పాశ్యాత్యమోజులో పడకండి - మోహన్ నన్నపనేని
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమాలు కనువిందు చేశాయి. లక్కీపేటలోని ఎ కన్వెన్షన్ సెంటర్‌లో డిసెంబర్ 21వ తేదీన జరిగిన ఈ కార్యక్రమానికి అమెరికా నుంచి వచ్చిన తానా ప్రముఖులతోపాటు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని మాట్లాడుతూ, అమెరికాలో తెలుగు సంస్కృతికి జీవం పోసేలా తానా కార్యక్రమాలు ఉంటున్నాయని చెప్పారు. పాశ్చాత్యమోజులో ఇక్కడ ఉన్న యువతరం మన ప్రాచీన కళలను, భాషా మాధుర్యాన్ని మరవరాదనే ఉద్దేశ్యంతో తానా చైతన్యస్రవంతి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ఇందులో భాగంగా మరుగునపడుతున్న అనేక కళలను నేటితరానికి పరిచయం చేయడంతోపాటు రేపటితరంకోసం పరిరక్షించాలన్న ఉద్దేశ్యంతో కళాకారులను సన్మానిస్తోందన్నారు. వచ్చే జూలైలో డిట్రాయిట్‌లో జరిగే తానా మహాసభలు పురస్కరించుకుని, మహాసభల ప్రచారంతోపాటు జానపద కళలను ప్రోత్సహించేలా తానా మాతృరాష్ట్రాలలో కార్యక్రమాలను చేస్తోందన్నారు.