ASBL Koncept Ambience

తానాలో 70 శాతం మంది రైతు బిడ్డలే : జానయ్య

తానాలో 70 శాతం మంది రైతు బిడ్డలే : జానయ్య

ఉత్తర అమెరికా తెలుగు సంఘంలో (తానా)70 శాతం మంది రైతు బిడ్డలేనని తానా వ్వవసాయ విభాగం  ప్రతినిధి కోట జానయ్య అన్నారు. మండలంలో హరిపురంలో భాగవతుల ఛారిటబుల్‌ ట్రస్టు (బీసీటీ) కృషి విజ్ఞానకేంద్రంలో (కేవీకే) ప్రారంభమైన జైకిసాన్‌-జైవిజ్ఞాన్‌ వారోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. పురుగు మందుల పిచికారీ సమయంలో కలిగే దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవడానికి రైతులకు ఉచితంగా రక్షణ కిట్లను ఈ వారోత్సవాల్లో పంపిణీ చేశారు. సింజెంటా ఫౌండేషన్‌ ఇండియా వారి సహకారంతో 300 మంది రైతులకు ఈ కిట్లు పంపిణి చేసినట్లు జానయ్య తెలిపారు. ఇవేకాకుండా  మనరాష్ట్రంలో మొక్కల్లో నత్రజని గుర్తించే పరికరాలు, నేల పరీక్ష కిట్లు రైతులకు ఇస్తున్నామన్నారు.

సింజెంటూ ఫౌండేషన్‌ ఇండియా ప్రతినిధి బి.టి.శేషాద్రి మాట్లాడుతూ రక్షణ కిట్లను రైతులు వినియోగించుకోవాలన్నారు. వ్యవసాయంలో పురుగు మందుల అవశేషాలు లేని ఉత్పత్తులను అందించే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో తొమ్మిది మందిని వ్యవసాయ విక్రయదారులుగా బీసీటీ సహకారంతో తయారుచేశామని శేషాద్రి చెప్పారు. 40 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో బీసీటీ చేస్తున్న కార్యక్రమాలను ఆ సంస్థ కార్యదర్శి బి.శ్రీరామూర్తి వివరించారు. కేవీకే సీనియర్‌  శాస్త్రవేత్త డాక్టర్‌ శైలజ కుర్రా మాట్లాడుతూ ఏడు రోజులపాటు జరిగే వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా ప్రతినిధులు అంజయ్య చౌదరి, జనార్దన్‌, బీసీటీ సంయుక్త కార్యదర్శి టి.వి.ఎస్‌.రాఘవరావు, సోమయాజులు, కేవీకే శాస్త్రవేత్తలు ఆశ, నాగేంద్ర, ఎనిమిది మండలాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. 

 

Tags :