ASBL Koncept Ambience

తానా ఎన్నికల పై కొన సాగుతున్న ప్రతిష్టంభన! ఎన్నికల ఫలితాలు ప్రకటించలేని స్థితిలో తానా బోర్డ్...

తానా ఎన్నికల పై కొన సాగుతున్న ప్రతిష్టంభన! ఎన్నికల ఫలితాలు ప్రకటించలేని స్థితిలో తానా బోర్డ్...

తానా సభ్యులే కాకుండా తెలుగు కమ్యూనిటీలో చాలా మంది ఎంతో  ఉత్కంఠతో ఎదురు చూసిన తానా ఎన్నికల  ఫలితాలు 17 జనవరి 2024 రావటం, డా. నరేన్‌ కొడాలి వర్గం దాదాపు అన్ని పదవులను, మంచి మెజారిటీతో చేజిక్కించుకోవడం అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎన్నికల ఫలితాలు అమెరికాలోని మీడియాలోనే కాకుండా, తెలుగు రాష్ట్రాలలోని అన్ని దిన పత్రికలలో, టీవీ ఛానెల్స్‌లో ప్రముఖంగా రావటం అందరికీ తెలిసిన విషయమే. భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి, శ్రీ వెంకయ్య నాయుడుతో సహా అనేక మంది అభినందన సందేశాలు ఇవ్వటం, సోషల్‌ మీడియా అంతా ఈ గెలుపుపై ఫోకస్‌ పెట్టటం కూడా అందరికీ తెలుసు.

అయితే ఈరోజు వరకు (31, జనవరి 2024) తానా బోర్డ్‌ నుంచి  ఈ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవటం చాలా పెద్ద చర్చనీయాంశంగా మారి పోయింది. సోషల్‌ మీడియాలో, వాట్సప్‌  గ్రూప్‌ లలో మళ్లీ గత 10 రోజులుగా కామెంట్స్‌, కౌంటర్‌ కామెంట్స్‌, పరస్పర దూషణలు జరగటం అందరినీ కలవర పెడుతోంది. ఈ విషయంలో గత వారం  నేను కూడా (తెలుగు టైమ్స్‌ ఎడిటర్‌ గా) ఒక  విశ్లేషణ ఇవ్వటం కూడా జరిగింది. ఈ విషయంలో అందరూ అనుకున్నట్టుగా నెలాఖరుకి ఈ సమస్య ఒక కొలిక్కి రాలేదు కదా.. ఇంకా టైం పట్టేలా ఉన్నట్లు తెలుస్తోంది. సమస్య ఎక్కడ ఉందో కొంచెం విశ్లేషణ చేసుకొందాం.

మొదటగా తానా బై లాస్‌ ప్రకారం ఎన్నికల నిర్వహణ తరువాత ఎవరికైనా ఎన్నికలు జరిపిన ప్రక్రియలో ఏమన్నా సందేహాలు ఉంటే తానా బోర్డ్‌ కి తెలియ చేయవచ్చు - బోర్డ్‌ ఆ ఫిర్యాదును విచారించి సరైన సమాధానం ఇవ్వడం, లేదా ఆ సమస్యని పరిష్కరించే నిర్ణయం తీసుకోవడం చెయ్యాలి.

తన ఓటే ఎవరో వేశారని, తాను ఓటు వెయ్యలేదని తానా మాజీ అధ్యక్షులు శ్రీ జయ్‌ తాళ్లూరి కంప్లైంట్‌ చేశారని తెలిసింది. ఇలాంటి కంప్లైంట్స్‌ చాలా ఉన్నాయని ఎన్నికల్లో ఓడిపోయిన అనేక మంది పిర్యాదు చేస్తున్నారని తానా మాజీ ట్రెజరర్‌, శ్రీ అశోక్‌ కొల్ల బోర్డ్‌ లో చెప్పారని తెలిసింది. తానా బై లాస్‌ ప్రకారం ఈ కంప్లైంట్స్‌ ని పూర్తిగా విచారించాలని తానా అధ్యక్షులు శ్రీ నిరంజన్‌ శృంగవరపు అన్నారని తెలిసింది.

తానా బోర్డ్‌ చైర్మన్‌, డా. బండ్ల హానుమయ్య ఈ విషయంపై గత వారమే వచ్చిన కంప్లైంట్స్‌ మీద ఓటగ్రిటీ సంస్థకి లెటర్‌ రాశామని, వారం రోజులు గడువు ఇచ్చామని,  వారి నుంచి సమాధానం రాగానే బోర్డ్‌ మెంబెర్స్‌ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకొంటామని తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ విషయంపై తానా మాజీ అధ్యక్షులు, ప్రస్తుత బోర్డ్‌ సభ్యులు, శ్రీ జంపాల చౌదరి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు, వాటి మీద కంప్లైంట్స్‌ రాగానే బోర్డ్‌ లో చర్చించి, ఎన్నికలు నిర్వహించిన  ఓటగ్రిటీ సంస్థని అడగాలని నిర్ణయించామని, అన్ని వైపుల నుంచి వచ్చిన కంప్లైంట్స్‌ ని క్రోడీకరించి ఒక లెటర్‌ పంపామని తెలిపారు. అందులో డేటా మొత్తం (24000 మంది ఓటర్ల వివరాలు) కాకుండా కేవలం ఎవరైతే కంప్లైంట్స్‌ ఇచ్చారో వారి కంప్లైంట్‌ కి వివరణ ఇచ్చే విధంగా అవసరమైన మేరకు మాత్రమే డేటా కోరామని, వారం రోజులు గడువు ఇచ్చామని తెలిపారు. గత సోమవారం, 29 జనవరి 24న ఓటెగ్రిటి సంస్థ అడిగిన ప్రశ్నలలో చాలా వాటికి వివరణ ఇచ్చిందని, డేటా పంపాలంటే తానా బోర్డ్‌  Pledge on Data Secrecy ఇవ్వాలని అడిగారని చెప్పారు. ఈ  Pledge ఇవ్వటానికి కొందరు బోర్డ్‌ మెంబర్లు వొప్పుకొని సంతకం చేశారని, కొందరు వొప్పుకొలేదని .. ప్రస్తుతం అక్కడ ఆగి పోయిందని తెలిపారు. డా. జంపాల మాట్లాడుతూ ఈ విషయమై మిగతావారు కూడా ఒప్పుకొని సంతకం పెడతారని ఆశిస్తున్నామని అన్నారు.

కాగా మరోవైపు బోర్డ్‌లో సభ్యుడైన జాని నిమ్మలపూడి ఈ ఫిర్యాదులపై స్పందిస్తూ ఎలక్షన్ ట్రస్ట్ తానా బోర్డ్ అడిగిన అన్ని విషయాలకు సమాధానం ఇచ్చిందని, అవి అన్నీ కూడా ఎన్నికల నిర్వహణ పద్ధతిగా జరిగాయనే చెపుతున్నాయి కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళి సాధించేది ఎది వుండదని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని అన్నారు.

తానా ఫౌండేషన్‌ మాజీ చైర్మన్‌ ప్రసాద్‌ నల్లూరి మాట్లాడుతూ, తానా బైలాస్‌ ప్రకారం ఎన్నికల నిర్వహణలో ఏదైనా లోపం ఉంటే అభ్యర్థి తన ఫిర్యాదుతో పాటు సాక్ష్యాధారాలను కూడా ఇవ్వాలి. వాటిపై బోర్డ్‌ 48 గంటల్లో రెస్పాండ్‌ అవ్వాలి. కాని ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేసే వ్యక్తి తగిన సాక్ష్యాధారాలను ఇవ్వకుండా బోర్డ్‌ ను దీనిపై విచారించాలని కోరడం సబబుగా కనిపించడం లేదని, ఇది కాలయాపన కోసం ఇలాంటి ఫిర్యాదులను ఇచ్చినట్లు కనిపిస్తోందని చెప్పారు. అలాగే మూడవ పార్టీ అయిన ఎలక్షన్‌ ట్రస్ట్‌ తన వెబ్‌ సైట్‌ లో చాలా క్లియర్‌ గా ఓటర్‌ డాటా అంటా గోప్యంగా ఉంచుతామని పేర్కొంది. ఇప్పుడు ఆ డాటా అడగటం, తీసుకోవడం రెండూ తప్పేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అలాగే తానా మాజీ అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, కేవలం ఒక ఆధారాలు లేని ఒక చిన్న విషయం పై ఇంకా కాలయాపన చెయ్యకుండా బోర్డ్ మెజారిటీ తానా సభ్యులు ఎన్నుకున్నవారిని విజేతలుగా ప్రకటించి, సభ్యుల మనోభావాలను గౌరవించాలని పేర్కొన్నారు. 

ఈ విధమైన  కారణాల వలన ఎన్నికల ఫలితాలు అధికారికంగా ప్రకటించక పోవటం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి ఆన్న విషయం తెలిసినదే. ‘ఈ వర్గ పోరాటం లో ఇప్పటికే దిగజారిన తానా ప్రతిష్టను మరింత దిగజార్చకండి ‘ అని ఎందరో భాధ పడుతూ సోషల్‌ మీడియా లో పోస్ట్స్‌ పెడుతున్నారు.

తెలుగు టైమ్స్‌ ప్రారంభమైనప్పటి నుంచి గత 20 సంవత్సరాలుగా తానాతో ఉన్న అనుబంధం కారణంగా తానాలో ప్రస్తుతం ఎన్నికల అనంతరం జరుగుతున్న పరిణామాలపై ఇరువర్గాలు సంయమనంతో వ్యవహరించి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని, ఈ విషయంలో సోషల్‌ మీడియా వేదికగా దూషణలకు దిగకుండా తానా పేరు ప్రతిష్టలను కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలని తెలుగు టైమ్స్‌ కోరుతోంది.


చెన్నూరి వేంకట సుబ్బా రావు 
ఎడిటర్ - తెలుగు టైమ్స్

 

 

Tags :