యోతి ప్రజ్వలనతో సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. తామా అధ్యక్షులు రవి కల్లి తామా చరిత్ర గురించి వివరించి, అన్ని వయసుల వారికి చేస్తున్న ప్రజా ఉపయుక్త కార్యక్రమాల గురించి సవివరంగా తెలిపారు. బోర్డు ఛైర్మన్ శ్రీరామ్ రొయ్యల తామా ఉచిత క్లినిక్, సెమినార్లు, స్కాలర్షిప్స్ వంటి కార్యక్రమాల గురించి విపులీకరించారు. ఉగాది అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. శ్రీ సత్యనారాయణ స్వామి గుడి ప్రధాన పూజారి బ్రహ్మశ్రీ మేడిచెర్ల నాగరవి కుమార్ శర్మ గారు పంచాంగ శ్రవణం గావించగా, ఆహుతులు శ్రద్ధగా ఆలకించారు. ప్రముఖ వ్యాపారస్తులు మరియూ స్పాన్సర్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ లో ఆభరణాలు, వస్త్రాలు, ప్రత్యేక ఆహార పదార్థాలు మొదలగునవి విశేషంగా ఆకట్టుకున్నాయి. చాలామంది కలియ తిరుగుతూ, వివరాలు కనుక్కుంటూ, వస్తువులు కొనుగోలు చేయడం కనిపించింది. ఆద్యంతం సాగిన రాఫుల్ టిక్కెట్లు, వైవిధ్యమైన, బహుమతులు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ముఖ్య అతిధి అయిన ఫోర్సైత్ కౌంటీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ వెస్ మెక్కాల్ గారిని పుష్పగుచ్చం, శాలువ మరియు జ్ఞాపికలతో రవి మరియూ ఇతర సభ్యులు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగు వారు ఇక్కడి సమాజానికి చాలా తోడ్పడుతున్నారని మెచ్చుకొని, అందరికీ క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు. అలానే, ఈ ఉత్సవాలు ఇంత ఉన్నత స్థాయిలో జరగడానికి కారణభూతులైన స్పాన్సర్స్ అందరినీ తామా వారు వేదిక మీదకు ఆహ్వానించి ఘనంగా సత్కరించుకున్నారు. వారు తమకు, తామాకు ఉన్న అనుబంధం గుర్తుచేసుకుంటూ, ఇది ఇలాగే కొనసాగుతుందనీ, ఇలాంటి కార్యక్రమం చేయటం ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదని చెప్పి, తామా జట్టుని అభినందించారు. 2021 ఉగాది సందర్భంగా జార్జియా గవర్నర్ కెంప్ ఉగాదిని తెలుగు సంవత్సరంగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి, తెలుగువారు గర్వపడేలా ప్రొక్లమేషన్ అందజేశారు. ప్రముఖ జర్నలిస్ట్ రవి పోణంగి గారు గవర్నర్ ఆఫీస్ తో పని చేసి ఈ గుర్తింపు తెప్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన మాట్లాడుతూ, ఎందరో తెలుగువారు తోడ్పడ్డారనీ, తామా వారి కృషి ఎంతో శ్లాఘనీయమనీ, తామా ప్రతినిధి ఉపాధ్యక్షులు సాయిరామ్ కారుమంచి మరియూ ఇతర సభ్యులు ఎంతగా తోడ్పడ్డారో వివరించి, తామా సంస్థ కోసం ప్రత్యేకంగా గవర్నర్ కెంప్ స్వహస్తాలతో సంతకం చేసి ఇచ్చిన ప్రొక్లమేషన్ పత్రాన్ని అందజేశారు.

అట్లాంటా కళాకారులు ప్రదర్శించిన భక్తి గీతాలు, సినిమా నృత్యాలు, శాస్త్రీయ సంగీతం, జానపద గీతాలు, మెడ్లీలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి. విన్నూత్నంగా సాగిన వేరు వేరు తరాల తెలుగు ఇంగ్లీష్ మ్యుయాన్స్,, ఫ్యాషన్ షో వంటి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. యాంకర్ సమీరా తన చతురతతో, ఆకట్టుకునే వ్యాఖ్యానాలతో అందరినీ కట్టి పడేశారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికీ ప్రశంసా పత్రాలు అందజేసారు. అలాగే, ప్రముఖ తెలుగు సినీ గాయకులు అఖిల మరియు సందీప్ పాటల హరివిల్లుతో వేదిక ప్రాంగణం హోరెత్తింది. చిన్న పెద్ద అందరూ వేదిక మీదకు వచ్చి డ్యాన్సులు చెయ్యడం కొసమెరుపు. తామా వారు విశిష్ట అతిథులు సమీరా, అఖిల, సందీప్ లను సత్కరించారు.

ఈ ఉగాది ఉత్సవాలలో ఇండియా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన వంటకాలతో పాటు షడ్రుచుల ఉగాది పచ్చడి మరియు బిర్యానీ ప్లేస్ & అడ్డా స్పోర్ట్స్ రెస్టారెంట్ వారు అందించిన సహపంక్తి భోజనాలు అట్లాంటా తెలుగు వారి జిహ్వ చాపల్యాన్ని తీర్చాయనడంలో అతిశయోక్తి లేదు. 20 కి పైగా వంటకాలతో, 50 మందికి పైగా వాలంటీర్ల సహాయంతో భారతదేశంలోని పెళ్ళిళ్ళను మరిపించేలా, అమెరికాలో అత్యుత్తమ బంతి భోజనాలు అందించడం తామా వారికే సాధ్యం. అతిథి దేవోభవ అన్న సూక్తి ప్రేరణతో, కొసరి కొసరి వడ్డించడం, అందరికీ అన్ని పదార్థాలు వస్తున్నాయో లేదో చూసుకోవడం వల్ల వచ్చిన వారందరూ సంతృప్తిగా భోజనం చేయడం కనిపించింది. వాలంటీర్లు తామా కి మూల స్తంభాలు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సారి ఎంతో మంది చిన్న పిల్లలు, యువత ముందుకు రావడం గమనించదగ్గ విషయం. అధ్యక్షులు రవి కల్లి ఆధ్వర్యం లో సాగిన ఈ కార్యక్రమానికి బోర్డు సభ్యులు ఇన్నయ్య ఎనుముల హాస్పిటాలిటీకి, కోశాధికారి రూపేంద్ర వేములపల్లి రిజిస్ట్రేషన్ కి, సునీత సాంస్కృతిక కార్యక్రమాలకు, సాయిరామ్ భోజనాల ఏర్పాట్లకు సమన్వయకర్తలుగా వ్యవహరించారు.

ఆడిటోరియంలో, స్టాల్ల్స్ దగ్గర, భోజనాల దగ్గర ఇలా ఎక్కడ చూసినా ఎంతో మంది ఉండటం, ఆప్యాయంగా పలకరించుకోవడం, కొత్త పరిచయాలు పెంచుకోవడం, వివిధ ఏర్పాట్ల గురించి మెచ్చుకోలుగా మాట్లాడుకోవడం, ఎన్నో మధుర స్మృతులతో సంతోషంగా సాగటం వంటివి తామా వారికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి ఉత్తేజాన్నిచ్చే విషయాలు. చివరిగా సాయిరామ్ ఉత్సవాలను అత్యద్భుతంగా విజయవంతం చేసిన జార్జియా పజ్రలకు, స్పాన్సర్లకు, ఆహ్వానితులకు, అతిధులకు, ప్రేక్షకులకు, కళాకారులకు, ఆడియ ఫోటో వీడియో బైట్ గ్రాఫ్ వారికి, వాలంటీర్స్ కు ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని ముగించారు.

 

Click here for Event Gallery

Tags :