కర్నూలులో రవి పొట్లూరి ఆధ్వర్యంలో 50వ రోజు కొనసాగిన తానా అన్నదానం
1,50,000 భోజన ప్యాకెట్ల పంపిణీ
కోవిడ్ 19 వైరస్ కారణంగా కర్నూలు ప్రజలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఇబ్బందుల్లో ఉన్న కర్నూలు ప్రజలను ఆదుకునేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి ముందుకు వచ్చారు. దాదాపు నెలన్నర రోజులకుపైగా కర్నూలు నగరంలోనూ, ఇతర పరిసర ప్రాంతాల్లోనూ ఉంటున్న నిరుపేదలకోసం తానా తరపున అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 1,50,000 భోజన ప్యాకెట్లను పంపిణీ చేశారు. కరోనా బాధితుల సేవలో ముందుంటున్న పోలీసు సిబ్బందికి, పారిశుద్ధ్య విభాగం సిబ్బందికి, ఆరోగ్య సిబ్బందితోపాటు పేదలకు ఈ ప్యాకెట్లను అందించినట్లు రవి పొట్లూరి తెలిపారు. కర్నూలులోని శ్రీ బాలాజీ క్యాంటీన్, శ్రీసాయి ఎంటర్ ప్రైజెస్, సస్య గ్రూపు తదితరులు ఈ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నట్లు ఆయన చెప్పారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారని, ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రవి పొట్లూరి పేర్కొన్నారు.