తానా ఎన్నికలు సజావుగా జరుగటానికి అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నాము : బోర్డ్ చైర్మన్ డా. బండ్ల హనుమయ్య
తానా సభ్యులకే కాదు... అనేకమంది తెలుగువారికి మితభాషి, మృదుస్వభావి, అందరివాడుగా తెలిసిన డా. బండ్ల హనుమయ్య ప్రస్తుతం తానా బోర్డ్‌కి చైర్మన్‌గా ఉన్నారు. ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చైర్మన్‌గా ఉండటం చాలామంచిది అని అందరి అభిప్రాయం కూడా. తానా ఎన్నికల నిర్వహణపై తెలుగు టైమ్స్ డా. బండ్ల హనుమయ్యను సంప్రదించినప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఇవి.
తానా ఎన్నికల నిర్వహణకు కార్యవర్గం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసిపోవాలి. అయితే ఈ మధ్యలో వచ్చిన కోర్టు వివాదాల వల్ల ఈ షెడ్యూల్ సమయంలో ఎన్నికలు జరగలేదు. దాంతో కొత్త షెడ్యూల్‌ను ప్రకటించాల్సి ఉంది.
ఆర్బిట్రేషన్ ప్రక్రియ టెక్నికల్‌గా పూర్తి కావడానికి ఇంకా చిన్న పని ఉంది. ఆర్బిట్రేషన్‌కు వెళ్లినవారికి వోటు హక్కు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకున్నా, వారికి అయిన ఖర్చులను తిరిగి చెల్లించడానికి 2వారాలు గడువు ఇచ్చారు. ఆ పని జరిగాక ఆర్బిట్రేషన్ పూర్తి అవుతుంది. అప్పుడు ఈ ఎన్నికల విషయంలో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు (Injunction orders) ఉపసంహరణ జరిగినట్లుగా భావించాలి. అందుకే ఆ తరువాతే కొత్త షెడ్యూల్‌ని బోర్డ్ లో పెట్టి బోర్డ్ ఆమోదం తీసుకుని ప్రకటిస్తాము.
అంతేకాదు ఎన్నికల నిర్వహణకోసం మళ్ళీ ఒక షెడ్యూల్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో మే 4న జరిగిన బోర్డ్ మీటింగ్‌లో చర్చించడం జరిగింది. కాని ఎన్నికల తేదీలను మార్చే విషయంలో తానా బైలాస్ ప్రకారం బోర్డ్‌లో 2/3వ వంతు మెజారిటీతో మార్చాలన్న నిబంధన ఉంది. కాని ఆరోజు జరిగిన బోర్డ్ సమావేశంలో ముగ్గురు డైరెక్టర్లు ఎన్నికల బరిలో ఉన్నారు గనుక వారు వోటు చేయకూడదు. మిగతావారిలో సమావేశానికి కావాల్సిన మెజారిటీ రాకపోవడం వలన ఎన్నికల తేదీల మార్పుపై ఎలాంటి నిర్ణయం జరగలేదు. మరోసారి బోర్డ్ సమావేశం జరిపి ఎన్నికల తేదీ మీద నిర్ణయం తీసుకోగలమని ఆశిస్తున్నాము.
అలాగే చాల సమయం నుంచి పెండింగ్ లో ఉన్న ఇంకొక విషయంపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నికల నిర్వహణ జరపాలని తానా బోర్డ్ నిర్ణయం తీసుకుంది. ఈ విధానంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలను తయారు చేసుకుని ముందుకు వెళ్తాము.
ఏదీ ఏమైనా ఎన్నికలు సజావుగా జరుగుతుందనే ఆశిస్తున్నానని హనుమయ్య బండ్ల తెలిపారు.