కొత్తగూడెంలో తానా 5కె రన్ కు భారీ ఏర్పాట్లు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) చైతన్య స్రవంతి కార్యక్రమాల్లో భాగంగా కొత్తగూడెంలో ఈనెల 28వ తేదీన 5కె రన్‌ను నిర్వహిస్తున్నట్లు తానా ప్రెసిడెంట్ ఎలక్ట్, చైతన్యస్రవంతి కో ఆర్డినేటర్ జయశేఖర్ తాళ్ళూరి తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఈ నిర్వహణలో భాగస్వామిగా వ్యవహరిస్తోందని కూడా ఆయన చెప్పారు. ఐఎంఏ హాల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 28న ఉదయం 7.30 గంటలకు ప్రకాశం స్టేడియం నుంచి లక్ష్మిదేవిపల్లి మండలంలోని సెంట్రల్ పార్కు వరకు 5కే రన్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం పై అవగాహనా కల్పించేందుకు ఈ రన్ ను నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని సుమారు వంద పాఠశాలల్లో జిల్లా ఎన్నారై పౌండేషన్, తానా సంయుక్తంగా డిజిటల్ తరగతులకు కావాల్సిన వస్తువులను అందజేస్తోందని చెప్పారు.ఈ కార్యక్రమంలో 5కే రన్ నిర్వహణ కమిటీ సభ్యులు కోనేరు పూర్ణచంద్రరావు, వంశీకష్ణ, అత్తులూరి ఉమామహేశ్వరరావు, డాక్టర్లు విజయకుమార్ నాగరాజు టీ.విజేందర్ రావు పాల్గొన్నారు.