గుంటూరు జిల్లాలో 'తానా' రైతుకోసం కార్యక్రమం ప్రారంభం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్యస్రవంతి కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు జిల్లాలోని మాచర్లలో రైతుకోసం కార్యక్రమాన్ని ప్రారంభించింది. మాచర్ల పట్టణంలోని నరిశెట్టి కళ్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ సతీష్ వేమన, తానా మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి, గంగాధర్ నాదెళ్ళ, బోర్డ్ డైరెక్టర్ చలపతి, సభ్యులు రాజా, రాకేష్, జానయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు జంపాల చౌదరి మాట్లాడుతూ, తానా కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా మాతృరాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగువాళ్ళకు కూడా తమవంతుగా సాయపడాలనే ఉద్దేశ్యంతోనే చైతన్యస్రవంతి కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. రైతులు ఎరువులు, పురుగు మందులు చల్లే సమయంలో ధరించేందుకు వీలుగా పిపిఇ పేరుతో కిట్‌లు అందిస్తున్నట్లు చెప్పారు. ఎరువుల మోతాదును తెలుసుకునేందుకు హ్యాండిల్ గ్రీన్‌శేఖర్ పేరుతో పరికరాలను అందజేస్తామని చెప్పారు. తామంతా రైతు బిడ్డలమని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. అనంతరం 400 మంది రైతులకు రైతు రక్షణ పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగు దేశం పార్టీ నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.