ASBL Koncept Ambience

కోర్టు ఆర్బిట్రేషన్‌ పై తానాలో ఇరువర్గాల రగడ

కోర్టు ఆర్బిట్రేషన్‌ పై తానాలో ఇరువర్గాల రగడ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ప్రస్తుతం ఎన్నికల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, మెంబర్ షిప్‌ వివాదం మాత్రం తారాస్థాయికి చేరుకుంది. తమకు ఓటుహక్కు కల్పించాలంటూ ఓ ఆరుగురు కోర్టుకెక్కడంతో ఈ వివాదం కోర్టు ముంగిటకు చేరింది.

దీనిపై కోర్టు ఆర్బిట్రేషన్‌ ఏర్పాటు చేయడం, ఇంతలోపలే తానా బోర్డ్‌ ఆ ఆరుగురిలో ముగ్గురికి ఓటు హక్కు ఇస్తున్నట్లు సాధారణ మెజారిటీతో ఆమోదించడం వంటివి జరిగిపోయాయి. అయినా మిగిలిన ముగ్గురు విషయం లో కోర్టు తీర్పు కోసం అందరూ ఎదురు చూడాలి వచ్చింది. ఆ ముగ్గురి కి కూడా ఓటు హక్కు ఇవ్వాలని కోర్టు అభిప్రాయం గా 26 ఏప్రిల్ 2023 తేదీన ఆర్బీట్రేషన్ వెలువడంతో  ఈ వివాదం ముగిసిందని అందరూ భావించారు. వచ్చిన తీర్పు నీ మళ్లీ తానా బోర్డ్ సమావేశం జరిపి ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తరువాత ఎన్నికల నిర్వహణ కమిటీ మళ్లీ ఎన్నికలకు ఇచ్చిన గడువు తేదీలు మార్పు చేసి ప్రకటన ఇవల్సి వుంటుంది.

అయితే ఈ జడ్జిమెంట్‌ను రెండు వర్గాలు తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ ప్రకటనలు చేసుకోవటం, సోషల్ మీడియా లో చర్చలు జరపటం తో సామాన్య సభ్యులకు మళ్లీ అర్థం కాని  పరిస్తితి ఏర్పడింది.

గోగినేని-తాళ్ళూరి వర్గం ప్రకటన: 

ఈ తీర్పుపై గోగినేని - తాళ్ళూరి వర్గం మాట్లాడుతూ, ఇది తమకు నైతిక విజయమని, తమపై దుష్ప్రచారం చేసినవారికి ఇది చెంపపెట్టు అని పేర్కొంది. ముఖ్యంగా ఎన్నికలు రసవత్తరంగా జరుగబోతున్న ప్రస్తుత తరుణంలో ‘కొడాలి-లావు’ ల వర్గమునకు ఇది భారీ ‘పరాజయం’ గాను, ‘గోగినేని-తాళ్లూరి’ ల వర్గానికి నైతిక ‘విజయంగా’ను ఆ వర్గానికి చెందిన సభ్యులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎం వీ సి కమిటి సమష్టి బాధ్యత అనే విషయాన్ని వక్రీకరిస్తూ, ఎం వీ సి చైర్మన్‌ ‘నిరంజన్‌ శృంగవరపు’ను దోషిగా పేర్కొంటూ చేస్తున్న విపక్షాల ప్రచారానికి ఇక అడ్డుకట్ట పడినట్లేనని వారు తెలిపారు.

ఈ తీర్పులో ఏమున్నదంటే....‘తానా’ బోర్డు తీసుకున్న చర్యలను సమర్ధిస్తూ కేసును కొట్టిస్తున్నట్లు ప్రకటించింది. అనుకోకుండా వచ్చిన వేలాది మంది సభ్యుల మూలకంగా వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తి అయి ఉండకపోవచ్చును, అంతేకాని ఉద్దేశ్య పూర్వకముగా ఇది జరిగినట్లుగా భావించడం లేదని, అదే సమయంలో ఎం వీ సి చైర్మన్‌ ఇచ్చిన ప్రకటనను నమ్ముతున్నట్లు, ఉద్దేశ్యపూర్వకంగా ఆలస్యం చేసిట్లు భావించటం లేదని చెబుతూ, వేలాది సభ్యులు ఒక్కుమ్మడిగా చేరడంవలనను, వెరిఫికేషన్‌ అంతిమ తేదీను గమనించకపోవడము వలననే ఈ పరిస్థితి కలిగినందువల్లనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోందని పేర్కొంది.

లావు - నరేన్‌ వర్గం ప్రతిస్పందన: 

ఈ తీర్పు స్పందించిన లావు-నరేన్‌ వర్గం కోర్టుకు వెళ్ళినందువల్లనే వారికి ఓటు హక్కు లభించిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. కోర్టులో తీర్పు తమకు వ్యతిరేకంగా రావచ్చన్న భావనతో బోర్డ్‌ సాధారణ మెజారిటీతో వారికి ఓటు హక్కు ఇచ్చిందని అంటూ, ఈ నిర్ణయాన్ని వారు కోర్టుకు వెళ్ళిన సమయంలోనే చేసి ఉంటే తానాకు సమయంతోపాటు రెండు లక్షల డాలర్లు ఆదా అయ్యేవని చెప్పింది. విలువైన నాలుగు నెలలు వృథా అయిపోయి.. కోర్టు ఖర్చుల కింద రెండు లక్షల డాలర్లు తానా బోర్డుకు ఖర్చుకు అయిపోయాయి. పోనీ తానా బోర్డు వారికి ఓటు హక్కు దక్కకుండా గెలిచిందా అంటే అదీ లేదు. చివరకు ఆ ముగ్గురికి ఓటు హక్కు వచ్చింది. కోర్టులో వారిపై పోరాడిన తానా బోర్డు మాత్రం రెండు లక్షలు పోయి ఓటు హక్కు ఇచ్చి నిండా మునిగిందని పేర్కొంది. ఇప్పటికైనా తానా బోర్డు కొత్తగా చేరినవారందరికీ కూడా ఓటు హక్కు ఇచ్చేలా చూడాలని లేకుంటే కోర్టు ఖర్చులు అనవసరంగా  ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఈ రెండు వర్గాలు కాకుండా, అసలు తానా కు కేవలం కొందరి ఇగోల కారణంగా కోర్టు కి వెళ్ళే పరిస్తితి, దాదాపు 2 లక్షల డాలర్లు ఖర్చు పెట్టే పరిస్తితి వచ్చిందని చెపుతూ, ఆ రెండు లక్షల డాలర్లు కూడా బోర్డ్ సభ్యులు కట్టాలి తప్ప, తానా సంస్థ నిధులు వాడకూడదు అని, ఆ విధంగా చెయ్యాలని కోర్టు కి కూడా వెళ్ళే ఉద్దేశ్యం ఉందని కొందరు వ్యాఖ్యానించటం జరిగింది. ఈ విషయం పై సోషల్ మీడియా లో చర్చలు కూడా జరగటం తో ఈ ఇరు వర్గాల రగడ మరింత వేడి గా తయారయ్యింది అని చెప్పొచ్చు.

 

 

Tags :