తానా బిజినెస్ సెమినార్ కు ప్రముఖుల రాక
తానా కాన్ఫరెన్స్‌లో నిర్వహించే బిజినెస్ సెమినార్‌లకు ఎంతో ప్రత్యేకత ఉంది. అమెరికాలో స్థిరపడిన తెలుగు కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా ఈ బిజినెస్ సెమినార్‌లు ఉంటాయి. బిజినెస్ రంగంలో సలహాలు, సూచనలతోపాటు ఆయా రంగాల్లో ఎలా ప్రవేశించాలో, బిజినెస్ ఎలా చేయాలన్నదానిపై మార్గాలను ఈ సెమినార్‌లో ప్రసంగించే వక్తలు చూపుతుంటారు. అందుకే ఈ బిజినెస్ సెమినార్‌కు హాజరయ్యేందుకు అమెరికాలో ఉంటున్న ఎంతోమంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఇతరులు ప్రాధాన్యత ఇస్తుంటారు.
తానా 22వ మహాసభల్లో కూడా బిజినెస్ సెమినార్‌లను ఏర్పాటు చేశారు ఈ సెమినార్‌కు ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్, మాజీ యుఎస్ రాయబారి వినయ్ తుమ్మలపల్లి, రప్పపోర్ట్ మేనెజ్‌మెంట్ కంపెనీ సిఇఓ గారి రప్పపోర్ట్, యునిసిస్ ఫెడరల్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ వెంకటపతి పువ్వాడ, రిచన్ ఫార్మా సిఇఓ, ఇన్‌జీనియస్ ఫార్మా ప్రెసిడెంట్ రాజ్ దేవలపల్లి తదితరులు హాజరవుతున్నారు. కపిల్ దేవ్ మంచి వక్త అన్న విషయం తెలిసిందే. లైఫ్‌లో ఎలా ఉండాలో చెప్పడంలో ఆయన దిట్ట. అలాగే వినయ్ తుమ్మలపల్లి వివిధ రంగాల్లో ఎలా ఎదగాలో చెబుతారు. బిజినెస్‌లో ఎదిగేందుకు ఉన్న అవకాశాలను తమ అనుభవాలతో ఇతరులు వివరించనున్నారు.
ఈ బిజినెస్ సెమినార్‌లో పలు ముఖ్యమైన అంశాలను చర్చించనున్నారు. అందులో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న అవకాశాలతో లాభదాయక బిజినెస్‌ను చేయడం వంటివి ఫెడరల్ ఐటీ బిజినెస్ అపర్చునిటీస్, ప్రముఖ ఐటీ సంస్థల నుంచి కాంట్రాక్ట్‌లను పొందడంలో, ఐటీ కంపెనీల ఎదుగుదలకు అవసరమైన మెళకువలను వివరించడం వంటివి కూడా ఈ బిజినెస్ సెమినార్‌లో ఉన్న ప్రాధాన్యత అంశాల్లో ఒకటిగా ఉంది. నేడు ఫార్మారంగంలో ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ఇలాంటి రంగంలో ఉన్న అవకాశాలు, బిజినెస్ చేయడానికి అవసరమైన సూచనలను, సలహాలను ఇందులో చేయనున్నారు. ఇబి 5 ద్వారా లభించే ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవడం వంటివి కూడా నిష్ణాతులు ఇందులో వివరించను న్నారు. ఇందులో పాల్గొనడం వల్ల తమ సందేహాలను నివృత్తి చేసుకోవడంతోపాటు, ఇతర బిజినెస్ ప్రముఖులతో కూడా వ్యాపార విషయాలను చర్చించుకునే అవకాశం ఈ బిజినెస్ సెమినార్ వల్ల కలుగుతుంది. అందరూ ఈ బిజినెస్ సెమినార్‌కు హాజరవ్వాలని తానా కాన్ఫరెన్స్ నాయకత్వం కోరుతోంది.